న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కెరీర్‌లో మరో రికార్డు నమోదైంది. ఇప్పటికే ఆసియా ఖండ అపరకుబేరుడిగా నిలిచిన ఆయన.. తాజాగా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంత సారథుల్లో ఒకరిగా చోటు సంపాదించారు.

2019 సంవత్సరానికి ప్రపంచ కార్పొరేట్ సంస్థల సీఈఓల పనితీరుపై సీఈఓ వరల్డ్‌ మ్యాగజైన్‌ ఒక నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 121 మంది అత్యుత్తమ సీఈఓలతో కూడిన ఈ జాబితాలో 10 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. 

వీరిలో అర్సెలర్‌ మిట్టల్‌ ఛైర్మన్‌, సీఈఓ లక్ష్మీ మిట్టల్‌ జాబితాలో మూడో ర్యాంక్ పొందగా, ముకేశ్‌ అంబానీకి 49వ ర్యాంకు లభించింది. 96 దేశాల్లో 1,200కి పైగా సీఈఓల పనితీరును పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ఇచ్చినట్లు సీఈఓ వరల్డ్‌ పేర్కొంది. 

ఆయా సంవత్సరాల్లో ఆ సీఈఓ నేతృత్వంలోని కంపెనీ వెల్లడించిన ఆర్థిక ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నట్లు సీఈఓ వరల్డ్ తెలిపింది. తుది ర్యాంకుల నిర్ధారణలో 60 శాతం వరకు ఈ ఫలితాలనే ప్రామాణికంగా చేసుకున్నామని వెల్లడించింది. 

మిగిలిన 40 శాతం పాలనా వ్యవహారాలు, షేర్లు, మార్కెట్‌ విలువలో మార్పు, బ్రాండ్‌ నికర విలువ, దాని ప్రభావం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని సీఈఓ వరల్డ్ పేర్కొంది. భారతీయుల్లో లక్ష్మీ మిట్టల్‌, ముకేశ్‌ అంబానీతోపాటు ఎనిమిది భారతీయ సంస్థల సీఈఓలు ఉన్నారు.  

ఈ జాబితాలో ర్యాంకులు పొందిన వారిలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) ఛైర్మన్‌, ఎండీ శశి శంకర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ ఉన్నారు. సంజీవ్‌ సింగ్‌ 69వ స్థానంలోనూ, శశి శంకర్‌ 77వ స్థానంలోనూ, రజనీశ్‌ కుమార్‌ 83వ స్థానంలో నిలిచారు. 

ఇక దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌ సీఈఓ గ్యుంటేర్‌ బషేక్‌కు 89వ స్థానం, బీపీసీఎల్‌ ఛైర్మన్‌, ఎండీ డీ రాజ్‌కుమార్‌కు 94వ, రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డీ రాజేశ్‌ మెహతాకు 99వ స్థానం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌, విప్రో సీఈఓ అబిదాలి జెడ్‌ నీముచ్‌వాలాలకు 118వ స్థానం లభించాయని సీఈఓ వరల్డ్ పేర్కొంది.

గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ సీఈఓ డౌగ్లాస్‌ మెక్‌మిలన్‌కు మొదటి స్థానం లభించింది. రెండోస్థానంలో రాయల్‌ డచ్‌ షెల్‌ గ్లోబల్‌ సీఈఓ బెన్‌ వాన్‌ బూర్డన్‌, మూడో స్థానంలో అర్సెలర్‌ మిట్టల్‌ ఛైర్మన్‌ లక్ష్మీ మిట్టల్‌, నాల్గో స్థానంలో సౌదీ అరామ్‌కో సీఈఓ అమిన్‌ హెచ్‌ నాజర్‌ నిలిచారు. 

అంతర్జాతీయంగా ఆపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌కు తొమ్మిదో ర్యాంకు లభించగా.. బెర్క్‌షైర్‌ హాత్‌వ్‌ సీఈఓ వారెన్‌ బఫెట్‌కు 10వ స్థానం, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌బెజోస్‌కు 11వ స్థానం, శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సారథి కిమ్‌ కి నామ్‌కు 13వ స్థానం లభించిందని సీఈఓ వరల్డ్ వివరించింది.