Asianet News TeluguAsianet News Telugu

గ్లోబల్ థింకర్ ‘రిలయన్స్’ అధినేత ముకేశ్ అంబానీ

టెక్నాలజీ రంగంలో గ్లోబల్ థింకర్‌గా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. పారిన్ పాలసీ అనే సంస్థ 100 మందితో కూడిన ‘గ్లోబల్ థింకర్స్ -2019’ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డే తదితరులు చోటు దక్కించుకున్నారు.

Mukesh Ambani in top Global Thinkers list of Foreign Policy
Author
Mumbai, First Published Jan 17, 2019, 11:32 AM IST

ముంబై: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్‌ అంబానీ ‘గ్లోబల్ థింకర్’గా నిలిచారు. ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ‘ఫారిన్‌ పాలసీ’ మొత్తం 100 మందితో ‘గ్లోబల్‌ థింకర్స్‌’-2019 జాబితా రూపొందించింది. ప్రస్తుతం కొంత మంది పేర్లే పేర్కొంది పూర్తి జాబితాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నది.

చైనాకు చెందిన ఆన్ లైన్ రిటైల్ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా, అమెజాన్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) జెఫ్‌ బెజోస్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అధిపతి క్రిస్టీన్‌ లగార్డే కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

‘44.3 బిలియన్‌ డాలర్లతో జాక్‌మా స్థానాన్ని తోసిరాజని గతేడాది ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్‌ అంబానీ అవతరించారు. చమురు, రిటైల్‌ రంగాల నుంచి ఆయన ఎక్కువ సంపద సంపాదించినా, తన కొత్త టెలికాం సంస్థ  జియోతో భారత్‌పై అమిత ప్రభావాన్ని చూపారు’అనిని ఫారిన్‌ పాలసీ పేర్కొన్నది.

‘సెల్యులార్‌ డేటా, వాయిస్‌ కాల్స్‌ను తొలి ఆరు నెలల పాటు ఉచితంగా ఇవ్వడం ద్వారా 10 కోట్ల మందికి పైగా వినియోగదార్లను ఎంతో త్వరగా తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఇంటర్నెట్‌ వినియోగం వేగవంతం చేశారు. ఇక తదుపరి దశలో గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలతో పోటీపడుతూ, డిజిటల్‌ వాయు తరంగాలను ఉపయోగించుకుని కంటెంట్‌, ఇతర ఉత్పత్తులను ముకేశ్‌ విక్రయిస్తారు’అని ఆ సంస్థ పేర్కొంది.

గ్లోబల్‌ థింకర్స్‌ జాబితా పదో వార్షికోత్సవం సందర్భంగా ఫారిన్‌ పాలసీ తన జాబితాను 10 విభాగాలుగా చేసి.. ఒక్కో విభాగంలో పది మంది పేర్లు ఇవ్వాలని నిర్ణయించింది. గత దశాబ్దిలో ప్రపంచంపై గొప్ప ప్రభావం చూపిన వారితో తొలి గ్రూపు పేర్లు ఇవ్వనున్నది.

గతేడాదిలో ప్రభావాన్ని చూపిన వ్యక్తులతో ఇతర గ్రూపులను నింపింది. అందులో భాగంగా 40 ఏళ్లలోపు ఆలోచనాపరులు, రక్షణ, భద్రతా రంగాలు, విద్యుత్‌ - వాతావరణం, సాంకేతికత, ఆర్థిక శాస్త్రం - వ్యాపారం, విజ్ఞానం - ఆరోగ్యం, కార్యకలాపాలు, కళలు.. ఇలా రకరకాలుగా విభజించింది.  

సాంకేతిక ఆలోచనాపరుల జాబితాలో అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గత దశాబ్దిలో ప్రభావాన్ని చూపిన వ్యక్తుల జాబితాలో జాక్‌మా, క్రిస్టీన్‌ లగార్డే చోటు చేసుకున్నారు. యూరోపియన్‌ కమిషనర్‌ ఫర్‌ కాంపిటిషన్‌ మార్గరెట్‌ వెస్టాగర్‌, టీవీ వ్యాఖ్యాత ఫరీద్‌ జకారియా, బిల్‌-మిలిందా గేట్స్‌, అమెజాన్‌ సీఈఓ బెజోస్‌ ఇందులో చోటు దక్కించుకున్నారు.ఇక న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆడెర్న్‌ 40 ఏళ్ల లోపు ఆలోచనాపరుల జాబితాలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios