రిలయన్స్ ఏజీఎం భేటీలో సంస్థ అధినేత ముకేశ్ అంబానీ చేసిన ప్రకటన మదుపర్లను ఆకట్టుకున్నది. ఫలితంగా కేవలం రెండు రోజుల్లోనే ఆయన సంపద రికార్డు స్థాయిలో రూ.29 వేల కోట్లు పెరిగింది.
న్యూఢిల్లీ: భారత అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద విలువ గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండు రోజుల్లోనే దాదాపు రూ.29 వేల కోట్లు ఎగబాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 42వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) జరిగినప్పటి నుంచి ఆ సంస్థ ప్రధాన ప్రమోటర్ అంబానీ సంపద విలువ రికార్డు స్థాయిలో ఎగిసింది మరి.
దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు రోజైన సోమవారం ఏజీఎం జరుగగా, మంగళ, బుధవారం ట్రేడింగుల్లో రిలయన్స్ మార్కెట్ విలువ విపరీతంగా పుంజుకున్నది. జియో గిగా ఫైబర్ ఆఫర్, సౌదీ ఆరామ్ కో రూ.1.06 లక్షల కోట్ల పెట్టుబడులు, 18 నెలల్లో రుణ రహిత రిలయన్స్ లక్ష్యం, బ్రిటిష్ పెట్రోలియం రూ.7 వేల కోట్ల పెట్టుబడులు తదితర ప్రకటనలు, ఒప్పందాలు మదుపరులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఆందోళనలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైనా, రిలయన్స్ షేర్ విలువ మాత్రం 10% లాభపడింది. శుక్రవారం రూ.1,162 వద్ద ముగిసిన రిలయన్స్ షేర్ విలువ.. బుధవారం రూ.1,288.30 వద్ద నిలిచింది. దీంతో మంగళ, బుధవారాల్లో సంస్థ మార్కెట్ విలువ 4 బిలియన్ డాలర్లు (రూ.28,684 కోట్లు) పెరిగింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 16, 2019, 10:14 AM IST