టెలికం రంగంలో రంగ ప్రవేశంతోపాటు విజయవంతంగా దూసుకెళుతున్న రిలయన్స్ జియో.. ఇతర టెలికం ప్రొవైడర్ల సబ్‌స్క్రైబర్లు అనునిత్యం తన వైపునకు మళ్లిస్తోంది. ఇప్పటివరకు జియో సబ్ స్క్రైబర్లు 28 కోట్ల మందికి చేరుకున్నారు. విజయవంతమైన ఈ అనుభవంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ భారతదేశ తొలి ఇంటర్నెట్ టైకూన్ తలపోస్తున్నారు.

జియో సర్వీసుతో భారత టెలికం రంగాన్ని, యావత్ దేశాన్ని మార్చేసిన ముకేశ్ అంబానీ జియో అండగా.. ప్రస్తుతం మరో జాక్ మా, మరో ఇండియన్ జెఫ్ బెజోస్ అవతారం ఎత్తాలని కోరుకుంటున్నారు. గతేడాది నవంబర్ నెలాఖరు నాటికి మొబైల్ ఫోన్ కస్టమర్ల పునాది 117 కోట్ల మందికి చేరుకున్నదని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొంది.  

బ్రాడ్ బాండ్ యూజర్ల బేస్ 50 కోట్లకు చేరగా, వాటిలో 97 శాతం వైర్‌లెస్ కనెక్షన్లు ఉన్నాయి. చౌక డేటా ప్లాన్లను అందుబాటులోకి తెచ్చిన జియో 28 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో మెగా బేస్ స్రుష్టించుకున్నది. టెలికం రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా టెక్ దిగ్గజం కావాలన్నది ముకేశ్ అంబానీ వ్యూహం.

అందుకే టెలికం, టీవీ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారాయన. క్రికెట్ మ్యాచ్‌లు. డిస్నీ ఫిల్మ్‌లను ‘జియో టీవీ’ వేదికలో సరఫరా చేస్తున్నారు. ఈ నెల 18న అహ్మదాబాద్ నగరంలో జరిగిన ‘గుజరాత్ వైబ్రంట్’సదస్సులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ వచ్చే దశాబ్దంలో తన పెట్టుబడులను, ఉపాధి అవకాశాలను రెట్టింపు చేస్తుందని ప్రకటించారు.

‘డేటా కాలనైజేషన్’కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని ముకేశ్ అంబానీ కోరారు. త్వరలో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ సంస్థలతో కలిసి చిన్న రిటైల్ వ్యాపారుల కోసం ‘న్యూ ఈ-కామర్స్’ వేదికను ఆవిష్కరిస్తామని ‘గుజరాత్ వైబ్రంట్’సదస్సులో ముకేశ్ అంబానీ ప్రకటించారు. తొలుత గుజరాత్, తదుపరి దశలో దేశమంతటా విస్తరిస్తామని చెప్పారు. 

గతవారం వెల్లడించిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో రిలయన్స్ జియో ఇన్ఫోకాం 65 శాతం పురోగతి సాధించింది. రిలయన్స్ జియో నికర లాభం రూ.831 కోట్లకు చేరుకున్నది. సరిగ్గా 2017-18 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో రూ.504 కోట్లు పలికింది.