ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5.3 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ తాజాగా అంచనా వేసింది. గత నెలలోవేసిన 5.4 శాతం అంచనాలను 10 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) మేర కుదించింది. అంచనాల కుదింపునకు కరోనా వైరస్‌ ప్రభావమే కారణమని  పేర్కొడం గమనార్హం.
 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి అంచనాలను మూడీస్‌ తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తొలుత 6.6 శాతం అంచనాలను ఫిబ్రవరిలో 5.4 శాతానికి కుదించింది. తాజాగా దీనిని 5.3 శాతానికి తగ్గించింది. 2020లో భారత్‌ జీడీపీ 5.3 శాతం. 2018లో ఈ రేటు 7.4 శాతంగా ఉంది. 

2021లో వృద్ధి రేటు కాస్త పుంజుకుని 5.8 శాతంగా నమోదు కావచ్చునని మూడీస్ అంచనా వేసింది. కరోనా వైరస్‌ వల్ల దేశీయంగా డిమాండ్‌ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. వస్తు సేవల సరఫరా చైన్లలో అంతర్జాతీయంగా తీవ్ర విఘాతం ఏర్పడటమే దీనికి కారణం అని తెలుస్తోంది. 

పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కరోనా ప్రభావంతో అంతర్జాతీయ మందగమన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందని మూడీస్ తెలిపింది. మరోవైపు మందగమన ధోరణులను ఎదుర్కొనడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్న అంశాలను వేచిచూడాల్సి ఉన్నదని వ్యాఖ్యానించింది.  

ఇక అతి తక్కువ స్థాయి చమురు ధరలు దిగి వచ్చినా చమురు ఎగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించకపోవచ్చునని మూడీస్ స్పష్టం చేసింది. ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు వాణిజ్య లోటుపై ఊరటనిచ్చే అంశం. 

కోవిడ్‌–19 వల్ల భారత్‌ ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టాన్ని తక్కువ స్థాయి క్రూడ్‌ ధర ‘తగిన భారీ స్థాయిలోనే’ సర్దుబాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు మంగళవారం పేర్కొన్నారు. 2020–21లో ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలతలు ఉన్నా, ప్రభుత్వ ఉద్దీపన చర్యలు వృద్ధికి కొంత మేర ఊపునిస్తాయని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.