హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత ఈ మధ్యకాలంలో గౌతమ్ అదానీ కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం ఇటీవల జరిగింది.
దేశంలోనే అత్యంత ధనవంతులైన కుటుంబాలలో ఒకటైన గౌతం అదానీ కుటుంబంలో పెళ్లి బాజా మోగనుంది. గౌతం అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివాతో వివాహం చేసుకోబోతున్నారు. మార్చి 12న ఇరు కుటుంబాలు ఓ నిరాడంబర వేడుకలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. దివా సూరత్ ప్రసిద్ధ వజ్రాల వ్యాపారుల్లో ఒకరైన జైమిన్ షా కుమార్తె. జైమిన్ షా ప్రముఖ వజ్రాల కంపెనీ అయిన సి దినేష్ & కో ప్రైవేట్ లిమిటెడ్ యజమాని. సూరత్‌తో పాటు ముంబైలో కూడా దీనికి శాఖ ఉంది. చిన్ను దోషి, దినేష్ షా సంయుక్తంగా ఈ కంపెనీని ప్రారంభించారు.
జీత్ అదానీ యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుండి తన చదువును పూర్తి చేసి, 2019లో అదానీ గ్రూప్ ఆఫ్ బిజినెస్‌లలో చేరాడు. ప్రస్తుతం అదానీ గ్రూప్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అతను అదానీ గ్రూప్ CFO కార్యాలయంతో తన వృత్తిని ప్రారంభించాడు. అతను గ్రూపు కంపెనీల్లో వ్యూహాత్మక ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్లు రిస్క్ & గవర్నెన్స్ విధానాలను చూసుకుంటున్నారు.

అదానీ గ్రూప్ వెబ్‌సైట్ ప్రకారం, జీత్ "అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారానికి అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు అధిపతిగా ఉన్నారు - ఇది అదానీ గ్రూప్ వ్యాపారాల వినియోగదారులందరికీ సూపర్ యాప్‌ను రూపొందించడానికి సిద్ధంగా ఉంది".
గౌతమ్ అదానీ పెద్ద కొడుకు కరణ్‌కి సిరిల్ ష్రాఫ్ కూతురు పరిధా ష్రాఫ్‌తో వివాహం జరిగింది. అతను సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ లా సంస్థకు మేనేజింగ్ పార్టనర్. కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ SEZ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు.
ఇదిలా ఉంటే హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లన్నీ దారుణంగా పడిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో జీత్ అదానీ పెళ్లి అదానీ కుటుంబానికి పండగ కళ తెచ్చింది. కంపెనీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి అక్రమాలకు పాల్పడిందన్న హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా అదానీకి చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు మొత్తం రోజుల వ్యవధిలో 100 బిలియన్ల మార్కెట్ క్యాప్ కోల్పోయాయి.
