ముంబై: టెక్నాలజీ సంస్థ ‘మైండ్‌ట్రీ’ని ఎల్ అండ్ టీ పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌కే మైండ్‌ట్రీ ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల ప్యానల్‌ పచ్చ జెండా ఊపింది. తద్వారా తమ సంస్థను ఎల్ అండ్ టీ టేకోవర్ చేసుకునేందుకు మార్గం సుగమం చేసింది. ఈ మేరకు మంగళవారం సమావేశమైన మైండ్‌ట్రీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌, రేడియో సిటీ సీఈఓ అపూర్వ పురోహిత్‌ ఈ ప్యానల్‌కు నేతృత్వం వహించారు.

అపూర్వ పురోహిత్ సారథ్యంలోని ఈ ప్యానల్‌.. ఓపెన్‌ ఆఫర్‌ను పరిశీలించి తన సిఫారసులను మే 10 నాటికల్లా అందజేయనుంది. ఒకవేళ ఓపెన్‌ ఆఫర్‌ ధరను సవరించాల్సి వస్తే అదే నెల 13 కన్నా ముందే ఎల్‌ అండ్‌ టీ ఆ ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది. కాగా మైండ్‌ట్రీ కో ఫౌండర్‌ కృష్ణకుమార్‌ నటరాజన్‌ యధావిధిగా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హోదాలో కొనసాగాలని ఎల్‌ అండ్‌ టీ సూచించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు మైండ్ ట్రీ సంస్థలో షేర్ల కొనుగోలు కోసం ఎల్‌ అండ్‌ టీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. మైండ్‌ట్రీలో 31 శాతం షేర్లను కొనుగోలు చేసేందుకు మే 14న ఈ ఓపెన్‌ ఆఫర్‌ ప్రారంభం కానుందని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. అదే నెల 27వ తేదీన ఓపెన్‌ ఆఫర్‌ ముగియనుందని పేర్కొంది. మంగళవారం ఈ మేరకు ఎల్‌ అండ్‌ టీ పూర్తి వివరాలతో కూడిన ప్రకటన (డీపీఎస్)ను విడుదల చేసింది.

ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా మైండ్‌ట్రీలో 31 శాతం వాటాలకు సమానమైన 5.13 లక్షల షేర్లను కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరును రూ.980 ధర వద్ద కొనుగోలు చేయనున్నట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. ఇందుకోసం ఎల్‌ అండ్‌ టీ రూ.5,030 కోట్లు కేటాయించనుంది. 
 
ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేయనున్న షేర్లు.. ఇటు వాటాదారులకు.. అటు లక్షిత (టార్గెట్‌) కంపెనీ వాటాదారులకు మధ్య,దీర్ఘకాలంలో లబ్ధి చేకూర్చనుందని తెలిపింది. కాగా మంగళవారం మైండ్‌ట్రీ షేరు 1.10 శాతం లాభంతో రూ.950.55 వద్ద స్థిరపడింది. 

ఎల్‌ అండ్‌ టీ ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌ ధర మైండ్‌ట్రీ వాటాదారులకు మంచి విలువను అందించేలా ఉందని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. మైండ్‌ట్రీ ఓపెన్‌ ఆఫర్‌కు సంబంధించి ఏప్రిల్‌ 2 వ తేదీ నాటికి ముసాయిదా లేఖను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ఎల్‌ అండ్‌ టీ అందించనుంది.
 
మైండ్‌ట్రీలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న కేఫ్‌ కాఫీ డే చైర్మన్‌ వీజీ సిద్ధార్థ నుంచి ఎల్‌ అండ్‌ టీ ఈ నెల 18న 20.32 శాతం వాటాను రూ.3,269 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం మరో 46 శాతం వాటాలను కొనుగోలు చేయాలని ఎల్‌ అండ్‌ టీ నిర్ణయించింది. ఇందు లో భాగంగా 15 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా, 31 శాతం వాటాను ప్రస్తుత వాటాదారుల నుంచి కొనుగోలు చేసేందుకు ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించాలని భావించింది.