దేశీయ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ, ఇన్ ఫ్రా దిగ్గజం లార్సన్ అండ్ టర్బో (ఎల్&టి) అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ ఇన్ఫో టెక్ సంస్లలో అనివార్యంగా విలీనం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ బలవంతపు టేకోవర్‌కు పాల్పడే అవకాశమున్నందున.. షేర్ల బైబ్యాక్‌ (తిరిగి కొనుగోలు) ద్వారా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని మైండ్ ట్రీ కంపెనీ యాజమాన్యం భావిస్తోంది.

బైబ్యాక్‌ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 20వ తేదీన బోర్డు సమావేశం కానుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు మైండ్‌ట్రీ సమాచారం అందించింది. సెకండరీ మార్కెట్‌ నుంచి ఈ కంపెనీ రూ.1,000 కోట్ల వరకు షేర్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

బైబ్యాక్‌ ప్రకటిస్తే.. సాధారణంగా మార్కెట్లో షేర్ల ధర పెరుగుతుంది కాబట్టి కంపెనీలో వాటా కొనుగోలు ఎల్‌ అండ్‌ టీకి మరింత భారంగా మారుతుందని మైండ్ ట్రీ అంచనా. తత్ఫలితంగా ప్రత్యర్థి టేకోవర్‌ ప్రయత్నాల నుంచి వెనక్కి తగ్గవచ్చన్నది మైండ్‌ట్రీ యాజమాన్యం వ్యూహం.

మైండ్‌ట్రీలో కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థకు 20.4 శాతం వాటా ఉంది. కంపెనీలో ఆయనే అతిపెద్ద వాటాదారు. మైండ్ ట్రీలో వివిధ సంస్థల ద్వారా వీజీ సిద్ధార్థ ఆ వాటాలను కొనుగోలు చేశారు. తాజాగా ఆయన తన వాటా మొత్తం ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సంస్థకు విక్రయించే విషయంలో అడ్వాన్స్ అయ్యారని సమాచారం.

షేర్ల బై బ్యాక్ పేరిట మైండ్ ట్రీ తీసుకున్న అనూహ్య నిర్ణయం ఎదురు తిరిగే ప్రమాదం కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే వీజీ సిద్ధార్థ వాటా 20.4 శాతం ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఖాతాలో పడిపోయింది.

మరో 30 శాతం గానీ, కొంత వాటా కొనుగోలు చేసినా ఎల్ అండ్ టీ సంస్థ వాటా పెరుగుతుంది. అప్పుడు టేకోవర్ చేసుకునేందుకు ఎల్ అండ్ టీ ప్రయత్నించొచ్చు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం గతేడాది డిసెంబర్ నెలాఖరు నాటికి మైండ్ ట్రీ యాజమాన్యం పెట్టుబడుల రూపంలో రూ.811 కోట్లు, నగదు రూపేణా రూ. 162 కోట్లు కలిగి ఉన్నది.

మైండ్ ట్రీ ప్రమోటర్లు సంస్థలో సుమారు 13 శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నారు. ఒకవేళ మైండ్ ట్రీ యాజమాన్యం షేర్ల బై బ్యాక్ ప్రతిపాదనను ఆమోదించినా కాంపిటీటివ్ ప్రైస్‌కే ఎల్ అండ్ ట్రీ ఇన్ఫోటెక్ కొన్నా ఆశ్చర్యం లేదు. 

మైండ్ ట్రీ నలుగురు వ్యవస్థాపకులు క్రుష్ణకుమార్ నటరాజన్, సుబ్రొతో బాగ్చి, ఎన్ఎస్ పార్థసారథి, రొస్టోవ్ రావణన్ సంయుక్తంగా 13.32 శాతం వాటా కలిగి ఉన్నారు. కొద్ది నెలలుగా ఎల్ అండ్ టీతోపాటు కేకేఆర్ అండ్ కో, బేరింగ్ పీఈ ఆసియా సంస్థలు మైండ్ ట్రీ సంస్థలో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. 

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ 1999 నుంచి మైండ్ ట్రీ సంస్థలో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. మైండ్ ట్రీ ప్రారంభ ఇన్వెస్టర్లలో వీజీ సిద్ధార్థ ఒకరు. వ్యక్తిగత వాటాదారుల వాటా 54.29 శాతం. సంస్థలో ఆయన వాటా 3.3 శాతం, కాఫీ డే వాటా 10.63, కాఫీ డే ట్రేడింగ్ వాటా 6.45 శాతంగా ఉన్నది. 

మైండ్ ట్రీలో ప్రారంభంలో ఆరు శాతం వాటా కొనుగోలు చేసిన వీజీ సిద్దార్థ క్రమంగా తన వాటాను పెంచుకుంటూ పోయారు. మైండ్ ట్రీ మాజీ చైర్మన్ అశోక్ సూతా మాదిరిగానే వైదొలగాలని నిర్ణయించుకున్నారు. గతేడాది బోర్డు నుంచి తప్పుకున్న సిద్ధార్థ తన మేనేజ్మెంట్ హక్కులతో ముందుకు రావడం లేదని తేల్చేశారు. 

వీజీ సిద్దార్థ తన సంస్థల పేరిట వివిధ బ్యాంకర్ల వద్ద తీసుకున్న రూ.3000 కోట్ల విలువైన రుణాల చెల్లింపు కోసం షేర్లను విక్రయించే యోచనలో ఉన్నారు. దీనిపై ప్రస్తుతానికి రెండు నెలల ఇన్వోకేషన్ టైం ఉంది.

ఆ టైంలోగా చెల్లింపులు జరుగకపోతే షేర్లను సదరు బ్యాంకర్లు టేకోవర్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది. అదే జరిగితే మైండ్ ట్రీని విలీనం చేసుకోవాలన్న ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఆశలకు గండి పడుతుందని భావిస్తున్నారు.