Asianet News TeluguAsianet News Telugu

కోట్లు కురిపిస్తున్న మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ: అసోచామ్‌

వచ్చే మూడేళ్లలో మీడియా, వినోద పరిశ్రమ టర్నోవర్ రూ.3.73 లక్షల కోట్లకు చేరుతుందని అసోచాం-పీడబ్ల్యూసీ సంయుక్త సర్వే నిగ్గు తేల్చింది. 

Media and entertainment industry to touch $52,683 million by 2022: ASSOCHAM-PwC
Author
New Delhi, First Published Jan 28, 2019, 12:14 PM IST

వచ్చే మూడేళ్లలో దేశీయ మీడియా, వినోద పరిశ్రమ 2022 నాటికి సుమారు రూ.3.73 లక్షల కోట్ల స్థాయికి చేరవచ్చునని అసోచామ్‌-పీడబ్ల్యూసీ సంయుక్తంగా రూపొందించిన నివేదిక అంచనా వేసింది.

ఖర్చు చేయదగ్గ ఆదాయం పెరగడం, జనాభా అధికమవడం, వివిధ విభాగాల్లో కంటెంట్‌ వినియోగం పెరిగి మీడియా, వినోద పరిశ్రమ మంచి వృద్ధి సాధించొచ్చని పేర్కొంది. సంప్రదాయ టీవీ, సినిమా మీడియాతో పాటు కొత్త తరం ఓటీటీ (ఓవర్‌-ది-టాప్‌) డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ సేవలు ఈ రంగం వృద్ధికి ఎంతో తోడ్పడతాయని అసోచామ్-పీడబ్ల్యూసీ పేర్కొంది.

2022 నాటికి భారతీయ వీడియో ఓటీటీ మార్కెట్‌ సుమారు రూ.5,363 కోట్ల స్థాయికి చేరుకుని అంతర్జాతీయంగా టాప్-10లో నిలుస్తుందని అసోచామ్ వివరించింది. 2017లో మీడియా, వినోద రంగం 30,364 మిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్నదని అసోచామ్-పీడబ్ల్యూసీ పేర్కొన్నది.

అక్కడి నుంచి 11.7 శాతం వార్షిక వృద్ధితో 2022 నాటికి 52,683 మిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అసోచామ్ తెలిపింది. ఈ క్రమంలో టీవీ, సినిమా, ఓటీటీ నుంచే 46% వృద్ధి నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. సంప్రదాయ మీడియా రంగం, ఓటీటీ సంస్థలు భవిష్యత్‌లో ఆకర్షణీయ వృద్ధి నమోదు చేస్తాయని అసోచామ్-పీడబ్ల్యూసీ వివరించింది.

ఓటీటీ సేవలను ప్రవేశపెట్టడంతో వీడియో ఆన్‌ డిమాండ్‌ (వీఓడీ) అనేది మీడియా పరిశ్రమలో విధ్వంసకారిగా మారనుందని అసోచామ్-పీడబ్ల్యూసీ తెలిపింది. సంప్రదాయ స్టూడియోల బడ్జెట్‌తో పోటీ పడుతూ నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వంటివి భారీ పెట్టుబడులు పెడతాయని పేర్కొన్నది. 

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ మార్కెట్‌ 2017-22 మధ్య 10.1% వార్షిక వృద్ధి నమోదు చేయనున్నదని అసోచామ్-పీడబ్ల్యూసీ తెలిపింది. ఇదే సమయంలో దేశీయంగా 22.6% వృద్ధి సాధించనున్నదన్నది. 2017లో దీని విలువ 297 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,932 కోట్లు) కాగా 2022కు 823 మిలియన్‌ డాలర్ల (సుమారు 5,363 కోట్లు) కు చేరుతుందని అంచనా. 

గత దశాబ్ది వీఓడీ మార్కెట్‌ ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నదని అసోచామ్-పీడబ్ల్యూసీ పేర్కొన్నది. ఇటీవల ఇక్కడ స్మార్ట్‌ఫోన్ల వినియోగం బాగా పెరగడంతోపాటు అతి తక్కువ ధరకే డేటా దొరుకుతుండటంతో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని వివరించింది. 

ఇంటర్నెట్‌ ప్రకటనల మార్కెట్‌లో ప్రధానంగా మొబైల్‌ వీడియో ప్రకటనల మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతున్నదని అసోచామ్-పీడబ్ల్యూసీ అంచనా. 2022 నాటికి ఇది 32.8% వార్షిక వృద్ధితో 317 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,064 కోట్లు) స్థాయికి చేరుకుంటుంది.

ఇదే సమయంలో డేటా వినియోగం కూడా 71,67,103 మిలియన్‌ ఎంబీల నుంచి 10,96,58,793 మిలియన్‌ ఎంబీలకు చేరుతుంది. సాంకేతికతను బాగా వినియోగించుకోవడం ద్వారా వినియోగదారుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ, నాణ్యమైన సమాచారాన్ని అందిస్తుండటం వీఓడీ సేవల ప్రొవైడర్ల విజయానికి కారణమవుతోంది.

2021 నాటికి మన మీడియా, వినోద పరిశ్రమపై తలసరి వ్యయం 32 డాలర్లుగా నమోదు కానుంది. అయితే ఇది చైనా (222 డాలర్లు), అమెరికా (2,260 డాలర్లు)లతో పోలిస్తే బాగా తక్కువేనని అసోచామ్-పీడబ్ల్యూసీ నిర్వహించిన అధ్యయనం తేలింది.

Follow Us:
Download App:
  • android
  • ios