Asianet News TeluguAsianet News Telugu

ఎఫ్‌డీఐల్లో మళ్లీ మారిషస్‌దే అగ్రస్థానం

 భారతీయ మార్కెట్‌లో రంగ ప్రవేశం చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) విభాగంలో మారిషస్ మరోసారి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. గతేడాది మరోసారి భారత్‌కు అధిక శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) మారిషస్‌ నుంచే తరలి వచ్చాయి. దీని తరువాత స్థానంలో సింగపూర్‌ నిలిచింది.

Mauritius tops India s FDI charts again
Author
Mumbai, First Published Sep 3, 2018, 10:23 AM IST

ముంబై: భారతీయ మార్కెట్‌లో రంగ ప్రవేశం చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) విభాగంలో మారిషస్ మరోసారి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. గతేడాది మరోసారి భారత్‌కు అధిక శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) మారిషస్‌ నుంచే తరలి వచ్చాయి. దీని తరువాత స్థానంలో సింగపూర్‌ నిలిచింది. 2017-18లో మొత్తం 37.36 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు భారత్‌కు తరలివచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం వచ్చిన 36.31 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి స్వల్పంగా ఎక్కువ. 

13.41 బిలియన్ డాలర్లకు పెరిగిన మారిషస్ ఎఫ్‌డీఐ పెట్టుబడులు
మారిషస్‌ నుంచి వచ్చిన ఎఫ్‌డీఐలు 13.38 బిలియన్ డాలర్ల నుంచి 13.41 బిలియన్ డాలర్లకు పెరిగాయి. సింగపూర్‌ నుంచి వచ్చిన ఎఫ్‌డీఐలు 6.52 శాతం నుంచి 9.27 శాతానికి చేరాయి. ఇదే సమయంలో నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన ఎఫ్‌డీఐలు మాత్రం 3.23 శాతం నుంచి 2.67 శాతానికి తగ్గాయి. ఇదిలా ఉంటే తయారీ రంగంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 11.97 బిలియన్ డాలర్ల నుంచి 7.06 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇదే సమయంలో సమాచార సేవల రంగంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 5.8 బిలియన్ డాలర్ల నుంచి 8.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. రిటైల్‌, టోకు వాణిజ్య రంగంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 2.77 బిలియన్ డాలర్ల నుంచి 4.47 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

గత నెలలో రూ.5,189 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు
ఆగస్టు నెలలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు మొత్తం రూ. 5,189 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కార్పొరేట్ రాబడుల్లో మెరుగుదల, ఆర్థికవ్యవస్థలో సానుకూల గణాంకాలు, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కరెక్షన్ తర్వాత వరుసగా రెండో నెలలో ఎఫ్‌పీఐలు నికరంగా కొనుగోళ్లు జరిపారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య రూ. 61,000 పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు జూలై నెలలో రూ. 2,300 కోట్ల కొనుగోళ్లు జరిపారు. తాజా డిపాజిటరీ డేటా ప్రకారం ఆగస్టు నెలలో ఈక్విటీల్లో రూ. 1,775 కోట్ల పెట్టుబడులు పెట్టగా, రుణ మార్కెట్‌లో రూ. 3,414 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 

పరిస్థితులను బట్టి ఎఫ్ఐఐల పెట్టుబడులు
ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడం, కార్పొరేట్ రాబడుల్లో వృద్ధి, స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలో కరెక్షన్ వంటి అంశాలతో ఎఫ్‌పీఐలు తాజాగా కొనుగోళ్లు జరిపారని మార్నింగ్‌స్టార్ సీనియర్ రిసెర్చ్ అనలిస్టు హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. గతంలో కన్నా ఎఫ్‌పీఐల పెట్టుబడులు తక్కువ మొత్తంలోనే వస్తున్నా, గత త్రైమాసికంతో పోల్చితే మెరుగుపడ్డాయన్నారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఈక్విటీల నుంచి రూ. 2,400 కోట్ల అమ్మకాలు జరపగా, రుణ మార్కెట్ల నుంచి రూ. 38,000 కోట్ల అమ్మకాలు జరిపారు.

తగ్గిన సోలార్ ప్రాజెక్టులు
వాణిజ్య వివాదాలు, ధరల హెచ్చుతగ్గులతో 2018లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన 52 శాతం తగ్గి 1,599 మెగావాట్లకు పడిపోయింది. మెర్కమ్ ఇండియా రిసెర్చీ విడుదల చేసిన సోలార్ మార్కెట్ అప్‌డేట్‌లో గత నాలుగు త్రైమాసికాలు సోలార్ ప్రాజెక్టుల స్థాపన తగ్గుతూ వస్తున్నదని పేర్కొన్నది. 2017 లో జరిగిన వేలం ప్రక్రియ, టెండర్లు తగ్గడం, కనీసస్థాయిలో బిడ్లు దాఖలు కావడం, పీపీఏ సంప్రదింపులు వంటి కారణాలు కూడా సోలార్ ప్రాజెక్టుల స్థాపన తగ్గడానికి కారణాలని మెర్క్ కాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్‌ప్రభు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో భారీ స్థాయి సోలార్ ప్రాజెక్టుల స్థాపన గత త్రైమాసికంతో పోల్చితే 2,954 మెగావాట్ల నుంచి 1,184 మెగావాట్లకు తగ్గింది. గత ఏడాది ఇదేకాలంలో 1,800 మెగావాట్ల స్థాపన జరిగింది. గత రెండు నెలల్లో రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్లు415 మెగావాట్ల మేర జరిగాయి. రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్లు పుంజుకుంటున్నా ముందుగా అంచనా వేసినంతగా లేవని ఆ నివేదికలో పేర్కొన్నారు.

వ్యయం పెరిగితే రూఫ్ టాప్ ఇన్‌స్టలేషన్స్ తగ్గుముఖం
వ్యయాలు పెరిగితే రూఫ్‌టాప్ ఇన్‌స్టలేషన్స్ తగ్గుముఖం పడతాయని తెలిపింది. ఒకవేళ సోలార్ మాడ్యూల్ ధరలు తగ్గు ముఖం పడితే ఈ రంగంలో కొత్త ప్రాజెక్టులు కూడా పెరుగుతాయని మెర్క్ కాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్‌ప్రభు అన్నారు. ఆగస్టు నాటికి మొత్త 24.6 గిగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు స్థాపిత సామర్థ్యం ఉందనీ, ఇందులో 90 శాతం భారీ స్థాయి సోలార్ ప్రాజెక్టులు కాగా, 10 శాతం రూఫ్‌టాప్ ప్రాజెక్టులని వెల్లడించింది. 2018 పూర్తి సంవత్సరానికి 8.3 గిగా వాట్ల అదనపు సామర్థ్య స్థాపన జరగే అవకాశాలున్నట్టు అంచనా వేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios