గ్రాండ్ విటారా ఆధారంగా తయారైన మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ త్వరలోనే లాంచ్ కానుంది. మూడు వరుసలుగా వస్తుందనుకున్న ఈ మోడల్ ఇప్పుడు ఐదు సీట్లతో వస్తుందని సమాచారం. 'మారుతి ఎస్కూడో' గా పిలుస్తున్న ఈ మోడల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?

గ్రాండ్ విటారా ఆధారంగా 'మారుతి ఎస్కూడో’ తయారైంది. పేరు ఇంకా ఖరారు కాలేదు కాని ఎస్కూడో పేరే ఫిక్స్ అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మారుతి Y17 అనే కోడ్ నేమ్‌తో దీన్ని పిలుస్తున్నారు. ఈ మారుతి SUV గురించి ముఖ్యమైన ఐదు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

బ్రెజ్జా కంటే పెద్దది, గ్రాండ్ విటారా కంటే పొడవు

పరిమాణం పరంగా కొత్త మారుతి ఎస్కూడో బ్రెజ్జా కంటే పెద్దదిగా ఉంటుంది. 4,345 mm పొడవున్న గ్రాండ్ విటారా కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. దీని పొడవు 4,330 mm నుండి 4,365 mm వరకు ఉంటుందని అంచనా. 373 లీటర్ల బూట్ స్పేస్ ఉన్న గ్రాండ్ విటారా కంటే ఎస్కూడో బూట్ స్పేస్ కొంచెం పెద్దదిగా ఉండవచ్చు.

కొత్త మారుతి ఎస్కూడో ఫీచర్స్ ఇవే..

ఇది ఒక హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ హైబ్రిడ్ ఆప్షన్లలో లభిస్తుంది. గ్రాండ్ విటారా లాంటి ప్లాట్‌ఫామ్, పవర్‌ట్రెయిన్‌లను మారుతి ఎస్కూడో కలిగి ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఇందులో ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 103 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. శక్తివంతమైన హైబ్రిడ్ సిస్టమ్ 79 bhp, 141 Nm టార్క్ శక్తిని అందిస్తుంది.

ఎప్పుడు లాంచ్ అవుతుంది?

కొత్త మారుతి ఎస్కూడో (మారుతి Y17) అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మకం జరుగుతుందని కంపెనీ ప్రకటించింది. తక్కువ ధరకు ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించాలని కంపెనీ భావిస్తోంది. అయితే గ్రాండ్ విటారాలో లభించే కొన్ని ప్రీమియం ఫీచర్లు దీనిలో ఉండకపోవచ్చు. ఈ కారు లాంచ్ తేదీ 2025 దీపావళి పండుగ సమయంలో అంటే సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యలో ఉంటుందని సమాచారం. 

ధర ఎంతంటే?

మారుతి సుజుకి SUV శ్రేణిలో మారుతి ఎస్కూడో బ్రెజ్జాకు పైన, గ్రాండ్ విటారాకు కింద ఉంటుంది. ధర గురించి ఇప్పుడే క్లారిటీగా చెప్పలేం కాని.. మారుతి ఎస్కూడో గ్రాండ్ విటారా మాదిరిగానే ధర ఉంటుందని అంచనా. బేస్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.10 లక్షల నుండి రూ.11 లక్షల వరకు ఉండవచ్చు. అదే సమయంలో పూర్తిగా లోడ్ అయిన హైబ్రిడ్ వేరియంట్ ధర దాదాపు రూ.20 లక్షలు ఉండవచ్చు.