చమురు ధర మంట పెట్టింది. రూపాయి ముంచేసింది. ఫలితంగా దలాల్‌స్ట్రీట్‌ నష్టాలతో వెలవెలబోయింది. అమ్మకాల ఒత్తిడిని భరించలేక సూచీలు బేర్‌మన్నాయి. రూపాయి పతనం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులు కూడా నష్టాలకు మరింత ఆజ్యం పోశాయి. 

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. 30 సూచీల బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్  సోమవారం ట్రేడింగ్ 467.65 పాయింట్లు నష్టపోయి మూడు వారాల కనిష్టానికి 37,922.17 పాయింట్ల వద్ద ముగిసింది. దీనివల్ల రూ.1.96 లక్షల కోట్ల మదుపర్ల సొమ్ము ఆవిరైపోయింది. బీఎస్ఈ స్టాక్స్ విలువ రూ.1,96,130.84 కోట్లు తగ్గి రూ.1,55,43,657 కోట్ల వద్ద స్థిరపడింది.

ఇలా మార్కెట్లలో బలహీన సంకేతాలు
ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమవడంతో సోమవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 170 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయితే రూపాయి విలువ అంతకంతకూ క్షీణిస్తూ ఉండటంతో ఆర్థిక, స్థిరాస్తి, విద్యుత్‌, లోహ, ఆటోమొబైల్‌, టెలికాం, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సూచీలు మరింత దిగజారాయి. 

మధ్యాహ్నం తర్వాత పూర్తిగా పతనమే
మధ్యాహ్నం తర్వాత సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా పతనమై ప్రతిష్ఠాత్మక 38వేల మార్క్‌ను కోల్పోయింది. అటు నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా నష్టంతో 11,500 మార్క్‌ దిగువన ట్రేడ్‌ అయ్యింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేని సూచీలు చివరకు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

నిఫ్టీ 151 పాయింట్ల(1.30శాతం) నష్టంతో 11,538 వద్ద స్థిర పడింది. ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సిప్లా, టీసీఎస్‌ షేర్లు స్వల్పంగా లాభపడగా.. బజాజ్‌ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్ లిమిటెడ్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు నష్టపోయాయి.

రూపాయి కాస్త కోలుకుని..
డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో సోమవారం ట్రేడింగ్‌లో రూపాయి మారకం విలువగా భారీగా పతనమైంది. క్రితం సెషన్‌లో 71.73 వద్ద ముగిసిన రూపాయి.. సోమవారం ఆరంభం నుంచే క్షీణిస్తూ వస్తోంది. మార్కెట్‌ ఆరంభంలో 45 పైసలు నష్టపోయి రూ. 72.18 వద్ద ట్రేడ్‌ అయిన రూపాయి.. మధ్యాహ్నం సమయంలో మరింత దిగజారింది. ఒక దశలో రూ. 72.67 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం కాస్త కోలుకుని రూ. 72.39గా కొనసాగుతోంది. 2018లో రూపాయి విలువ 13 శాతం పతనమైంది.