Asianet News TeluguAsianet News Telugu

ఈజ్ టైం ఓవర్?: జుకర్‌బర్గ్‌కు ఉద్వాసన తప్పదా?

కేంబ్రిడ్జి అనలిటికా ద్వారా ఖాతాదారుల డేటా తస్కరణ.. తాజా మూడు కోట్ల మంది డేటా హ్యాకింగ్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్ బుక్ వాటాదారుల్లో సీఈఓ కమ్ చైర్మన్ మార్క్ జుకర్ బర్గ్ ను తొలగించాలన్న ప్రతిపాదన వచ్చేసింది. వచ్చే ఏడాది మేలో జరిగే వార్షిక సమావేశంలో ఈ మేరకు జుకర్ బర్గ్ తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి.

Major Facebook shareholders want Mark Zuckerberg out as chairman
Author
New York, First Published Oct 19, 2018, 10:29 AM IST

న్యూయార్క్: ప్రముఖ సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ సీఈఓ ఫేస్‌బుక్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ను ఛైర్మన్‌ కమ్ సీఈఓగా వైదొలిగిపోనున్నారా? తప్పుకోవాల్సిన తరుణం ఆసన్నమైందా? లేదా తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మార్క్ జుకర్ బర్గ్‌ను పదవి నుంచి తప్పించాలని వాటాదార్లు ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ప్రతిపాదన పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇల్లినాయిస్‌, రోడే ఐలాండ్‌, పెన్సుల్వేనియా, న్యూయార్క్‌ రాష్ట్రాల  ట్రెజరర్స్‌ ఈ మేరకు ఓ ప్రతిపాదనను తీసుకొస్తున్నారు. మే 2019 జరిగే ఫేస్‌బుక్‌ వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచాలని భావిస్తున్నారు. 

వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం, వినియోగదారుల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జుకర్ బర్గ్‌ను తప్పించాల్సిందేనన్న వాదనను ముందుకు తెస్తున్నారు. గత కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. కేంబ్రిడ్జ్‌ అనలిటికా వ్యవహారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌ ఇటీవల మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్‌బుక్‌లో 3కోట్ల మంది యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.  

దీనిపై ఇప్పటివరకు ఫేస్‌బుక్‌ స్పందించేందుకు నిరాకరించింది. సమాజంలో ఫేస్‌బుక్‌ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఫేస్‌బుక్‌ సామాజిక, ఆర్థిక బాధ్యతలను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల బోర్డులో స్వతంత్ర, జవాబుదారీతనం ఉండే విధంగా మార్పులు చేయాలని వాటాదారులు డిమాండ్‌ చేస్తున్నారు. స్వతంత్ర బోర్డు లేకపోవడం వల్ల ఫేస్‌బుక్‌ మరిన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థ ఫేస్‌బుక్‌కు చెందిన ఐదుకోట్ల మంది ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు భారతీయ వినియోగదారుల సమాచారం కూడా ఉన్నట్లు తేలింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాలని ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చేసింది. అందుకు జుకర్‌బర్గ్‌ క్షమాపణలు కూడా చెప్పారు.

ఈ వివాదం సద్దుమణగకముందే ఐదు కోట్ల మంది యూజర్ల డేటాను హ్యాకర్లు చోరీ చేసినట్లు గత నెలలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ఫేస్‌బుక్‌ స్పందించింది. ముందుగా చెప్పినట్లు 5కోట్ల ఖాతాలు కాదని, 3కోట్ల మంది యూజర్ల డేటాను హ్యాకర్లు చోరీ చేశారని వెల్లడించింది. కేవలం 4లక్షల మంది యూజర్ల ఖాతాల సాయంతో హ్యాకర్లు 3కోట్ల మంది యూజర్ల డేటాను తెలుసుకున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది.

‘ఫేస్ బుక్ మన సమాజంలో, ఆర్థిక వ్యవస్థల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. వారు సామాజికంగా, ఆర్థిక పరమైన బాధ్యతలు పారదర్శకంగా పాటించాల్సి ఉంటుంది. అందుకే మేం కంపెనీ బోర్డు రూంలో స్వతంత్రత, అక్కౌంటబిలిటీ కోరుకుంటున్నాం’ అని వాటాదారులు పేర్కొన్నారు. ఫేస్ బుక్ బోర్డు రూంలో నిష్పాక్షికత పాటించాల్సిన అవసరం ఉంది. సంస్థ గుర్తింపు, నియంత్రణ సంస్థల ఆదేశాల అమలు, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమాదంలో నెట్టే పరిస్థితి రాకుండా కాపాడాల్సి ఉంటుందని న్యూయార్క్ కు చెందిన వేల మంది వాటాదారులు డిమాండ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios