భారత్‌లో ఫోర్డ్‌కు చెందిన ఆటోమొబైల్‌ వ్యాపారంలో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ప్రకటించింది. అమెరికా ఆటోమోటివ్‌ దిగ్గజం ఫోర్డ్‌.. అనుబంధ సంస్థ అయిన ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ (ఎఫ్‌ఎంసీ)లో వాటాలను దక్కించుకున్నట్లు తెలిపింది. 

అంతా ఊహించినట్లే అమెరికా వాహన దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ కంపెనీ (ఎఫ్ఎంసీ), భారత ఆటోమొబైల్ మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఒక భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. రెండు సంస్థలు కలవడం 16 ఏళ్లలో ఇది రెండోసారి. ఈ మేరకు ఫోర్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. 

ఇందులో భాగంగా ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ ఇంక్‌, అమెరికా అనుబంధ సంస్థ అయిన ఆర్డోర్‌ ఆటోమోటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 51 శాతం వాటాలను మహీంద్రా కొనుగోలు చేయనుంది. మిగలిన 49 శాతం వాటాలు ఎఫ్‌ఎంసీ నేతృత్వంలోని ఆర్డోర్‌ చేతిలోనే ఉంటాయి. 

భారత్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న జాయింట్ వెంచర్ సంస్థ.. ఫోర్డ్‌ బ్రాండ్‌ వాహనాలను అభివృద్ధి చేయటంతోపాటు పంపిణీ చేస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. ఈ జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఫోర్డ్‌ కార్లతోపాటు మహీంద్రా వాహనాలను విక్రయించనున్నదని తెలిపింది. 

ఈ జాయింట్‌ వెంచర్‌ విలువ రూ.1,925 కోట్లుగా ఉంటుంది. ఇందులో ఫోర్డ్‌ ఇండియాకు చెందిన రూ.647 కోట్ల రుణ భారాన్ని కూడా ఈ జాయింట్ వెంచర్ పరిధిలోకి చేర్చారు. మిగిలిన 1,278 కోట్లలో ఇరు సంస్థలు.. భాగస్వామ్య సంస్థలో తమ వాటాలకు అనుగుణంగా పెట్టుబడులు పెడతాయి. డీల్‌లో భాగంగా ఫోర్డ్‌ ఇండియాకు చెందిన చెన్నై, సనంద్‌ ప్లాంట్లు మహీంద్రా వశం కానున్నాయి.

80 ఏళ్లుగా భారతదేశంలో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నా 1995లో చెన్నైలో ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఫోర్డ్ అధికారికంగా ప్రవేశించినట్లయింది. 2002లో మహీంద్రా అండ్ మహీంద్రాతో జట్టు కట్టినా దీర్ఘకాలం సాగలేదు. రెండేళ్ల క్రితం ఇరు సంస్థలు చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా ఇప్పుడు జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు రెండు సంస్థల చైర్మన్లు ఆనంద్ మహీంద్రా, బిల్ ఫోర్డ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు.

భారతదేశంతోపాటు విదేశాల కోసం ‘మేడిన్ ఇండియా’ కొనసాగిస్తామని ఆనంద్ మహీంద్రా, బిల్ ఫోర్డ్ తెలిపారు. ఇక్కడ 14 వేల మంది ఉద్యోగులు ఉన్నారని బిల్ ఫోర్డ్ చెప్పారు. వాహన సంస్థల భవిష్యత్ అంతా భాగస్వామ్యాల్లోనే ఉన్నదని ఆనంద్ మహీంద్రా తెలిపారు. గతానికి భిన్నంగా ఇరు సంస్థలు పరిపక్వతతో వ్యవహరిస్తాయన్నారు. 

వచ్చే ఏడాది మధ్యలో నుంచి ఇరు సంస్థలు కలిసి పని చేయవచ్చునని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా చెప్పారు. ఈ జాయింట్ వెంచర్ సంస్థకు ఏడాదికి 13 లక్షల వాహనాల తయారీ సామర్థ్యం ఉంటుంది. 

ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రాకు 8 లక్షలు ఫోర్డ్ కు చెందిన రెండు ప్లాంట్లలో చెరి రెండు లక్షలకు పైగా వాహనాల తయారీ సామర్థ్యం ఉంటుంది. జేవీ సంస్థ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా నియమించిన వ్యక్తి, మిగిలిన సభ్యులు ఇరు సంస్థల నుంచి సమానంగా ఉంటారు.