నూడిల్స్‌లో సీసం నిజమే..మ్యాగీకి మళ్లీ కష్టాలు

First Published 4, Jan 2019, 1:57 PM IST
Maggi Case: Nestle India Suffering again
Highlights

ఇన్‌స్టాంట్‌గా ఆకలి తీర్చే మ్యాగీ నూడిల్స్ అంటే పిల్లు, పెద్దలు పడిచస్తారు. అయితే ఇందులో సీసం పరిమాణం మోతాదుకు మించి ఉందని తేలడంతో మ్యాగీ మాతృకంపెనీ ‘‘నెస్లే’’ వివాదంలో చిక్కుకుంది.

ఇన్‌స్టాంట్‌గా ఆకలి తీర్చే మ్యాగీ నూడిల్స్ అంటే పిల్లు, పెద్దలు పడిచస్తారు. అయితే ఇందులో సీసం పరిమాణం మోతాదుకు మించి ఉందని తేలడంతో మ్యాగీ మాతృకంపెనీ ‘‘నెస్లే’’ వివాదంలో చిక్కుకుంది. మ్యాగీ నూడిల్స్‌లో సీసం తదితర అవశేషాలు ఉన్నాయని నెస్లే అంగీకరించడంతో నెస్లే మరోసారి ఇబ్బందుల్లో పడింది.

మ్యాగీ వివాదానికి సంబంధించి ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం పెట్టిన కేసు విచారణపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణ యథాప్రకారం జరగనుంది.

మ్యాగీ నూడిల్స్ శాంపిల్స్‌పై మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఫలితాలు దీనికి ప్రాతిపదికగా ఉంటాయని సుప్రీం పేర్కొంది. మ్యాగీ నూడిల్స్‌లో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే మోనోసోడియం గ్లూటమేట్ అవశేషాలు అధిక మోతాదులో ఉన్నాయని ఆరోపిస్తూ.. నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మ్యాగీ వాడకాన్ని 2015లో దేశవ్యాప్తంగా నిషేధించింది.

అలాగే నెస్లే ఇండియా వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తోందని, తప్పుడు లేబులింగ్‌ విధానాలు పాటిస్తోందని ఆరోపిస్తూ కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ అదే ఏడాది వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)లో కేసు వేయడంతో పాటు రూ.640 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

దీనిని సవాల్ చేసిన నెస్లే ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణపై స్టే విధించింది.. మరోవైపు మ్యాగీ నూడిల్స్ శాంపిల్స్‌లో సీసం, ఎంఎస్‌జీ స్థాయిలపై పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలంటూ మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్ఐని 2016 జనవరి 13న సుప్రీంకోర్టు ఆదేశించింది. 

loader