లగ్జెంబర్గ్ సిటీ: కాలుష్య భూతాన్ని తరిమికొట్టడంతోపాటు తరచుగా దేశవ్యాప్తంగా సాగుతున్న ట్రాఫిక్ జామ్‌లను అరికట్టేందుకు లగ్జెంబర్గ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ట్రామ్, రైలు, బస్సుల్లో ప్రజలకు ఉచిత రవాణా అందించనున్నది. తద్వారా ప్రపంచంలోనే ఉచిత ప్రజా రవాణ అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా లగ్జెంబర్గ్ నిలువనున్నది.

6.1 లక్షల మంది జనాభా మాత్రమే జీవించే ఈ దేశం ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాల మధ్యలో ఉంది. ఆయా దేశాలకు చెందిన దాదాపు 2 లక్షల మంది లగ్జెంబర్గ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది సొంత వాహనాలను ఉపయోగిస్తుండడంతో దేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడానికి తోడు ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువయ్యాయి.

రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాను దేశం మొత్తం ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. శనివారం నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే, కొన్ని ఆంక్షలు మాత్రం ఉన్నాయి. 
రైళ్లలో ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణం, రాత్రి వేళల్లో బస్సు సర్వీసులకు ఈ ఉచితం వర్తించదని లగ్జెంబర్గ్ రవాణా శాఖ వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రతి వ్యక్తికి ఏడాదికి దాదాపు వంద యూరోలు ఆదా కానున్నాయి. ఉచిత రవాణాపై ప్రజలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశం మొత్తం ప్రజా రవాణాను ఉచితం చేసిన తొలి దేశంగా లగ్జెంబర్గ్ రికార్డులకెక్కింది.

లగ్జెంబర్ ప్రజల్లో 71 శాతం మంది సొంత కార్లలో ప్రయాణిస్తారని 2018 సర్వేలో తేలింది. కేవలం 32 శాతం మంది మాత్రమే బస్సులను వినియోగిస్తున్నారని తేల్చారు. ఇక రైళ్లలోనైతే 19 శాతం మంది ప్రజలే ప్రయాణిస్తున్నారని ఈ అధ్యయనం నిర్ధారించింది. దీనికి తోడు 2017లో దేశవ్యాప్తంగా చేపట్టిన ట్రామ్ ట్రాక్ నిర్మాణం కూడా ట్రాఫిక్ జామ్‌లకు కారణంగా నిలుస్తోంది. 

కొన్నేళ్ల పాటు సాగే ఈ ట్రామ్ ట్రాక్ నిర్మాణం పూర్తయి ఒక సెక్షన్‌లో 2017లో ట్రామ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉచిత రవాణా విధానం అందుబాటులోకి తేవడంతో వివిధ రవాణా వ్యవస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. ఇప్పటికే కొన్ని నగరాల్లో పాక్షికంగా అమలు చేస్తున్నారు. క్రమంగా టిక్కెట్ల విక్రయ కేంద్రాలను మూసివేయనున్నారు. 

అయితే ఆఫీసుల్లో టిక్కెట్ల విక్రయాలు, ఇంటర్నేషనల్ ట్రైన్ ట్రిప్ టిక్కెట్ల విక్రయం కొనసాగనున్నది. లగ్జెంబర్గ్ దేశంలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల్లో పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వారు దాదాపు సగం మంది ఉన్నారు.