ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి వచ్చాం. అయితే ధరల బాదుడు మాత్రం మారలేదు. ఏప్రిల్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రమే పెంచేశాయి.
పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులతో సతమతమవుతున్న ప్రజలకు మరో భారం పడింది. చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. అయితే ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అలాగే ఏప్రిల్ 1న 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.250 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే 14 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెరిగిన ధర శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1002వద్ద నిలకడగా ఉంది. ఈ సిలిండర్ ధర మార్చి 22న రూ.50 పెంచారు.
19 కేజీల గ్యాస్ సిలిండర్లను సాధారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లుగా పేర్కొంటారు. ఈ సిలిండర్ ధర ఏకంగా రూ.250 మేర పెరిగింది. ధరల పెంపు నిర్ణయం శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది. ఈసారి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట లభించింది. ధరలో మార్పు లేదు. అయితే 10 రోజుల కిందట మాత్రం ఈ సిలిండర్ ధర పెరిగిన విషయం తెలిసిందే. అయితే మార్చి 22న కమర్షియల్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది.
చాలా నెలల తర్వాత మార్చి 22 నుంచి ధరల పెంపు ప్రారంభం అయ్యింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఎల్‌పీజీ రేటు అప్పటి నుంచి కూడా ఒకసారి పెరిగింది. డొమెస్టిక్ గ్యాస్ బండ రేటు 2021 అక్టోబర్ నుంచి స్థిరంగా ఉంటూ వచ్చింది. అయితే మార్చి 22న రూ.50 పైకి చేరింది. దీంతో సిలిండర్ రేటు ఢిల్లీలో రూ.950కి, కోల్‌కతాలో రూ.976కు, ముంబైలో రూ.949కి, చెన్నైలో రూ.965కు ఎగసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సిలిండర్ ఇంటికి రావాలంటే రూ.1000కి పైగానే చెల్లించాలి.
ఇకపోతే 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో మార్చి 22న రూ.2003కు తగ్గింది. అయితే శుక్రవారం నుంచి రేటు రూ.2253కి చేరింది. అంటే రూ.250 పెరిగింది. కోల్‌కతాలో రేటు రూ.2087 నుంచి రూ.2351కు, ముంబైలో రూ.1955 నుంచి రూ.2205కు, చెన్నైలో రూ.2138 నుంచి రూ.2406కు చేరాయి. కాగా మార్చి 1న ఈ సిలిండర్ ధర రూ.105 మేర పెరిగింది. హైదరాబాద్‌లో రూ.2,400పైగా ఉంది. అయితే గత రెండు నెలల్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.346 వరకు ఎగబాకింది. అంతకు ముందు మార్చి 1న ఈ సిలిండర్‌పై రూ.105 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి మారక విలువ వంటి అంశాల ప్రాతిపదికన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి.
