Asianet News TeluguAsianet News Telugu

SBI Loans: ఎస్‌బీఐలో లోన్ తీసుకున్నారా, అయితే మీకు షాక్...మీ EMIపై మరింత భారం...

SBI Loans: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గట్టి షాక్‌ను ఇచ్చింది. మార్జినల్‌ కాస్ట్‌ లెండింగ్‌ రేట్‌(ఎంసీఎల్‌ఆర్‌)ను పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్‌ఆర్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్లను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

loans of customers from sbi will be more expensive bank increased mclr for the second time in a month check new rates
Author
Hyderabad, First Published May 16, 2022, 3:12 PM IST

SBI Loans: దేశంలోని అతి పెద్ద బ్యాంకు SBI( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కస్టమర్లకు షాకిచ్చింది. తాజాగా MCLRను పెంచింది.  దీంతో రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. SBI రుణాలను అందించే  MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్)ని పెంచింది. కొత్త రేట్లు మే 15వ తేదీ నుంచి అంటే ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నెలలో బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచడం ఇది రెండోసారి. బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు అంటే 0.10 శాతం పెంచింది

SBI ఓవర్‌నైట్ ఒక నెల నుంచి మూడు నెలల MCLR ఇప్పుడు 6.75 శాతం నుండి 6.85 శాతానికి పెరిగింది. 6 నెలలకు ఎంసీఎల్‌ఆర్‌ 7.15 శాతానికి, ఏడాదికి 7.20 శాతానికి, రెండేళ్లకు 7.40 శాతానికి, మూడేళ్లకు 7.50 శాతానికి పెరిగింది.

ప్రభావం ఎలా ఉంటుంది
MCLR పెంపుతో, కస్టమర్లు తీసుకున్న రుణానికి నెలవారీ EMI పెరుగుతుంది. అలాగే, కొత్త కస్టమర్లకు కూడా రుణం ఖరీదైనదిగా మారుతుంది. ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ 40 బేసిస్ పాయింట్లు పెంచింది. RBI వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని, దీని కారణంగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం మరింత ఖరీదైనదిగా మారుతుందని గమనించాలి. SBI ద్వారా పంపిణీ చేయబడిన రుణాలలో అత్యధిక వాటా (53.1 శాతం) MCLR సంబంధిత రుణాలదే కావడం గమనార్హం. ఇటీవల, బ్యాంక్ రూ. 2 కోట్ల ఎఫ్‌డిలపై వడ్డీ రేటును 40-90 బేసిస్ పాయింట్లు పెంచింది.

చాలా వరకు రుణాలు నిరంతరం మారుతున్న రేట్లపై ఆధారపడినందున ఈ పెంపు బ్యాంకు మార్జిన్‌లపై సానుకూల ప్రభావం చూపుతుందని ఎస్‌బిఐ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. అంటే రెపో రేటులో మార్పు వచ్చిన వెంటనే వీటిని కూడా మార్చనున్నారు.

MCLR అంటే ఏమిటి
MCLR ఇది ఏదైనా రుణానికి కనీస వడ్డీ రేటును నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. బ్యాంకులు కస్టమర్లకు అందించే లోన్ల పై లెండింగ్ రేట్లను సెట్ చేయడానికి ఫైనాన్షియల్ సంస్థలు ఎంసిఎల్ఆర్ ను ఒక రిఫరెన్స్ బెంచ్‌మార్క్‌గా ఉపయోగిస్తారు. ఆర్బీఐ పాలసీ రేట్లను సమర్థవంతంగా కస్టమర్లకు ట్రాన్స్‌మిషన్ చేయడానికి బ్యాంకింగ్ సిస్టమ్‌లో పారదర్శకతను మొత్తం మెరుగుపరచడానికి ఆర్‌బిఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) ను ప్రవేశపెట్టింది.  MCLRని 2016లో RBI భారత ఆర్థిక వ్యవస్థలో చేర్చింది. గతంలో బేస్ రేటు విధానంలో వడ్డీని నిర్ణయించారు. MCLR అమలుతో దాన్ని నిలిపివేశారు. 

2016 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందు బ్యాంకులన్నీ బేస్‌రేటు విధానాన్ని అమలు చేసేవి. కానీ అప్పటి నుంచి అన్ని బ్యాంకుల ఎంసీఎల్‌ఆర్‌ విధానం ద్వారా రుణాలను అందిస్తున్నాయి. ఎంసీఎల్‌ఆర్‌ను బేస్‌గా చేసుకుని... వినియోగదారులకు వారి క్రెడిట్ హిస్టరీ, ఆదాయం, చెల్లించే సామర్థ్యం ఆధారంగా వడ్డీరేటు నిర్ణయిస్తారు.

ఎంసీఎల్‌ఆర్‌ను నెలవారీ సమీక్షిస్తుంటారు. బేస్‌రేట్‌ ప్రకారమైతే... రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించినా, పెంచినా దాని లాభనష్టాలు వెంటనే బ్యాంకు కస్టమర్లకు బదిలీ అయ్యేవి కావు. ఎంసీఎల్‌ఆర్‌ వ్యవస్థను ఆర్‌బీఐ ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి.  ఎంసీఎల్‌ఆర్‌తో ఈ లోపం కొంత తొలగిపోయింది. రుణరేటు లెక్కింపు నిర్ణయంలో పారదర్శకత పెరిగింది. ఎంసీఎల్‌ఆర్‌కు సంబంధించి ఓవర్‌నైట్‌ (ఒకరోజు), నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కాలాలకు వేర్వేరు రేట్లు అమలవుతున్నాయి. 

ఆర్‌బీఐ నుంచి తాము తీసుకునే స్వల్ప కాలిక రుణాలకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. దీన్ని రెపో రేటుగా పిలుస్తారు. RBI కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తే, వినియోగదారులకు ఎంసీఎల్ఆర్ రేటు తగ్గి రుణాలు చౌకగా లభిస్తాయి. ఒక వేళ పెంచితే ఎంసీఎల్ఆర్ రేటు పెరిగి రుణాలు మరింత ఖరీదగా మారుతుంటాయి. అయితే ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలన్నీ ఎంసీఎల్‌ఆర్‌కే అనుసంధానమై ఉంటాయి. ఎస్‌బీఐ వ్యక్తిగత, విద్య, ఆటో రుణాలకు కూడా ఎంసీఎల్‌ఆర్‌ వర్తింపజేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios