న్యూయార్క్: ఆదిత్య బిర్లా గ్రూప్  చైర్మన్, బిలియనీర్  కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా యుఎస్ రెస్టారెంట్‌ తీరును జాత్యహంకారం అంటూ నిందించారు. కాలిఫోర్నియాలోని ఇటాలియన్-అమెరికన్ డైనింగ్ ప్లేస్  నుండి తనని, తన కుటుంబాన్ని రెస్టారెంట్‌ ప్రాంగణం నుండి పంపించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

"స్కోపా రెస్టారెంట్ నా కుటుంబాన్ని, నన్ను  రెస్టారెంట్ ప్రాంగణం నుండి పంపించేశారు. ఇది ముమ్మాటికి జాత్యహంకారం, రెస్టారెంట్ కస్టమర్లతో సరిగ్గా వ్యవహరించాలి, ఇలా చయడం సరైంది కాదు" అని ఆమె ట్వీట్‌లో పేర్కొంది.

"మీ రెస్టారెంట్‌లో తినడానికి మేము 3 గంటలు వేచి ఉన్నాము. చెఫాంటోనియా మీ వెయిటర్ జాషువా సిల్వర్‌మాన్ జాత్యహంకారంతో నా తల్లితో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది సరికాదు" అని అనన్య మరొక ట్వీట్‌లో పేర్కొంది.

అనన్య బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, విద్యావేత్త, మెంటల్ హెల్త్ ఆక్టివిస్ట్ నీర్జా బిర్లా కుమార్తె.

మరొక ట్వీట్‌లో నీర్జా బిర్లా కూడా రెస్టారెంట్ తమతో దురుసుగా ప్రవర్తించింది అని ఆరోపించారు. "స్కోపా రెస్టారెంట్ ప్రవర్తించిన తీరు దారుణమైనది. మీ కస్టమర్లలో ఇలా వ్యవహరించే హక్కు మీకు లేదు" అని ఆమె అన్నారు.

"నేను ఇలాంటివి ఏప్పుడు చూడలేదు. జాత్యహంకారం ఇంకా ఉంది, ఇది నిజం అని వారి కుమారుడు ఆర్యమాన్ బిర్లా కూడా ట్వీట్ చేశారు.