ప్రస్తుతం మార్కెట్‌లో అంతా ఎల్ఐసీ ఐపీవో గురించే చర్చ నడుస్తోంది. దేశంలోనే అతిపెద్ద భీమా సంస్థ కావడం, ప్రపంచంలో మూడవ స్థానంలో ఉండటంతో ఎల్ఐసీ తీసుకొస్తున్న ఐపీవో చర్చనీయాంశమవుతోంది.
అతిపెద్ద జీవిత భీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓ కోసం మార్కెట్ ఎదురుచూస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవో మార్చి 11 న మార్కెట్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అంతా ఎల్ఐసీ ఐపీవో గురించే చర్చ నడుస్తోంది. దేశంలోనే అతిపెద్ద భీమా సంస్థ కావడం, ప్రపంచంలో మూడవ స్థానంలో ఉండటంతో ఎల్ఐసీ తీసుకొస్తున్న ఐపీవో చర్చనీయాంశమవుతోంది. ఎల్ఐసీ ఐపీవో ప్రవేశపెట్టిన రోజు షేర్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకునే అవకాశాలున్నాయి. మార్కెట్‌లోని పెట్టుబడిదారులు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి.
ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం ఎల్ఐసీ.. ఐపీవో లాంచ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఎల్ఐసీ పాలసీదారుల రిజర్వేషన్ ఎలా ఉంటుంది, షరతులేంటనే విషయంపై ఇప్పటికే ఎల్ఐసీ ప్రకటనలిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ఐపీవో మార్చి 11న వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏకంగా 8 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఇష్యూతో ఎల్ఐసీ మార్చి 11వ తేదీన యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రానుందని తెలుస్తోంది. ఆ తరువాత రెండ్రోజులకు ఇతర ఇన్వెస్టర్లకు అందనుంది. దీనికి సంబంధించి మార్చ్ మొదటివారంలో సెబీ నుంచి అనుమతులు పొందనుంది. ఈ విషయంపై ఎల్ఐసీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయకపోయినా..మార్చ్ 11వ తేదీన లాంచ్ ఉండవచ్చని సమచారం.
అటు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కూడా ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీవో లాంచ్ తేదీ సమీపిస్తుండటంతో ఒక్కొక్క షేర్ ధర ఎంత ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. భీమా కంపెనీ షేర్ ఒక్కొక్కటి 2 వేల నుంచి 2 వేల 100 రూపాయల మధ్య ఉండవచ్చనేది బ్లూమ్‌బర్ల్ నివేదిక అంచనా. ఇప్పటికే ముసాయిదా పత్రాల్ని సెబీకు దాఖలు చేసే ప్రక్రియ పూర్తయింది. ఎల్ఐసీలో భారత ప్రభుత్వానికున్న వందశాతం వాటాలో 5 శాతం విక్రయించడం ద్వారా 8 బిలియన్ డాలర్లు సేకరించాలనేది లక్ష్యం.
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రయివేటీకరణ ప్రక్రియ మార్చి 31వ తేదీతో పూర్తి కానుంది. ఐపీఓ ప్రక్రియలో భాగంగా ఎల్ఐసీ ఇప్పటికే తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను ఈ నెల 13వ తేదీన దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే మాట్లాడుతూ.. సంస్థలో ప్రభుత్వ ఈక్విటీలో 5 శాతానికి ప్రాతినిథ్యం వహించే 31.6 కోట్ల షేర్లు ఆఫర్‌లో ఉన్నాయన్నారు. ఈ ఐపీవో ద్వారా మార్చి 31 నాటికి ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా విక్రయం పూర్తవుతుందన్నారు. ఐపీఓ వ్యాల్యూను రూ.1.75 లక్షల కోట్ల నుండి రూ. 78 వేల కోట్లకు తగ్గించినట్లు తెలిపారు. మిగతా మొత్తానికి సంబంధించి మరోమారు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరగనుందన్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకుల్లో వాటాల ఉపసంహరణ లక్ష్యాల దిశగా అడుగులేస్తోంది. ఓ వైపు ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ, మరోవైపు ఎల్ఐసీతో పాటు ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వానికి ఉన్న పూర్తి వాటాను విక్రయించే అవకాశాలు కనిపిస్తుంది. ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణతో ఆకర్షణీయ బిడ్డర్స్, ఇన్వెస్టర్ల కోసం కేంద్ర ప్రభుత్వం రోడ్ షోలు నిర్వహించనున్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి కేంద్రం, ఎల్ఐసీ తమ వాటాలను ఉపసంహరించనున్నాయి.
