కేంద్ర ప్రభుత్వం 31.6 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ.71వేల కోట్ల నిధులు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు సెబి ఎదుట ప్రభుత్వం ఆదివారం డ్రాఫ్ట్ పేపర్స్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.
దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మార్చిలో ఐపీఓకు రావాలనుకుంటోంది. ఎల్ఐసీ తమ ఐపీవోకు అనుమతించాలని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబికి ఆదివారం దరఖాస్తు చేసింది. ఎల్ఐసీ తన డ్రాఫ్ట్ పేపర్ (డీఆర్‌హెచ్‌పీ)ని ఆదివారం స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద ఫైల్ చేసింది. 31.6 కోట్ల షేర్లను అంటే ఐదు శాతం వాటాలను ఐపీవో ద్వారా విక్రయిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంతా పాండే ట్వీట్ చేశారు.
DRHP అంటే..?
డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) అనేది ఒక చట్టపరమైన ప్రాథమిక పత్రం. ఇది IPO-బౌండ్ కంపెనీ, దాని పెట్టుబడిదారులు, వాటాదారుల మధ్య ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ లింక్‌గా పనిచేస్తుంది. ఒక కంపెనీ తన షేర్లను అందించడం ద్వారా ప్రజల నుండి నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అది DRHPని ఫైల్ చేయాలి. ఇది వ్యాపార వివరణ, ఆర్థిక సమాచారం, ప్రమాద కారకాలు, ఆదాయాల వినియోగం, పరిశ్రమ అవలోకనం, నిర్వహణకు సంబంధించిన లోతైన వివరాలను అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం 31.6 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ.71వేల కోట్ల నిధులు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు సెబి ఎదుట ప్రభుత్వం ఆదివారం డ్రాఫ్ట్ పేపర్స్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. 5 శాతం వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.
వంద శాతం ఓఎఫ్ఎస్ ద్వారా ఎల్ఐసీ ఐపీవోకు వెళ్తున్నట్లు తుహిన్ కాంత పాండే తెలిపారు. ఎల్ఐసీ ఎంబేడెడ్ వ్యాల్యూ రూ.5.39 లక్షల కోట్లు. ఐపీవోలో పాలసీదారులకు పది శాతం వాటాలను ఎల్ఐసీ విక్రయిస్తుంది. ఉద్యోగులకు కొంత రిజర్వేషన్ కల్పిస్తుంది. ఎల్ఐసీ ఆఫర్ సైజ్ రూ.27వేల కోట్లుగా ఉంటుందని, మూడు రెట్ల వ్యాల్యూ కలిగిన షేర్లు విక్రయిస్తారని తెలుస్తోంది. ఎల్ఐసీ వాటా విజయవంతమైతే కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ టార్గెట్‌లో రూ.78 వేల కోట్లు వస్తాయని అంచనా. ఇంతకుముందు ఎల్ఐసీ ఐపీవో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని తుహిన్ కాంత పాండే తెలిపారు.
టాప్ 3 బీమా బ్రాండ్‌గా ఎల్‌ఐసీ
ఎల్‌ఐసీ గతేడాది దాదాపు 8.656 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 64,722 కోట్లు) బ్రాండ్ వేల్యుయేషన్‌తో పటిష్టమైన బీమా బ్రాండ్‌ల కేటగిరీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిల్చింది. అలాగే బీమా రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలు కలిపి.. అత్యంత విలువైన బ్రాండ్‌లలో 10వ స్థానం దక్కించుకుంది. లండన్‌కి చెందిన బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం 2021లో అంతర్జాతీయంగా టాప్ 100 బీమా సంస్థల విలువ 6% క్షీణించింది. అయితే, ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ మాత్రం 2020తో పోలిస్తే 6.8% పెరిగి, దేశంలోనే అత్యంత పటిష్టమైన, అతి పెద్ద బ్రాండ్‌గా మారింది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో 238వ స్థానం నుంచి 32 స్థానాలు ఎగబాకి 206వ ర్యాంకుకు చేరింది.
