న్యూఢిల్లీ: ఈ ఏడాది నలుగురు పారిశ్రామిక దిగ్గజాలు ‘పద్మ’ అవార్డులకు ఎంపికయ్యారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేజర్ ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ మణిభాయ్‌ నాయక్‌ (ఏఎం నాయక్‌)కు భారత్ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ వరించింది.  దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు చేసిన కృషికి గుర్తింపుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాయక్‌కు ఈ అవార్డు ప్రకటించారు. ఎల్‌ అండ్‌ టీలో సామాన్య ఉద్యోగిగా చేరి ఆ సంస్థను దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో నాయక్‌ కీలక పాత్ర పోషించారు. 

ఇక సిస్కో మాజీ అధిపతి జాన్‌ చాంబర్స్‌, ఎండీహెచ్‌ స్పైసీస్‌ యాజమాని మహాషయ్‌ ధరం పల్‌ గులాటీలకు పద్మ భూషణ్‌ ప్రకటించారు. అడోబ్‌ ఛైర్మన్‌, సీఈఓ శంతను నారాయణ్‌కు విదేశీ విభాగంలో పద్శశ్రీ వరించింది. అత్యున్నత పౌర పురస్కారాలకు ఎన్నికైన ఈ ప్రముఖుల గురించి ఒక పరిశీలన..

1940లో గుజరాత్‌లో జన్మించిన అనిల్ మణి భాయ్ నాయక్‌ (ఏఎం నాయక్) వల్లభ్‌ విద్యానగర్‌లోని బిర్లా విశ్వకర్మ మహావిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. విద్యాభ్యాసం తర్వాత ముంబైకి వెళ్లిన ఏఎం నాయక్ సరైన ఇంగ్లిష్‌ నైపుణ్యం లేక ఉద్యోగం సాధించలేకపోయారు. ఇంగ్లిష్‌ నేర్చుకుంటూనే.. పార్శిల ఆధ్వర్యంలో నడుస్తున్న నెస్లర్‌ బాయిలర్స్‌ సంస్థలో చేరారు. 

నెస్టర్ బాయిలర్స్ సంస్థలో యాజమాన్య మార్పులతో మళ్లీ 1965లో ఏఎం నాయక్ ఉద్యోగ వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే 1965 మార్చి 15న ఎల్‌ అండ్‌ టీలో జూనియర్‌ ఇంజినీర్‌గా చేరారు. 1986లో జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతి పొందిన నాయక్‌.. 1996లో సంస్థ సీఈఓ, ఎండీగా నియమితులయ్యారు. 

తర్వాత ఎల్ అండ్ టీ ఛైర్మన్‌గా సైతం వ్యవహరించిన ఏఎం నాయక్.. ఐఐఎం అహ్మదాబాద్‌ ఛైర్మన్‌గా సైతం సేవలందించారు. 2016 ఆగస్టులో స్వచ్ఛంద సేవా సంస్థలకు 75 శాతం ఆదాయాన్ని ఇస్తున్నట్లు నాయక్‌ ప్రకటించారు. 2009లోనే నాయక్‌ను పద్మభూషణ్‌ పురస్కారం దక్కింది. 

ఢిల్లీకి చెందిన పాల్ గులాటీ ప్రముఖ మసాలా తయారీ సంస్థ ఎండీహెచ్‌ను 1919లో స్థాపించారు. 1959లో తొలి కర్మాగారం నెలకొల్పారు. తర్వాత వాటిని 15 యూనిట్లుగా విస్తరించారు. 94 ఏళ్ల వయసులో 2017లో ఆయన అత్యధిక వేతనం అందుకుంటున్న ఎఫ్‌ఎమ్‌సీజీ సీఈఓగా రికార్డు సృష్టించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల వేతనం పొందారు.

అంతర్జాతీయ దిగ్గజ నెట్‌వర్కింగ్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సంస్థ సిస్కో మాజీ అధిపతి జాన్‌ చాంబర్స్‌కు పద్మ భూషణ్‌ దక్కింది. అమెరికాకు చెందిన జాన్ చాంబర్స్ భారత్‌లో సిస్కో భారీ పెట్టుబడులు పెట్టడంలో  కీలక పాత్ర పోషించారు. 

ఇక 1962లో హైదరాబాద్‌లో జన్మించిన శంతను నారాయణ్  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. అమెరికాలో ఎంబీఏ, ఎంఎస్‌ పూర్తి చేశారు. టెక్‌ దిగ్గజం యాపిల్‌లో వృత్తిజీవితాన్ని ప్రారంభించిన ఆయన.. 1998లో అడోబ్‌లో చేరారు. 2007 నవంబర్ నెలలో అడోబ్‌ పగ్గాలు చేపట్టిన ఆయన.. 2018లో ఫార్చ్యున్‌ 400 కంపెనీగా అడోబ్‌ను నిలబెట్టారు.