న్యూఢిల్లీ: మధ్యస్థాయి ఐటీ కంపెనీ మైండ్‌ట్రీలో వాటాను ఇన్ ఫ్రా దిగ్గజం లార్సన్ అండ్ టర్బో (ఎల్‌ అండ్‌ టీ) మరింత పెంచుకుంది. శుక్రవారం ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా మరో 13,440 షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేర్‌కు రూ.979.98 చొప్పున చెల్లించినట్లు తెలిపింది. దీంతో మైండ్‌ట్రీలో ఎల్‌ అండ్‌ టీ వాటా 26.48 శాతానికి పెరిగింది. దీంతో ఐటీ సంస్థలో ఎల్‌ అండ్‌ టీ అత్యధికంగా వాటా కలిగిన పెద్ద సంస్థగా మారింది. 

వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇక త్వరలోనే మైండ్‌ట్రీ సంస్థ బోర్డులో ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులకు చోటు లభించనుంది. దీనిక తోడు రానున్న రోజుల్లో ఆ సంస్థ మూలధన నిర్మాణ విషయంలో తగిన రిజల్యూషన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. 

సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌తో పాటుగా పూర్తిస్థాయి డైరెక్టర్ల నియమకానికి ఇప్పటికే ఇంజినీరింగ్‌ దిగ్గజం కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం మైండ్‌ట్రీ ప్రమోటర్ల గ్రూప్‌ సభ్యులు బాగ్చీ, పార్థసారథి, నటరాజన్, సీఈవో రోస్టో రావణన్‌ తదితరులకు 13.32 శాతం వాటాలు ఉన్నాయి. 

నటరాజన్‌కు 3.72 శాతం, పార్థసారథికి 1.43 శాతం, రావణన్‌కు 0.71 శాతం, బాగ్చీకి 3.1 శాతం వాటాలు ఉన్నాయి. ఇక ఇంతకుముందు  10.6 శాతం వాటా గల నలందా క్యాపిటల్ తమకు మద్దతునిస్తోందని మైండ్ ట్రీ సీఈఓ రొస్తొవ్ రావణన్ పేర్కొన్నారు. 

66 శాతం వాటా కోసం రూ.10,800 కోట్ల ఆఫర్‌ను ఎల్‌ అండ్‌ టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేఫ్‌ కాఫీ డే యజమాని వి.జి. సిద్ధార్థకు మైండ్‌ ట్రీలో ఉన్న 20.32 శాతం వాటాను కొనుగోలు ఎల్ అండ్ టీ కొనుగోలు చేసింది. 
వీజీ సిద్దార్థ, ఆయన సారథ్యంలోని కాఫీ డే సంస్థల నుంచి కొనుగోలు చేసిన వాటా 20.4 శాతం వాటా కాకుండా మరో 15 శాతం షేర్లు ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టీ లక్ష్యం నిర్దేశించుకున్నది. ఆ మేరకు ప్రస్తుతం ఎల్ అండ్ టీ వాటా 26.48 శాతానికి పెరిగింది. అయితే ముందుగా నిర్ణయించినట్లు మరో 9 శాతం షేర్లు కొనుగోలు చేయగలిగితే ఎల్ అండ్ టీ చేతిలోకి ‘మైండ్ ట్రీ’ వచ్చేసినట్లేనని భావిస్తున్నారు.