Asianet News TeluguAsianet News Telugu

ఎల్ &టీ మైండ్‌ ‘ట్రీ’గేమ్: వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌

దేశీయ ఐటీ రంగంలో బలవంతపు టేకోవర్ దిశగా ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ కీలక ముందడుగు వేసింది. మైండ్ ట్రీ సంస్థ వాటాదారులకు అద్భుతమైన ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో షేర్‌కు రూ.980 చొప్పున కొనుగోలు చేయడానికి రూ.5,030 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది. 
 

L&T announces Rs 5,030-cr open offer for Mindtree at Rs 980/share
Author
Hyderabad, First Published Jun 8, 2019, 11:13 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మిడిల్ సైజ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘మైండ్‌ట్రీ’ని కైవసం చేసుకోవడానికి ఇన్ ఫ్రా మేజర్ ‘ఎల్‌ అండ్‌ టీ’తన పంతం నెగ్గించుకుంటోంది. మిడ్‌ సైజ్‌ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీని పూర్తి స్థాయిలో టేకోవర్‌ చేస్తోంది. ఇప్పటికే మైండ్‌ట్రీ ఈక్విటీలో 28.90 శాతం వాటా సంపాదించింది. 

ఎల్ అండ్ టీ మరో 31 శాతం వాటా కోసం మైండ్ ట్రీ వాటాదారుల కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అమలులో ఉండే ఈ ఆఫర్‌లో ఒక్కో షేర్‌కు రూ.980 చెల్లిస్తామని తెలిపింది.

శుక్రవారం బీఎస్ఈలో మైండ్‌ట్రీ షేర్ల ముగింపు ధర రూ.969తో పోలిస్తే ఇది రూ.11 ఎక్కువ. దీని ప్రకారం మైండ్‌ట్రీ ఈక్విటీలో 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల షేర్ల కోసం ఎల్‌ అండ్‌ టీకి రూ.5,030 కోట్లు ఖర్చవుతాయి. ఐటీ రంగంలో ఎల్‌ అండ్‌ టీకి ఇది తొలి టేకోవర్‌.
 
మైండ్‌ట్రీ ఈక్విటీలో ఎల్‌ అండ్‌ టీకి ఇప్పటికే 28.90 శాతం వాటా ఉంది. ఇందులో 20.32 శాతం వాటాకు సమానమైన 3.3 కోట్ల షేర్లను, కాఫీ డే ట్రేడింగ్‌ లిమిటెడ్‌, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోటర్‌ వీజీ సిద్ధార్ధ నుంచి ఒక్కో షేరు రూ.980 చొప్పున రూ.3,269 కోట్లకు కొనుగోలు చేసింది. 

ఓపెన్‌ మార్కెట్‌ నుంచి మరో 8 శాతం షేర్లను కొనుగోలు చేసింది. మరో 15 శాతానికి సమానమైన 2.48 కోట్ల షేర్లను యాక్సిస్‌ క్యాపిటల్‌ నుంచి కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కూడా కలిపితే మైండ్‌ట్రీ ఈక్విటీలో ఎల్‌ అండ్‌ టీ వాటా 43.32 శాతానికి చేరుతుంది. 

ఎల్ అండ్ టీ ప్రకటించిన తాజా ఓపెన్‌ ఆఫర్‌ విజయవంతమైతే మైండ్ ట్రీలో ఆ సంస్థ వాటా 74.32 శాతానికి పెరుగుతుంది. మైండ్‌ ట్రీ ఈక్విటీలో కనీసం 66 శాతం షేర్లు కలిగి ఉండాలన్నది ఎల్‌ అండ్‌ టీ లక్ష్యం. ఇందుకోసం దాదాపు రూ.10,700 కోట్లు సిద్ధం చేసుకుంది. 

గత మార్చిలో ఎల్‌ అండ్‌ టీ కంపెనీ, సిద్ధార్ధ దగ్గర ఉన్న 20.32 శాతం మైండ్‌ట్రీ షేర్లను కొనుగోలు చేసింది. ఆ వెంటనే మైండ్‌ట్రీని టేకోవర్‌ చేయబోతున్నట్టు ప్రకటించింది. దానిపై అప్పట్లో పెద్ద కలకలమే చెలరేగింది.
 
మైండ్‌ట్రీ ఈక్విటీలో మెజారిటీ వాటాను ఎల్‌ అండ్‌ టీ కొనుగోలు చేసినా, వెంటనే విలీనం చేసుకోవడం లేదు. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు ఇప్పటికే ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ పేరుతో ప్రత్యేక ఐటీ కంపెనీ ఉంది. మైండ్‌ట్రీని వెంటనే అందులో విలీనం చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడప్పుడే అలాంటి ఆలోచన లేదని ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది.
 
ఈ నెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్‌ ఆఫర్‌ అమల్లో ఉంటుందని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారం వాటాదారులకు శనివారంలోగా అందాలి. ఈ నెల 13లోగా మైండ్‌ట్రీ స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ వాటాదారులకు తమ సిఫారసులు తెలియజేయాలి. ఓపెన్‌ ఆఫర్‌ షేర్‌ ధర పెంచే ఉద్దేశం ఉంటే ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ఆ విషయాన్ని ఈ నెల 14కల్లా ప్రకటించాలి.

Follow Us:
Download App:
  • android
  • ios