Asianet News TeluguAsianet News Telugu

అయ్యబాబోయ్!! టెలికం వార్ భరించలేం: బిర్లా ఉక్కిరిబిక్కిరి

టెలికం టారిప్ వార్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2017 నాటికి రమారమీ 300 కోట్ల డాలర్ల ఆస్తిని కోల్పోయారు. అంటే రూ.22,752 కోట్ల మేరకు ఆయన సంపద తరిగిపోయింది. దీంతో టెలికం రంగంలో చేతులు కాల్చుకున్న వారి జాబితాలో బిర్లా కూడా చేరినట్లయింది.

Kumar Mangalam Birla loses $3 bn as Voda-Idea's mounting debt takes toll
Author
Hyderabad, First Published Nov 23, 2019, 6:11 PM IST

న్యూఢిల్లీ: టెలికం రంగంలో టారిఫ్‌ యుద్ధం ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా సంపదకు భారీగా గండికొట్టింది. ఆర్థిక మందగమనం, డిమాండ్‌ లేమి తదితర అంశాలు కూడా ఆయన ఆస్తిని కరిగించేశాయి. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. 2017 చివరినాటికి 910 కోట్ల డాలర్లుగా (రూ.65,520 కోట్లు) ఉన్న బిర్లా ఆస్తి ప్రస్తుతం 594 కోట్ల డాలర్లకు (రూ.42,768 కోట్లు) పడిపోయింది.

రెండేళ్లలో ఆయన సంపద 22,752 కోట్ల మేర తరిగిపోయింది. దీంతో టెలికం రంగంలో చేతులు కాల్చుకున్న వారి జాబితాలో బిర్లా కూడా చేరినట్లయింది.రిలయన్స్‌ జియో రంగ ప్రవేశంతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌తోపాటు ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీ ఐడియా సెల్యులార్‌ కూడా కుదేలయ్యాయి.

జియో నుంచి పోటీని తట్టుకునేందుకు గతేడాది వొడాఫోన్‌, ఐడియా ఒక్కటై వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడింది. విలీనం తర్వాత కూడా ఇరు సంస్థల కష్టాలు తీరలేదు. వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లు పెద్ద సంఖ్యలో జియోకు తరలిపోయారు.

కంపెనీ నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 27% వాటా కల వొడాఫోన్‌ ఐడియా షేర్లు 2017 చివరి నుంచి 90% మేర నష్ట పోయాయి. దాంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 260 కోట్ల డాలర్ల మేర తరిగిపోయింది.
 
ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన ఇతర కంపెనీలైన హిందాల్కో, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కూడా మందగమన సెగకు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. దేశీయ ఆర్థిక మంద గమనమూ ఇందుకు తోడవడంతో పారిశ్రామిక ముడిసరుకులకు డిమాండ్‌ తగ్గింది.

దాంతో కమోడిటీ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తత్ఫలితంగా హిందాల్కో లాభం సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 33% క్షీణించింది. హిందాల్కో ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం రోలింగ్‌ కంపెనీ. కానీ 2017 చివరి నుంచి కంపెనీ విలువ 30శాతానికి పైగా పతనమైంది.
 
గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం టెక్స్‌టైల్‌, ఫ్యాషన్‌ వస్త్రాలు, ఆర్థిక సేవలు, రసాయనాలు, ఎరువులు సిమెంట్‌, ఆర్థిక సేవల వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఆర్థిక మందగమనం కారణంగా ఈ కంపెనీ సిమెంట్‌, రసాయనాలు, టెక్స్‌టైల్‌ ఉత్పత్తులకూ డిమాండ్‌ తగ్గింది. దాంతో 2017 చివరి నుంచి గ్రాసిమ్‌ షేర్లు 33% పతనం అయ్యాయి. పైగా గ్రాసిమ్‌కు వొడాఫోన్‌ ఐడియాలోనూ 11.54% వాటా ఉంది. వొడాఫోన్‌ ఐడియా షేర్ల క్షీణత కూడా గ్రాసిమ్‌ మార్కెట్‌ విలువపై ప్రభావం చూపింది.

Follow Us:
Download App:
  • android
  • ios