అయ్యో పాపం అని మీ స్నేహితులు లేదా బంధువులకు బ్యాంకులు లేదా ఎన్‌బిఎఫ్‌సిల్లో రుణం తీసుకునే సమయంలో లోన్ గ్యారంటర్ గా సంతకం పెడుతున్నారా, అయితే జాగ్రత్త, మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అయితే మీకు బాగా తెలిసిన వారెవరికైనా బ్యాంకు రుణాలకు షూరిటీ ఇచ్చే ముందు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి 

మీ స్నేహితులు, లేదా బంధువుల ఎవరైనా ఆర్థిక అవసరాల కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారా, వారి కోసం మీరు ఆ లోన్ గ్యారంటీర్ గా సంతకం చేస్తున్నారా, అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేకుంటే మీరు చిక్కుల్లో పడతారు. ఎవరైనా రుణం తీసుకుంటే గ్యారెంటీర్‌ను కచ్చితంగా బ్యాంకుకు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. రుణం తీసుకునేటప్పుడు గ్యారంటీర్ తప్పకుండా అవసరం. ప్రత్యేకించి ఎవరికైనా లోన్ గ్యారెంటీర్‌గా మారడం సరైనదా కాదా అనే ప్రశ్న ఇప్పుడు ఇక్కడ తలెత్తుతుంది. కానీ ప్రధాన ప్రశ్న ఏమిటంటే రుణ హామీదారు అవసరం ఏంటి, దాని వల్ల లాభ నష్టాలు ఏంటో తెలుసుకుందాం. 

బ్యాంకులు లేదా ఎన్‌బిఎఫ్‌సిల్లో రుణం పొందాలంటే, రుణాన్ని తిరిగి చెల్లించే విషయమై ఎవరైనా హామీ ఇవ్వాలని సదరు సంస్థలు అడుగుతుంటాయి. అయితే మీరు రుణాలకు షూరిటీ ఇచ్చే ముందు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇతర వ్యక్తులు తీసుకునే రుణాలకు మీరు హామీదారుగా ఉండడం అంటే ఏదో మామూలు విషయం కాదు. మీరు కూడా ఆ రుణానికి సహ రుణ గ్రహీత కిందే వస్తారు. రుణం తీసుకున్న వ్యక్తి చెల్లింపుల్లో విఫలమైతే ఆ తిరిగి చెల్లించాల్సిన భారం హామీ ఇచ్చిన వ్యక్తులపైనే పడుతుందనే విషయం మర్చిపోవద్దు. అయితే అన్ని సందర్భాల్లో రుణం చెల్లించని పక్షంలో ఆ భారాన్ని హామీదారులపై పూర్తిగా వేసి చేతులు దులుపుకోరు. 

హామీదారు ఎందుకు అవసరం
ఏదైనా రుణం ఇచ్చే సంస్థ లేదా బ్యాంకు రుణం కోసం గ్యారెంటీర్‌ని అడుగుతుంది. రుణ హామీదారుగా, రుణ దరఖాస్తుదారు రుణాన్ని చెల్లించడంలో విఫలమైతే, అతను రుణాన్ని తిరిగి చెల్లిస్తానని ఆర్థిక సంస్థకు హామీ ఇచ్చే వ్యక్తినే గ్యారంటీర్ అంటారు. అంటే ఒక విధంగా లోన్ గ్యారెంటీర్ కూడా రుణ దరఖాస్తుదారుడే. రుణ దరఖాస్తులో అతని సంతకం కూడా ఉంది. సాధారణంగా, రుణ దరఖాస్తుదారు తక్కువ క్రెడిట్ స్కోర్ కారణంగా వారి లోన్ రీపేమెంట్ కెపాసిటీ గురించి ఖచ్చితంగా తెలియనప్పుడు ఆర్థిక సంస్థలు రుణ హామీదారులను అడుగుతుంటాయి.

మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది..
రుణగ్రహీతలు నెలవారీ వాయిదాలు సక్రమంగా చెల్లించకపోయినా ఆ ప్రభావం హామీదారుడి క్రెడిట్‌ స్కోరుపైనా పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రుణం చెల్లింపులు పూర్తయ్యే వరకు భవిష్యత్‌లో హామీదారు తీసుకునే రుణ స్తోమత కూడా తగ్గిపోతుంది. 

హామీదారు పాత్ర ఏమిటి
లోన్ గ్యారెంటర్ బాధ్యత రుణ దరఖాస్తుదారుని పోలి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల దరఖాస్తుదారు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, ఆర్థిక సంస్థ రుణ హామీదారు నుండి బకాయిలను తిరిగి పొందవచ్చు. గ్యారెంటర్ బకాయిలు చెల్లించడానికి నిరాకరిస్తే, రుణదాత దీని కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. అలాగే, బకాయిలు చెల్లించమని కోర్టు హామీదారుని బలవంతం చేయవచ్చు. కొన్ని ప్రత్యేక కేసుల్లో ఈ అప్పుల రికవరీ కోసం అవసరమైతే బ్యాంకులు ఏకంగా హామీదారు ఆస్తులనూ జప్తు చేసుకునే ప్రమాదం ఉంటుంది.

ఆస్తులను వేలం వేసే హక్కు
రుణ దరఖాస్తుదారు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే, ఆర్థిక సంస్థ దానిని తిరిగి చెల్లించమని హామీదారుని అడుగుతుంది. హామీదారులు బకాయిలు చెల్లించకపోతే, ఆర్థిక సంస్థ వారి స్వంత డబ్బు కోసం వారి ఆస్తులను వేలం వేసే హక్కును కలిగి ఉంటుంది. రుణం హామీదారుగా మారినప్పుడు, దాని ప్రభావం క్రెడిట్ నివేదికలో ప్రతిబింబిస్తుంది. రుణ దరఖాస్తుదారు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే, అది గ్యారెంటర్ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఒకరు తీసుకునే అప్పుకు హామీదారుగా మీరు సంతకం పెట్టాక వెనక్కి తగ్గడం అంత తేలిక కాదు. అప్పు తీసుకున్న వ్యక్తితో పాటు, అప్పు ఇచ్చిన బ్యాంకూ ఇందుకు అంగీకరించాలి. మిగిలిన అప్పు చెల్లింపుకు మరో సరైన వ్యక్తి హామీదారుగా దొరికితే తప్ప, బ్యాంకులు ఇందుకు అంగీకరించవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సంతకం చేసే ముందే అన్ని విషయాలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. 

హామీదారు ఒప్పందంలో ఏమైనా ఇబ్బంది కలిగించే క్లాజ్‌ ఉంటే బ్యాంకుతో చర్చించి ఆ షరతుల్లో మార్పులు చేయమని కోరాలి. లేదా సరైన న్యాయవాదిని సంప్రదించి ఇబ్బందేమీ లేదనుకుంటేనే షూరిటీ సంతకం చేయాలి. వీటికి తోడు మీరు షూరిటీ ఇచ్చిన వ్యక్తి తీసుకున్న రుణాన్ని ఎప్పటికపుడు సక్రమంగా చెల్లిస్తున్నాడా? లేదా? అనే విషయం తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే అప్పుల చెల్లింపు భారం మీ మెడకు పడుతుంది.