Asianet News TeluguAsianet News Telugu

రండి బాబూ రండి.. టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు రెడ్ కార్పెట్, తెలంగాణకు పోటీగా కర్ణాటక

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా ప్లాంట్‌ను (tesla) తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ భారత్‌లో పలు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా బీజేపీ పాలిత కర్ణాటక (karnataka) కూడా ఎలాన్ మస్క్ తమ రాష్ట్రంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మస్క్‌ను ఆహ్వానించింది. 

karnataka invites elon musk to set up tesla plant
Author
Bangalore, First Published Jan 18, 2022, 8:12 PM IST

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా ప్లాంట్‌ను (tesla) తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ భారత్‌లో పలు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. భారత్‌లో టెస్లా ప్రవేశించేందుకు ప్రభుత్వం నుంచి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (elon musk ) గత వారం సంచలన ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr) .. తమ రాష్ట్రంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రావాలని ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ సూచించారు. ఆయన నుంచి ఎలన్ మస్క్‌కు ఆహ్వానం అందిందో లేదో.. తెలంగాణ బాటలో పశ్చిమ బెంగాల్ (west bengal) , మహారాష్ట్ర (maharashtra) , పంజాబ్ (punjab) , తమిళనాడు (tamilnadu) రాష్ట్రాలు కూడా టెస్లాను ఆహ్వానించాయి. పెట్టుబడులకు తమ రాష్ట్రాలు అనువైన ప్రాంతాలని తెలిపాయి.

తాజాగా బీజేపీ పాలిత కర్ణాటక (karnataka) కూడా తమ రాష్ట్రంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మస్క్‌ను ఆహ్వానించింది. ఇప్పటికే తమ రాష్ట్రం భారతదేశపు ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా గుర్తింపు పొందిన విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం గుర్తుచేసింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇది ఎంతో అనువైన ప్రాంతంగా కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి మురుగేశ్ ఆర్ నిరాని (murugesh r nirani) ట్వీట్ చేశారు. తమ రాష్ట్రంలో 400 ఆర్‌ అండ్ డీ సెంటర్లు, 45కు పైగా ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌లు, బెంగళూరుకు సమీపంలో ఓ ఈవీ క్లస్టర్ ఏర్పాటైననట్లు నిరాని వెల్లడించారు. అలాగే టెస్లా కంపెనీ దేశంలో తొలిసారిగా బెంగుళూరు అడ్రస్‌తో రిజిస్టర్ అయ్యిందని ఆయన గుర్తు చేశారు. పలు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఏ రాష్ట్రంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గుచూపుతారన్న అంశం దేశంలో ఉత్కంఠకర చర్చకు దారి తీసింది. 

కాగా.. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని గత ఏడాది టెస్లా కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ని ముందుగా దేశీయంగా ప్రారంభించాలని టెస్లాకు కేంద్రం సూచించింది. ఎక్కడో ఉత్పత్తి చేసిన టెస్లా ఈవీ వాహనాలను విక్రయించేందుకు భారత్‌ను మార్కెట్‌గా వాడుకోవాలంటే అనుమతించేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తే తగినన్ని రాయితీలు కల్పిస్తామని పేర్కొంది. అయితే ప్రస్తుతం టెస్లా కోరుతున్నన్ని రాయితీలు దేశంలోని ఏ ఇతర కంపెనీకి కల్పించడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెస్లాకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తే.. ఇతర పరిశ్రమలకు సరైన సంకేతాలు వెళ్లవని కేంద్రం పేర్కొంది. అదే సమయంలో రాయితీల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios