అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల తొలి వాయిదా గ‌డువు రేప‌టి (జూన్ 15)తో ముగియ‌నుంది. దీంతో ఇఫ్పుడు అందరి దృష్టి అడ్వాన్స్ టాక్స్ మీదనే పడింది. అయితే అసలు  అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి? ఎవ‌రు దీనిని చెల్లించాలి? దీని వల్ల లాభం ఏంటి,  గ‌డువులోగా చెల్లించ‌క‌పోతే ఏమైనా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందా లాంటి విషయాలను  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సాధారణంగా ఇన్ కం ట్యాక్స్ నిబంధనల ప్రకారం మన ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే మనం ఈ సంవత్సరం రాబోయే ఆదాయాన్ని అంచనా వేసి ముందుగానే పన్ను చెల్లిస్తే దాన్ని అడ్వాన్స్ టాక్స్ అంటారు. అయితే అడ్వాన్స్ టాక్స్ ను ఒకే సారి కాకుండా,నాలుగు దశల్లో చెల్లిస్తారు.

ఎవరు అర్హులు...
ఐటీ నిబంధనల ప్రకారం మీరు అంచనా వేసిన ఆదాయంపై ఆదాయపన్ను రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ముందస్తు పన్ను చెల్లించేందుకు మీరు అర్హులు అవుతారు. సాధారణంగా ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, అలాగే బిజినెస్ చేస్తున్నవారు, స్వయం ఉపాధి ఉన్నవారు ఈ పరిధిలోకి వస్తారు. సాధారణంగా టీడీఎస్ కట్ అవ్వకుండా వచ్చే ఆదాయాలపై ఈ ముందుస్తు టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. టీడీఎస్ కట్ అయ్యే ఆదాయాలపై అవసరం లేదు.

అలాగే చాలా సంస్థలు జీతం ద్వారా ఆదాయం పొందే ఉద్యోగులకు కూడా బేసిక్ పై పన్ను విధిస్తారు. అందుకే ఉద్యోగులు కూడా ఈ ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 

వీరికి అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సిన పనిలేదు...
ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో అంచ‌నా ఆదాయంపై చెల్లించాల్సిన ఆదాయ‌ప‌న్ను విలువ రూ.10 వేల కంటే త‌క్కువ ఉంటే అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 60 సంవ‌త్స‌రాలు పైబ‌డి ఎలాంటి ఆదాయం లేని సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు నుంచి మిన‌హాయింపు క‌ల్పించారు.

ఎలా లెక్కించాలి
ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో అందే అన్నిర‌కాల ఆదాయాల‌ను అంచ‌నా వేయాలి. ఇలా అంచ‌నా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న ప‌న్ను మిన‌హాయింపుల‌ను తీసివేయాలి. ఆ త‌ర్వాత మిగిలిన ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నును లెక్కించాలి. ఈ మొత్తం ప‌న్ను విలువ రూ.10 వేలు లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటే అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి. 

అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు ప్రతి సంవత్సరం నాలుగు గ‌డువు తేదీలు ఉంటాయి...
జూన్ 15కి ముందు: ముందస్తు పన్నులో 15% వరకు
సెప్టెంబర్ 15కి ముందు: ముందస్తు పన్నులో 45% వరకు
డిసెంబర్ 15కి ముందు: అడ్వాన్స్ ట్యాక్స్‌లో 75% వరకు
మార్చి 15కి ముందు: ముందస్తు పన్ను 100% వరకు

ఆల‌స్యంగా చెల్లిస్తే పెనాల్టీ..
ముంద‌స్తు ప‌న్ను చెల్లించ‌డంలో ఆస‌ల్యం చేస్తే పెనాల్టీ వ‌ర్తిస్తుంది. చెల్లించాల్సిన మొత్తంపై నెల‌కు 1 శాతం వ‌డ్డీ వ‌ర్తిస్తుంది.

చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ చెల్లిస్తే..

చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ చెల్లిస్తే రీఫండ్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ఐటీఆర్ ఫైల్ చేయాలి. అంతేకాకుండా చెల్లించిన అద‌న‌పు ప‌న్నుపై 6 శాతం వ‌డ్డీ పొందేందుకు మీరు అర్హులు.