రిలయన్స్ ఆదాయ అంచనాలకు 15 శాతం గండి ఏర్పడే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్స్ అంచనా వేసింది. ప్రస్తుతానికైతే కోత లేదని, నెగెటివ్ ధోరణులు పెరిగితే మాత్రం అంచనాల్లో కోత విధించాల్సి ఉంటుందని తెలిపింది. రిఫైనింగ్ మార్జిన్లు పెరిగే అవకాశం ఉన్నదని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
ముంబై: గత కొద్ది త్రైమాసికాలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) స్థూల రిఫైనింగ్ మార్జిన్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రస్తుతం రిఫైనింగ్, పెట్రో రసాయనాలకు ఉన్న ప్రతికూలతల దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఆదాయ అంచనాలు 15 శాతం మేర తగ్గే అవకాశాలు ఉన్నాయని జేపీ మోర్గాన్ తెలిపింది.
ఇక అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఐఎమ్‌ఓ) నిబంధనలు నిరుత్సాహపరిస్తే మాత్రం ఆదాయ అంచనాల్లో మరింత కోతలు పడే అవకాశం ఉంది. ధరలను 12-20 శాతం మేర పెంచితే ప్రధాన వ్యాపారాలకు దన్నుగా నిలవవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి టారిఫ్ రేట్లు పెరిగే సంకేతాలు కనిపించడం లేదని వారంటున్నారు. రిఫైనింగ్ మార్జిన్లు పెరిగితే మాత్రం ప్రతికూలతలు 9 శాతం మేర తగ్గే అవకాశం ఉంది.
‘రిఫైనింగ్, పెట్రో రసాయనాల మార్జిన్లు మా అంచనాల కంటే 15 శాతం కిందకు వెళ్లవచ్చు. ముడి చమురు ధరలు తగ్గడం కూడా రిలయన్స్‌పై ప్రభావం పడనుంది. ఎందుకంటే కొత్త ప్రాజెక్టుల(గ్యాసిఫైర్, ఆర్‌ఓజీసీ, ఈథేన్ రవాణా) లాభదాయకతలు ముడి చమురు ధరలకు ముడిపడిఉంటాయ’ని జేపీ మోర్గాన్ ఒక నివేదికలో పేర్కొన్నది.
ఆర్‌ఐఎల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్‌ఎమ్) ఒత్తిడిలో ఉన్నాయని చెప్పవచ్చు. మార్చి త్రైమాసికంలో అవి బ్యారెల్‌కు 8.2 డాలర్లుగానే నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇవి 11.1 డాలర్లుగా ఉండడం విశేషం.
మార్చి 2019 త్రైమాసిక జీఆర్‌ఎమ్.. 2014 డిసెంబర్ త్రైమాసికం తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఆ సమయంలో జీఆర్‌ఎమ్ బ్యారెల్‌కు 7.3 డాలర్లుగా ఉంది. ఐఎమ్‌ఓ నిబంధనల ప్రకారం.. షిప్పింగ్ కంపెనీలు వచ్చే జనవరి కల్లా తమ బంకర్ ఇంధనంలో సల్ఫర్ పరిమాణాన్ని 3.5 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గించాలి.
ఈ నిబంధనలు రిలయన్స్ రిఫైనరీల మార్జిన్లకు ఊతమిస్తాయి. ఈ నిబంధనల విషయంలో నిరుత్సాహానికి గురి చేస్తే మాత్రం ఆదాయ అంచనాల్లో కోతలు తప్పవని జేపీ మోర్గాన్ హెచ్చరించింది. ప్రస్తుతానికి మాత్రం 2019-20 అంచనాలను తగ్గించడం లేదని స్పష్టం చేసింది. ద్వితీయార్థంలో జీఆర్‌ఎమ్ రికవరీ చెందవచ్చన్న అంచనా ఇందుకు నేపథ్యమని తెలిపింది.
