ముంబై: రిలయన్స్ జియోఫోన్‌ - 2 ఫ్లాష్‌ విక్రయాలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్నాయి. జియో డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్‌ సేల్‌ ప్రారంభమవుతుందని రిలయన్స్‌ జియో తెలిపింది. ఈ ఫోన్‌ కోసం నేటి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. జియోఫోన్‌ వినియోగదార్ల సంఖ్యను 10 కోట్లకు చేర్చడమే లక్ష్యంగా, మెరుగైన సదుపాయాలతో జియోఫోన్‌ - 2ను సంస్థ విడుదల చేయనున్నది. జియో ఫోన్ - 2 ప్రస్తుతం పరిమితంగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నది. 

ధ్రువీక్రుత డీలర్ నుంచి ఫోన్ ఇలా అందుకోవచ్చు
గతేడాది విడుదల చేసిన జియో ఫోన్‌లో మాదిరిగా కాయి ఓఎస్ ఆండ్రాయిడ్ కలగలిసి ఉండటంతోపాటు క్వార్టీ కీప్యాడ్‌ నిర్వహించగలిగే ఈ 4జీ ఫోన్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌, గూగుల్‌ మ్యాప్స్‌ యాప్స్‌ జత చేరనున్నాయి. వినియోగదారులు తమ సమీప ధ్రువీక్రుత రిటైల్ డీలర్‌ను సంప్రదించి జియో ఫోన్ - 2 పొందవచ్చు. గతేడాది మార్కెట్‌లోకి రెట్టింపు ధర ఉంటుంది. వినియోగదారులు సమీప రిటైల్ డీలర్ వద్ద పేరు నమోదు చేసుకున్న ఐదు నుంచి ఏడు రోజుల్లో వారికి అందుబాటులోకి వస్తుంది.

జియో ఫోన్ - 2లో రీఫండ్ ఆఫర్ దూరం
భారతదేశంలో జియో ఫోన్ - 2 ధర రూ.2,999. గతేడాది రిలయన్స్ జియో ఫోన్ మార్కెట్‌లోకి విడుదల చేసినప్పుడు ప్రకటించినట్లు రీఫండ్ ఆప్షన్‌ను జియో ఫోన్ -2కు అందుబాటులో లేవు. జియో డాట్ కామ్ వెబ్‌సైట్‌లో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉటంటాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొద్ది నిమిషాలు ముందు వెబ్ సైట్ రీఫ్రెష్ చేసిన పిమ్మట జియో ఫోన్ - 2 విక్రయాలు ప్రారంభం అవుతాయి. జియో ఫోన్ - 2 నుంచి రిలయన్స్ వినియోగదారులకు రూ.49, రూ.99, రూ.153 ప్లాన్లు అమలు చేస్తున్నది. 

జియో బ్రాడ్‌బ్యాండ్‌కు రిజిస్ట్రేషన్లు షురూ 
టెలికం సంస్థ రిలయన్స్‌ జియో తాజాగా ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులకు దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. సెకనుకు ఒక గిగాబిట్‌ వేగంతో ఇంటర్నెట్‌ను అందిస్తామని జియో హామీ ఇస్తోంది. జియోడాట్‌కామ్‌ వెబ్‌సైట్, మైజియో యాప్‌ ద్వారా కనెక్షన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ‘జియోగిగాఫైబర్‌. గిగాబిట్‌ వైఫై, టీవీ, స్మార్ట్‌ హోం, ఫ్రీ కాలింగ్‌ వంటి మరెన్నో ఫీచర్స్‌ పొందండి‘ అంటూ మైజియో యాప్‌లో కంపెనీ ప్రకటించింది.

బ్రాడ్ బాండ్ సంస్థల మధ్య టారిఫ్‌ల యుద్ధం
ప్రస్తుతం పోటీ సంస్థలు హోమ్‌ యూజర్స్‌కి సెకన్‌కు 100 మెగాబిట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ అందిస్తున్నాయి. ఇందుకు చార్జీలు నెలకు సుమారు రూ. 1,000 దాకా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతకు 10 రెట్లు వేగంతో ఇంటర్నెట్‌ అందిస్తామని జియో చెబుతోంది. చార్జీల గురించి ఇంకా వెల్లడించకున్నా, మిగతా కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ముందుగా దేశవ్యాప్తంగా 1,100 నగరాల్లో ఇళ్లు, వ్యాపార సంస్థలు, చిన్న, పెద్ద సంస్థలకు బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ప్రారంభించనున్నట్లు జియో మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.


‘డిజిటల్‌’ డిస్కౌంట్‌పై కోత!
పెట్రో ‘డిజిటల్‌’ డిస్కౌంట్‌పై కోత పడింది. డిజిటల్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ 0.75 నుంచి 0.25 శాతానికి కుదింపునకు గురైంది. అయినా పెట్రోల్, డీజిల్‌ నగదు రహిత లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. పెట్రోల్‌ బంకుల్లో సర్వీస్‌ చార్జీలు లేక పోవడంతో వినియోగదారులు నగదు రహిత లావాదేవీలపైనే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 2016 నవంబర్‌లో నోట్ల రద్దు నేపథ్యంలో పెట్రోల్‌ బంకుల్లో  క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు, ఈ– వ్యాలెట్, మొబైల్‌ ఇతరత్రా నగదు రహిత వసతుల ద్వారా చెల్లింపులపై చమురు సంస్థలు రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మూడు రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో డిస్కౌంట్ జమ
లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై 0.75 శాతం డిస్కౌంట్‌ వర్తింపజేసి నగదు రహిత లావాదేవీలు జరిపిన  వినియోగదారులు బ్యాంక్‌ ఖాతాలో మూడు రోజుల్లో రాయితీ జమయ్యేలా చర్యలు చేపట్టింది. ఏటీఎంలలో  నగదు ఇబ్బందుల కారణంగా  ప్రధాన ఆయిల్‌ కంపెనీలైన ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ పెట్రోల్‌ బంకుల్లో డిజిటల్‌ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేపట్టారు. పెట్రోల్‌ బంకులో డిజిటల్‌ చెల్లింపులపై సేవా పన్ను మినహాయించడంతో వినియోగదారులు దానికి అలవాటుపడ్డారు. తాజాగా చమురు సంస్థలు నగదు రహిత లావాదేవీలపై రాయితీ 0.25 శాతానికి కుదించి వేసింది. ఈ నిర్ణయం ఈ నెల ఒకటి నుంచే అమల్లోకి వచ్చింది.

లీటర్‌ పెట్రోల్‌పై 20 పైసలు జమ
పెట్రోల్‌ బంకుల్లో డిజిటల్‌ చెల్లింపు ద్వారా పెట్రోల్, డీజిల్‌ కొనుగోళ్లు చేస్తే లీటర్‌పై బ్యాంక్‌ ఖాతాలో జమయ్యేది అక్షరాల ఇరవై పైసలే. గ్రేట ర్‌ పరిధిలో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 81.75 పైసలు ఉండగా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా లీటర్‌పై లభించే రాయితీ అక్షరాలా ఇరవై పైసలు. డీజిల్‌ ధర రూ.74.55 పైసలు ఉండగా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా లీటర్‌పై 18 పైసలు డిస్కౌంట్‌గా లభిస్తోంది.  మహానగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్‌ బంకులు ఉన్నాయి.

సగటున రోజూ 80 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ విక్రయాలు
ప్రతి రోజు సగటున 40 నుంచి 50 లక్షల లీటర్ల పెట్రోల్, 30 నుంచి 40 లక్షల డీజిల్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. నగరంలో 55 లక్షల వివిధ రకాల వాహనాలకు తోడు ఇతర ప్రాంతాల నుంచి  హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే సుమారు రూ. లక్ష వరకు వాహనాలు ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్‌ను వినియోగిస్తుంటాయి. పెట్రోల్, డీజిల్‌  కొనుగోళ్లపై రాయితీ తగ్గించినా స్వైపింగ్‌ ద్వారా కొనుగోలు మాత్రం తగ్గు ముఖం పట్టలేదు.