Asianet News TeluguAsianet News Telugu

ఆభరణాల పరిశ్రమకు లోన్స్ కనాకష్టం.. ఇదీ నీరవ్ మోదీ స్కామ్ ఎఫెక్ట్

నీరవ్ మోదీ - మెహుల్ చోక్సీ స్కామ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఆభరణాల వ్యాపారులకు రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదు. తక్షణం జ్యువెల్లరీ పరిశ్రమకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు అవసరమని వజ్రాభరణాల కౌన్సిల్ చెబుతోంది.

Jewellers are facing challenges in availing funds from banks following PNB fraud case

చెన్నై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో నీరవ్‌ మోదీ, అతని మేనమామ మెహుల్ చోక్సీ జంటగా చేసిన కుంభకోణం ఆభరణాల తయారీదారులకు చుక్కలు చూపుతోంది. స్కామ్‌ నేపథ్యంలో బ్యాంకులు రుణాలివ్వడానికి వెనుకాడుతుండటంతో జ్యుయలర్లు నిధుల కోసం సవాళ్లు ఎదుర్కొంటున్నారని వజ్రాభరణాల కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ ఆనంద పద్మనాభన్‌ చెప్పారు. 

తక్షణం ఆభరణాల పరిశ్రమకు రూ.15వేల కోట్లు అవసరం


‘వజ్రాభరణాల పరిశ్రమకు ప్రస్తుతం రూ. 15వేల కోట్ల మేర నిధులు అవసరం. కానీ రుణాలు లభించడం లేదు. కొన్నాళ్ల క్రితం ఒక ఆభరణాల సంస్థ మూతబడింది. ఇక నీరవ్‌ మోదీ ఉదంతం తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత సమస్యాత్మకంగా మారింది’ అని వజ్రాభరణాల కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ ఆనంద పద్మనాభన్‌ వ్యాఖ్యానించారు. ఇటీవలి పరిణామాలతో ట్రేడర్లకు బ్యాంకులు రుణాలివ్వడం ఆపేశాయి. దీంతో మా కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు మందగించాయి’ అని ఆయన తెలియజేశారు.

రుణాల సమస్య ఎదుర్కొంటున్న ఆభరణాల వ్యాపారులు


నీరవ్ మోదీ పుణ్యమా? అని దేశవ్యాప్తంగా ఆభరణాల వ్యాపారులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని వజ్రాభరణాల కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ ఆనంద పద్మనాభన్‌ చెప్పారు. ఆభరణాల వ్యాపారులు, సంస్థలకు బ్యాంకర్లు రుణాలివ్వడం నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాల వాయిదాలను చెల్లించాలని ఆభరణాల వ్యాపారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. 

రుణ వసూళ్లకే బ్యాంకర్ల ప్రాధాన్యం


కొందరు వ్యాపారుల వద్ద నుంచి వాయిదాల కింద రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు వసూలు చేస్తున్న బ్యాంకర్లు ప్రస్తుత రుణ ఖాతాలను మూసివేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప.. కొత్త రుణాలివ్వడానికి ముందుకు రావడం లేదు. రుణాల మంజూరు విషయంలో నిబంధనలను సడలించాలంటూ ఓవైపు తాము అభ్యర్థిస్తుంటే మరోవైపు దానికి విరుద్ధంగా ఆర్థిక సంస్థలు మొత్తానికే రుణాలివ్వడాన్ని నిలిపివేశాయని వజ్రాభరణాల కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ ఆనంద పద్మనాభన్‌ అన్నారు. 

విస్తరణకు 75 శాతం బ్యాంకు రుణం ఇలా


తాము వ్యాపారాన్ని విస్తరించాలంటే ఒక్క శాఖను ప్రారంభించడానికి 75 శాతం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే మిగతా తాము నిధులు సమకూర్చుకోవాల్సి వస్తున్నదని వజ్రాభరణాల కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ ఆనంద పద్మనాభన్‌ చెప్పారు. ప్రస్తుతం దేశంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఇండస్ట్రీ విలువ రూ.2 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఏడు నుంచి 10 శాతం వార్షిక పురోగతి నమోదవుతుందని పద్మనాభన్ అన్నారు.

కేంద్రం ముందుకు ఎల్‌ఐసీ–ఐడీబీఐ డీల్‌


ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి మెజారిటీ వాటాలను విక్రయించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో బ్యాంకు వాటాలను 51 శాతం దాకా పెంచుకునేందుకు ఎల్‌ఐసీ చేసిన ప్రతిపాదనను బోర్డు సమావేశంలో చర్చించినట్లు ఐడీబీఐ బ్యాంకు స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. ‘దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాలని బోర్డు నిర్ణయం తీసుకుంది‘ అని వివరించింది.

ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం నిధులు రూ.11,336 కోట్లు


ఐదు ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.11,366 కోట్ల నిధులను కేటాయించింది. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్‌లతో పాటు మరో రెండు బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేటాయించిన తొలి నిధులు ఇవే. మిగతా రూ.53,664 కోట్లను విడుతల వారిగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేటాయించనున్నది కేంద్రం. నీరవ్ మోదీ మోసం చేయడంతో భారీగా నష్టపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత వహించింది. మిగతా బ్యాంకులకు నిధులు భారీగానే కేటాయించింది. ఈ వార్తలు బయటకు రావడంతో స్టాక్ మార్కెట్లలో బ్యాంకు షేర్లు పుంజుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios