Asianet News TeluguAsianet News Telugu

జెట్ ఎయిర్‌వేస్‌కు కష్టాలు తొలిగేనా?: ట్రూజెట్ చర్చలు సఫలం అవుతాయా?

ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్’ కష్టాలకు తాత్కాలికంగానైనా తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రుజెట్ సంస్థతో జరిగిన చర్చలు ఫలప్రదమైతే జెట్ ఎయిర్ వేస్ తన విమానాలను లీజుకు ఇవ్వనున్నది. 

Jet Airways says Continues to Evaluate All Alternatives
Author
Mumbai, First Published Aug 18, 2018, 7:40 AM IST

ముంబై: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్‌’ కష్టాల కడలి నుంచి తాత్కాలికంగా బయటపడుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన ఏడు ఏటీఆర్ విమానాల లీజు కోసం ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ట్రూజెట్’ నిర్వహిస్తున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడం, అదనపు ఆదాయం ఆర్జించే క్రమంలో భాగంగా జెట్ ఎయిర్‌వేస్ ఈ విమానాలను లీజుకు ఇస్తున్నది.

15 ఏటీఆర్ సర్వీసులు నడుపుతున్న జెట్ ఎయిర్ వేస్


నరేష్ గోయల్ నాయకత్వంలోని నడుస్తున్న జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం 15 ఏటీఆర్‌ఎస్‌లను నడుపుతున్నది. అలాగే 2015 జూలైలో విమానయాన సేవలు ప్రారంభించిన ట్రూజెట్ కేవలం ఏటీఆర్‌లను వినియోగిస్తున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ లీజు ఒప్పందం ఈ నెలలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని పౌర విమానయాన పరిశ్రమ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.  

జెట్ ఎయిర్‌వేస్‌కు మార్చి త్రైమాసికంలో రూ.1000 కోట్ల నష్టం 


మార్చి 30తో ముగిసిన త్రైమాసికంలో జెట్ ఎయిర్‌వేస్ రూ.1000 కోట్లకు పైగా నష్టాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు ఉండే అవకాశం ఉన్నదని విభిన్న వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పర్యాటక ప్రాంతాలకు విమాన సేవలను అందిస్తున్న ట్రూజెట్..ఈ ఏడాది చివరి నుంచి తన సేవలను మరిన్ని నూతన నగరాలకు విస్తరించాలనుకుంటున్నది. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్, క్య్రూ, మెంటనెన్స్, బీమాలను జెట్ ఎయిర్‌వేస్..ట్రూజెట్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ట్రూజెట్ అధికార ప్రతినిధి దృవీకరించారు. ట్రూజెట్ సంస్థతో చర్చల విషయమై వివరణ ఇవ్వాలని జెట్ ఎయిర్ వేస్ సంస్థ యాజమాన్యాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్చ్సేంజ్ ఆదేశించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో 20 నూతన రూట్లకు విమాన సేవలను అందించడానికి ఐదు నుంచి ఏడు ఏటీఆర్ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ ఐదు ఏటీఆర్-72లో 14 రూట్లకు సేవలు అందిస్తున్నది.

27న జెట్ ఎయిర్‌వేస్ ఫలితాలు


ఎట్టకేలకు ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ఈ నెల 27న తన ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నది. ఇందుకోసం బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ఇంకా విడుదల చేయలేదు సంస్థ. ఈ నెల తొమ్మిదో తేదీన సమావేశం జరిగినా ఫలితాలకు బోర్డు ఆమోదం తెలుపలేదు. ఈ విషయాన్ని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. నియంత్రణ మండలితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ నెల 29న ట్రేడింగ్ విండో ముగియనున్నది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 2.20 శాతం పెరిగి రూ.307.05 వద్ద ముగిసింది.

అలవెన్సులివ్వకుంటే విమానాలు నడపబోమన్న ఎయిర్ ఇండియా పైలట్లు


ఫ్లయింగ్‌ అలవెన్స్‌ బాకీలు తక్షణమే చెల్లించని పక్షంలో విమానాలు నడిపే ప్రసక్తే లేదని ప్రభుత్వ రంగ ఎయిరిండియా యాజమాన్యాన్ని పైలట్లు హెచ్చరించారు. మిగతా ఉద్యోగులందరికీ ఎలాంటి జాప్యం చేయకుండా సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నా, తమనూ.. క్యాబిన్‌ సిబ్బందినీ పక్కన పెడుతున్నారని వారు ఆందోళ వ్యక్తం చేశారు. పైలట్ల జీతాల్లో ఎక్కువ భాగం వాటా ఫ్లయింగ్‌ అలవెన్సులదే ఉంటుందని తెలిసీ ఇలా చేయడం భావ్యం కాదని వారు పేర్కొన్నారు.

తక్షణం అలవెన్సులు చెల్లించాల్సిందేనని పైలట్ల స్పష్టీకరణ


ఫ్లయింగ్‌ అలవెన్సులను తక్షణం చెల్లించని పక్షంలో ఫ్లయింగ్‌ విధులకు హాజరు కాలేమని ఎయిరిండియా ఫైనాన్స్ డైరెక్టర్‌కు పంపిన లేఖలో ఇండియన్‌ కమర్షియల్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ (ఐసీపీఏ) పేర్కొంది. జీతం మాత్రమే చెల్లిస్తున్నందున ఆఫీసుకు వస్తామని, ఫ్లయింగ్‌ విధులు తప్ప మిగతావన్నీ నిర్వర్తిస్తామని తెలిపింది. పైలట్ల జీతభత్యాల్లో 30 శాతమే జీతం కాగా మిగతాది అలవెన్సుల రూపంలోనే ఉంటుంది. సాధారణంగా ఫ్లయింగ్‌ అలవెన్సులు రెండు నెలల తర్వాత చెల్లిస్తారు. దీని ప్రకారం జూన్‌ నెల అలవెన్స్‌ను ఈ నెల ఒకటో తేదీన చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటిదాకా చెల్లించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఎయిరిండియా సిబ్బందికి అలవెన్సులు ఇలా చెల్లింపు


ఎయిర్ ఇండియాకు చెందిన 700 మంది పైలట్లు ఐసీపీఏలో సభ్యులుగా ఉన్నారు. వీరు ఎయిర్‌ 320 ఫ్యామిలీ విమానాలను నడిపిస్తున్నారు. అలవెన్స్ ల విషయమై యాజమాన్యానికి పైలట్లు జారీ చేసిన హెచ్చరికతో ఎయిర్ ఇండియా కష్టాల్లో చిక్కుకున్నట్లే. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా భారీ నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థను ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడినా  అది విజయవంతంకాలేదు. ఈ నేపథ్యంలో నిధులు సమకూర్చి ఎయిర్‌ ఇండియా కార్యకలాపాలు సాగించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ. 980 కోట్లు అందుకోనున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios