ఆఫర్ల వర్షం: జెట్ ఎయిర్వేస్ టు స్పైస్‌జెట్ వరకు అదేబాట

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 26, Dec 2018, 11:50 AM IST
Jet Airways Offers Up To 30% Discount On Flight Tickets, Details Here
Highlights


నష్టాలతో సతమతం అవుతున్నా దేశీయ విమాన యాన సంస్థలు ప్రయాణికులకు వసతులు కల్పించడంలో ఆఫర్లు ప్రకటించడంలో పోటీ పడుతున్నాయి. జెట్ ఎయిర్వేస్ నుంచి గో ఎయిర్.. స్పైస్ జెట్ వరకు వివిధ ప్రైవేట్ విమానయాన సంస్థలు రకరకాల ఆఫర్లను వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చాయి. 

న్యూఢిల్లీ: క్రిస్‌మస్, న్యూ ఇయర్‌ సందర్భంగా విమానయాన సంస్థలు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించాయి. చమురు ధరల భారంతో నష్టాలతో నెట్టుకొస్తున్నా, పోటీ పరంగా ఎయిర్‌లైన్స్‌ సంస్థలు దూకుడుగానే ఉన్నాయి. నవంబర్‌లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌ 11.03 శాతం పెరిగింది. 116.45 లక్షల మంది ప్రయాణికులు ఈ నెల్లో విమానాల్లో ప్రయాణించారు. ఈ వృద్ధి రేటు గత నాలుగేళ్ల కాలంలోనే అతి తక్కువ. అంతకుముందు అక్టోబర్‌ నెలలో ట్రాఫిక్‌ వృద్ధి 13.34 శాతంగా ఉంది. 

జనవరి ఒకటో తేదీ వరకు జెట్ ఎయిర్వేస్ ఆఫర్లు
పరిమిత కాలం పాటు అమల్లో ఉండే విధంగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్‌ చార్జీలపై 30 శాతం తగ్గింపు ఇస్తోంది. జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి వరకు టికెట్‌ బుకింగ్‌లపై ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి. ఒకవైపు, రానుపోను ప్రయాణాలకూ, బిజినెస్, ఎకానమీ తరగతుల టికెట్లపైనా తగ్గింపు ఇస్తోంది. అంతర్జాతీయ మార్గాల్లో జనవరి 7, ఆ తర్వాత ప్రయాణాలకు తగ్గింపు ధరలపై టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.  

పుకెట్‌కు గో ఎయిర్‌ విమాన సర్వీసులు ప్రారంభం
గో ఎయిర్‌ సంస్థ థాయిలాండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఫుకెట్‌లో వచ్చే నెల 10–13వ తేదీల మధ్య జరిగే యాట్‌ షో నేపథ్యంలో, ఫుకెట్‌ ప్రయాణ టికెట్లపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది. భారత్‌ నుంచి ఫుకెట్‌కు నేరుగా విమాన సేవలను ప్రారంభిస్తున్న తొలి సంస్థ ఇదే.  

స్పైస్ జెట్ ఎనిమిది కొత్త సర్వీసుల ప్రారంభం 
హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా, పుణె, కోయంబత్తూర్‌కు జనవరి ఒకటో తేదీ నుంచి కొత్తగా ఎనిమిది విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బెంగళూరు, కొచ్చి, పోర్ట్‌బ్లెయిర్, బాగ్‌డోగ్రా మధ్య ఎనిమిది సీజనల్‌ విమాన సర్వీసులను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 28 మధ్య నడపనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ నుంచి వివిధ గమ్యస్థానాలకు మొత్తం మీద 41 విమానాలను నడపనుంది. 

స్పైస్ జెట్ విమాన సర్వీసుల చార్జీలు ఇలా 
హైదరాబాద్‌– కోల్‌కతా మధ్య రూ.2,699కే టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. కోల్‌కతా–హైదరాబాద్‌ మార్గంలో రూ.3,199కే టికెట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించింది. ఇక హైదరాబాద్‌–పుణె మధ్య రూ.2,499, రూ.2,209 ధరలను నిర్ణయించింది. హైదరాబాద్‌– కోయంబత్తూరుకు రూ.2,809, తిరుగు ప్రయాణ టికెట్‌ను రూ.2,309కే ప్రమోషనల్‌ ఆఫర్‌ కింద అందిస్తున్నట్టు స్పైస్‌జెట్‌ పేర్కొంది. 

loader