Asianet News TeluguAsianet News Telugu

ఈ నెలలో కూడా జెట్ ఎయిర్‌వేస్ టేకాఫ్ డౌటే..

 దేశీయ రెండో విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్‌లో ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ నెలలో కూడా విమానాలు పైకెగరలేవని ఆ సంస్థ వర్గాలే చెబుతున్నాయి. సంస్థ ఉజ్వల భవిష్యత్ కోసం నియంత్రణ అధికారాలను, ప్రయోజనాలను వదులుకుంటున్నట్లు జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ తెలిపారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్ వాణిజ్య లావాదేవీల సంగతి తమకేమీ తెలియదని, బ్యాంకర్లు చూసుకుంటారని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. సర్వీసుల నిర్వహణను మాత్రమే తాము పర్యవేక్షిస్తామన్నారు. 

Jet Airways math finds airline may not fly beyond April
Author
New Delhi, First Published Apr 4, 2019, 3:05 PM IST

ముంబై: నరేశ్ గోయల్ సారథ్యం నుంచి బ్యాంకర్ల కన్సార్టియం చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ ప్రభ మారలేదు. గోయల్, ఆయన భార్య రాజీనామా చేసిన వెంటనే బ్యాంకర్ల కన్సార్టియం జెట్ ఎయిర్వేస్ సంస్థకు తక్షణ సాయంగా రూ.1,500 కోట్ల డెట్ రుణం మంజూరు చేశాయి.

రుణం నిధులు మరో వారంలోగా సంస్థ ఖాతాలో చేరకుంటే ఈ నెలలోనూ జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ దిశగా ముందడుగు వేయలేదని విశ్వసనీయ వర్గాల కథనం. ఇప్పటివరకు సాంకేతిక కారణాల వల్లే సంస్థ ఖాతాల్లో చేరలేదని సమాచారం.

జెట్ ఎయిర్వేస్ టాప్ మేనేజ్మెంట్ ఇప్పటికే పునరుద్ధరణ ప్రణాళిక భవితవ్యంపై స్పష్టత కోసం బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ప్రత్యేకించి ఆర్బీఐ దివాళా సర్క్యులర్ కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత రుణ బకాయిల వసూలు విషయమై బ్యాంకర్లలోనే స్పష్టత లేదని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే సంస్థ ఉజ్వల భవిష్యత్ కోసం తాను దాని నుంచి లభించే అన్ని నియంత్రణ, ప్రయోజనాలను వదులుకుంటున్నట్లు జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ ప్రకటించారు. గత వారంలో వచ్చిన రూ.180- 200 కోట్ల రుణం డిసెంబర్ వేతనాల చెల్లింపు, జెట్ ఫ్యూయల్ డ్యూస్ చెల్లింపులకే సరిపోయాయి. 

విమాన లీజు సంస్థలకు పైసా చెల్లించకపోవడంతో వాటి యాజమాన్యాలు అసంత్రుప్తిగా ఉన్నాయి. తమకు బకాయిలు చెల్లించే వరకు విమానాలను ఎగురనివ్వబోమని విమాన లీజు సంస్థల యాజమాన్యాలు పేర్కొంటున్నట్లు సమాచారం. 

మరోవైపు ఉద్యోగులు వేతన బకాయిల పరిస్థితిపై స్పష్టత కోరుతున్నారు. టీపీజీ అనే సంస్థ కూడా జెట్ ఎయిర్వేస్ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించింది. ప్రస్తుతం 28 జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మాత్రమే సేవలందిస్తున్నాయని, అందులో 15 దేశీయ మార్గాల్లో నడుస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఖరోలా తెలిపారు.

అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులు కొనసాగించే సామర్థ్యం సంస్థకు ఉందా అనే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఖరోలా తెలిపారు. జెట్‌కు నిధులందించడంపై మాట్లాడుతూ, ఆ విషయాన్ని బ్యాంకులు చూసుకుంటాయన్నారు. దీనిపై జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతినిధి స్పందిస్తూ, తగినన్ని విమానాలతో, కుదించిన షెడ్యూల్‌ ప్రకారం విమానాలు నడుపుతున్నట్లు వివరించారు.

మంగళవారం స్టాక్‌ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో 15 విమానాలు కార్యకలాపాలు నిలిపేసినట్లు జెట్‌ వెల్లడించిన సంగతి విదితమే. జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు 28 నడుస్తున్నాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) కూడా తెలిపింది. 15 విమానాలు నిలిపేశామని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు జెట్‌ ఇచ్చిన సమాచారం అంతకుముందుదని, డీజీసీఏ స్పష్టం చేసింది.

సంక్షోభంలో చిక్కుకోకముందు జెట్‌ ఎయిర్‌వేస్‌ మొత్తం 119 విమానాలతో కార్యకలాపాలు నిర్వహించేది. లీజుదార్లకు అద్దె చెల్లించ లేకపోవడంతో, క్రమంగా విమానాలను నిలిపివేస్తూ వచ్చింది. ఇలా నిలిచిన విమానాల సంఖ్య 69 గా సంస్థ పేర్కొంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ తన 16 వేల మంది సిబ్బందికి మార్చి నెల వేతనాలు కూడా ఆలస్యంగా అందించనుంది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ రాహుల్‌ తనేజా ఉద్యోగులకు తెలిపారు. ఈనెల 9న తదుపరి సమాచారం ఇస్తామని సంస్థ పేర్కొంది.

సంస్థ యాజమాన్య బాధ్యతను ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకర్లు తీసుకున్న నేపథ్యంలో, ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళిక ఖరారులో సంక్లిష్టతల వల్లే ఈ పరిణామం చేటుచేసుకుందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. అనుకున్న సమయం కంటే పరిష్కారం అమలు ప్రక్రియ ఆలస్యమైందని, కార్యకలాపాల్లో స్థిరత్వం తేవడం కోసం రుణదాతలు, ఇతర సంస్థలతో సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయని వివరించింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ వాణిజ్య కార్యకలాపాల్లో తమ శాఖ జోక్యం చేసుకోబోదని, ఎటువంటి సాయమూ చేయడం లేదని పౌర విమానయాన మంత్రి సురేశ్‌ప్రభు స్పష్టం చేశారు. జెట్‌ యాజమాన్య బాధ్యత స్వీకరించిన బ్యాంకులే నేరుగా వాటాదార్లయినందున, అవే చూసుకుంటాయన్నారు. విమాన ప్రయాణికుల భద్రత అంశాలను మాత్రం తాము పర్యవేక్షిస్తామని, జెట్‌ ప్రతినిధులతో ఆ మేరకే తమ శాఖ అధికారులు సంప్రదింపులు జరిపారని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios