ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాను ఆర్థికంగా స్థితిమంతులకే విక్రయించాలని భాగస్వామి ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో పాటు, ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకర్లు యోచిస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన బ్రిటన్‌ కుబేరులు హిందూజా సోదరుల సారథ్యంలోని హిందూజా గ్రూప్‌తో ఇందుకోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం.

జెట్ ఎయిర్వేస్‌లో పెట్టుబడులపై హిందుజాలు ఇలా
‘జెట్‌ ఎయిర్వేస్ సంస్థలో పెట్టుబడులకు సంబంధించి హిందూజా గ్రూప్‌ ఇప్పటివరకు స్పష్టమైన నిబద్ధత కనబరచలేదు. అయితే ఎతిహాద్‌ ప్రతినిధులు హిందూజా గ్రూప్‌ అధిపతి జీపీ హిందూజాను కలిసిన తరవాత, ఆ గ్రూప్‌ ఆసక్తి అయితే చూపుతోంది. హిందూజా గ్రూప్‌ భారతీయ వ్యాపారాలను పర్యవేక్షించే తన సోదరుడు అశోక్‌ హిందూజాను ఎతిహాద్‌ ప్రతినిధులకు జీపీ హిందూజా పరిచయం చేశారు’ అని ఒక ఆంగ్ల దినపత్రిక తెలిపింది.

2001లో ఎయిరిండియాలో వాటా కోసం హిందూజా బిడ్
హిందూజా సోదరుల సంపద విలువ 22 బిలియన్‌ పౌండ్లుగా (సుమారు రూ.1.98 లక్షల కోట్లు) సండేటైమ్స్‌ రిచ్‌లిస్ట్‌ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. గతంలో 2001లో ఎయిరిండియాలో 40 శాతం వాటా విక్రయించాలనే ప్రతిపాదన వచ్చినపుడు హిందూజా గ్రూప్‌ బిడ్‌ వేసింది. 

ఇండియన్ ఎయిర్ లైన్స్‌లో ఇలా హిందూజాలు
ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లోనూ 26 శాతం వాటా కొనుగోలు కోసం అశోక్‌ లేలాండ్‌, హిందూజా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో పాటు విదేశీ కార్పొరేట్‌ సంస్థ మాకెన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లతో కలిసి బిడ్‌ వేశారు.  అప్పట్లో ఈ ప్రభుత్వరంగ విమానయాన సంస్థల్లో వాటా విక్రయ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవల ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రతిపాదన ముందుకు వచ్చినపుడు కూడా హిందూజా గ్రూప్‌ ఆసక్తి చూపిందని సమాచారం.

మైనారిటీ వాటాకే పరిమితమవుతానంటున్న ఎతిహాద్
అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌లో భాగస్వామిగా ఉన్న ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ కూడా మరికొంత వాటా కొనుగోలుకు ఫైనాన్షియల్‌ బిడ్‌ సమర్పించినా, మైనారిటీ వాటాదారుగా మాత్రమే ఉంటానని పేర్కొన్న సంగతి విదితమే. ప్రధాన వాటాదారుగా మరో సంస్థను జెట్‌లోకి ఆహ్వానించడమే ధ్యేయమని ఎతిహాద్ పేర్కొంది. 

లీజ్ విమానాలు ఇతర సంస్థలకు ఇలా కేటాయింపు
జెట్‌లో వాటాల విక్రయం తేలకపోవడం, కార్యకలాపాలు నిలిచిపోయి నెల కావస్తుండటంతో, లీజ్‌పై ఉన్న విమానాల్లో సగానికి పైగా వాటి యజమానులు వెనక్కి తీసుకుని, ఇతర సంస్థలకు కేటాయించారు కూడా. మరోవైపు సీఈఓ సహా నలుగురు ఉన్నతాధికారులు, పలువురు డైరెక్టర్లు జెట్‌ ఎయిర్వేస్ సంస్థ నుంచి వైదొలిగారు. 

ఎయిర్ పోర్ట్స్‌లో స్లాట్స్ 60 శాతం వివిధ ఎయిర్ లైన్స్‌కు కేటాయింపు
జెట్‌కు వివిధ విమానాశ్రయాల్లో ఉన్న స్లాట్స్‌ను 60 శాతం వరకు పోటీ సంస్థలకు తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం కేటాయించింది. జనవరి నుంచి వేతనాలు అందనందున, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పైలట్లు సహా ఇతర సిబ్బంది కూడా అవకాశం ఉన్న సంస్థల్లో చేరుతున్నారు.

రూ. 14,000 కోట్లకు కొంటాం అంటున్న డార్విన్
జెట్‌ ఎయిర్‌వేస్‌ను రూ.14,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు డార్విన్‌ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ వాటా విక్రయానికి బిడ్ల ప్రక్రియ నిర్వహిస్తున్న ఎస్‌బీఐ క్యాప్స్‌తో డార్విన్‌ గ్రూప్‌ ఉన్నతాధికారులు ఈ విషయమై బుధవారం సంప్రదించారు.

ఫైనాన్సియల్ బిడ్స్ లో డార్విన్
గత నెల‌8-12 తేదీల్లో బిడ్లు దాఖలు చేసిన నాలుగు సంస్థల్లో డార్విన్‌ గ్రూప్‌ లేదు. అయితే ఫైనాన్షియల్‌ బిడ్ల దాఖలుకు గడువుగా నిర్ణయించిన ఈనెల 10కి ముందు ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో పాటు కొన్ని కొత్త సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని బ్యాంకర్ల బృందం ప్రకటించింది. 

13న బిడ్లను పరిశీలించిన బ్యాంకర్లు
జెట్ ఎయిర్వేస్ సంస్థ టేకోవర్ కోసం దాఖలైన బిడ్లను ఈ నెల 13న బ్యాంకర్లు పరిశీలించారు. కొత్తగా బిడ్‌ దాఖలు చేసిన వాటిలో ఒకటైన డార్విన్‌ గ్రూప్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) రాహుల్‌ గన్‌పులె ఎస్‌బీఐ క్యాప్‌ ఉన్నతాధికారులతో బుధవారం చర్చించారు. రూ.14,000 కోట్లకు అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొంటామని పేర్కొన్నారు. 

8నే బిడ్‌ వేశాం: డార్విన్‌ గ్రూప్‌
డార్విన్‌ గ్రూప్‌ గురించి విపణిలో ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. చమురు, సహజవాయువు, ఆతిథ్యరంగం, స్థిరాస్థితోపాటు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టామని డార్విన్‌ ప్లాట్‌ఫామ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చెబుతోంది. తాము ఈనెల 8న బిడ్‌ అందించామని సంస్థ సీఈఓ రాహుల్‌ బుధవారం మీడియాకు చెప్పారు. దీనిపై చర్చించేందుకు ఎస్‌బీఐ క్యాప్స్‌ ఆహ్వానంతోనే వచ్చినట్లు పేర్కొన్నారు. 

జెట్ ఎయిర్వేస్ పూర్తి వివరాల కోసం ఇలా
జెట్‌ ఎయిర్‌వేస్‌కు సంబంధించి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) వద్ద, ఇతర సంస్థల వద్ద బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఫైనాన్షియల్‌ బిడ్‌ వేశామని డార్విన్ గ్రూప్ సీఈఓ రాహుల్ గన్ పులె చెప్పారు. అయితే సంస్థ ఆస్తులు, అప్పులు-చెల్లించాల్సిన మొత్తాలపై బయటకు రాని వివరాలు తెలుసుకునేందుకు, పూర్తిగా అవగాహన చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. 

తమకు అవసరమైన వివరాలివ్వాలని ఎస్బీఐ క్యాప్స్‌ను కోరామన్న డార్విన్
తమకు ఏయే వివరాలు కావాలో ఎస్‌బీఐ క్యాప్స్‌కు వెల్లడించినట్లు డార్విన్ గ్రూప్ సీఈఓ రాహుల్ గన్ పులె తెలిపారు. సామర్థ్యం కలిగిన కంపెనీలుగా గుర్తించిన వాటికి జెట్‌పై పూర్తి వివరాలు అందాయని, తమకు ఇవ్వలేదన్నారు. బ్యాంకర్లు తమ బిడ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అంగీకరిస్తేనే ఆ సమాచారం ఇస్తారని రాహుల్‌ వివరించారు.

వన్ టైం చెల్లింపు కింద రుణాలన్నీ చెల్లిస్తాం: డార్విన్ సీఈఓ రాహుల్ గన్ పులె
జెట్‌ స్వాధీనానికి తమ గ్రూప్‌ రూ.14,000 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చిందని డార్విన్ గ్రూప్ సీఈఓ రాహుల్‌ గన్ పులె తెలిపారు. ఒక్కసారి చెల్లింపు కింద, పాత బాధ్యతలన్నీ నెరవేరుస్తామని వెల్లడించారు. తమ గ్రూప్‌ అంతర్గత సమీకరణల ద్వారా నిధులు చెల్లిస్తుందని పేర్కొన్నారు. నిధులు ఎలా సమీకరిస్తారో వెల్లడించాలని ఎస్‌బీఐ క్యాప్స్‌ తమను కోరిందని రాహుల్‌ చెప్పారు. ఎతిహాద్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని, ఆ సంస్థను కూడా జెట్‌ బోర్డులో భాగస్వాములను చేయాలన్నది తమ ప్రతిపాదన అని అన్నారు.