ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’ విమాన సర్వీసులను రద్దు చేయడం దేశీయ విమానయాన రంగాన్నే అతలాకుతలం చేస్తోంది. ఇటీవలి ప్రమాదాలతో బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాల నిలిపివేత ప్రభావమూ పరిశ్రమపై పడిందన్న విమర్శ ఉంది.

గత నెల రోజుల్లో దాదాపు 10 లక్షలకు పైగా సీట్లు తగ్గిపోయాయయని.. ఇది విమానయాన రంగాన్ని భయపెడుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. సీట్లు తగ్గటానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసుల రద్దు ప్రధాన కారణమన్న విమర్శ ఉంది.

జనవరిలో దేశీయంగా 1.47 కోట్ల విమాన సీట్లు అందుబాటులో ఉండగా ఫిబ్రవరి నెలకు 13 లక్షల సీట్లు తగ్గి 1.37 కోట్లకు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నెల రోజుల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ దాదాపు 300కు పైగా సర్వీసులను రద్దు చేయటంతో పాటు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కూడా సిబ్బంది కొరతతో సర్వీసులను నిలిపివేయడం భారీగా ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ రోజుకు 1,300 విమాన సర్వీసులను నిర్వహిస్తుండగా పైలట్ల కొరతతో రోజుకు 30 సర్వీసులను రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలను నడపరాదని స్పైస్‌జెట్‌కు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆదేశించటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.

విజయ్ మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మూతపడిన తర్వాత దేశీయంగా విమాన సీట్లు ఈ స్థాయిలో తగ్గటం ఇదే మొదటిసారని పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి. లీజుదారులకు చెల్లింపులను చేపట్టడంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విఫలం కావటంతో ఆ సంస్థకు చెందిన 84 విమానాలు సేవలందించకుండా నిలిచిపోయాయి. 

మరోవైపు స్పైస్‌జెట్‌కు చెందిన 12 బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలను నిలిపివేసింది.పైలట్ల కొరతతోనూ విమాన సర్వీసులను రద్దు చేసే పరిస్థితి ఉందని చెబుతున్నారు. 

జెట్‌ ఎయిర్‌వేస్‌తోపాటు మిగిలిన సంస్థలు పైలెట్ల కొరతను ఎదుర్కొనటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని, ఇది లీజర్‌, పర్యాటక రంగాలను దెబ్బతీయనుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయివిమాన సర్వీసుల రద్దుతో విమాన ప్రయాణికుల్లో డబుల్ డిజిట్ వృద్ధి కష్టమేనని పరిశ్రమ భావిస్తోంది. 

ఇప్పటికే ప్రయాణికుల వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. ఫిబ్రవరి నెలకు 5.6 శాతం మేరకు పెరిగి 1.13 కోట్ల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. ఈ వృద్ధి రేటు 53 నెలల కనిష్ఠ స్థాయి. విమాన సర్వీసులు తగ్గటం పర్యాటక రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రావెల్‌ పరిశ్రమ వర్గాలంటున్నాయి. 

గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పలు చిన్న నగరాలు, పట్టణాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి రావటంతో పర్యాటక రంగానికి ఊతమిచ్చిందని, ఇది ఆ రంగానికి ఎంతో కలిసివచ్చిందని తెలిపాయి.

మరోవైపు ఉడాన్‌ పథకం కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు రూ.2,500కే విమాన సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేవటంతో మధ్య తరగతి ప్రజలు సైతం విమాన ప్రయాణంపై మొగ్గు చూపుతున్నారు.