Asianet News TeluguAsianet News Telugu

ముదిరిన ‘జెట్‌’ సంక్షోభం: ఆడిట్ కమిటీ చైర్మన్ రాజీనామా

చౌక విమాన ప్రయాణ సంస్థ జెట్ ఎయిర్ వేస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తక్షణం సంక్షోభం నుంచి బయటపడేందుకు 500 మిలియన్ల డాలర్ల నిధులు అవసరమని తెలుస్తోంది. కాగా, అంతర్గత సమస్యల కారణంగా జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలను వాయిదా వేయడంతో స్టాక్ మార్కెట్‌లో దాని షేర్ 14 శాతానికి పైగా పతనమైంది. 

Jet Airways Crisis: $500 Million In Cash Needed Immediately
Author
New Delhi, First Published Aug 11, 2018, 10:29 AM IST

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కంపెనీ ఆడిట్‌ కమిటీ అభ్యంతరాలు ప్రకటించడంతో జూన్ త్రైమాసిక ఫలితాల ప్రకటనను కంపెనీ వాయిదా వేసింది. సంస్థ ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ రాజీనామా చేశారని వార్తలు కూడా వచ్చాయి. ఫలితంగా శుక్రవారం ఈ షేరు 14 శాతం పతనమై 52 వారాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. 2011 నుంచి జెట్ ఎయిర్ వేస్ షేర్ భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. దీంతో రంగంలోకి దిగిన సెబి ఫలితాల ప్రకటన వాయిదాపై వివరణ ఇవ్వాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది.

స్టాక్‌ ఎక్స్ఛేంజీలు కూడా ఇందుకు సంపూర్ణ సమాచారం అందజేయాలని సూచించాయి. కంపెనీలో జరుగుతున్న వ్యవహారాలను స్టాక్‌ ఎక్స్ఛేంజిలకు తెలియజేయడంలో గాని, కార్పొరేట్‌ పాలనా విధానాల్లో గాని ఎలాంటి లోపాలైనా చోటు చేసుకున్నాయా అన్న విషయంలో కూడా సెబీ ఆందోళన చెందుతోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవహారంలో నిరంతరం స్టాక్‌ ఎక్స్ఛేంజీలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు సెబీ వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే సంస్థ ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారాయని తెలుస్తోంది. ప్రత్యేకించి వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో డిఫాల్టర్ రిస్క్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని అనుమానిస్తున్నారు. తక్షణం 500 మిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరమని తెలుస్తోంది.  

ఇదిలా ఉండగా మొదటి త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ప్రకటించడంలో జాప్యంపై కంపెనీ అందించిన సమాచారం అసమగ్రంగా ఉందని బీఎస్ఈ భావిస్తోంది. లిస్టింగ్‌ అంగీకారం 30వ నిబంధన కింద అందుబాటులో ఉన్న సమాచారం సంపూర్ణంగా తమకు అందజేయాలని జెట్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఆర్థిక ఫలితాలు పరిశీలించేందుకు బోర్డు సమావేశం వాయిదా పడిందని తెలియజేశారు తప్పితే తదుపరి సమావేశం తేదీలు ప్రకటించలేదన్న విషయం కూడా ఆ నోట్‌లో ప్రస్తావించింది. ఆడిట్‌ కమిటీ ఆర్థిక ఫలితాల విడుదలకు సిఫారసు చేయకపోవడానికి కారణం ఏమిటని కూడా ప్రశ్నించింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యం గురువారం రాత్రి బీఎస్ఈ ఒక ప్రకటన పంపింది. కొన్ని అంశాల్లో స్పష్టీకరణలు కోరుతూ ఆడిట్‌ కమిటీ ఫలితాలను ఆమోదించకపోవడం వల్ల జూన్‌ త్రైమాసికానికి అన్‌ఆడిటెడ్‌ ఆర్థిక ఫలితాలను సమీక్షించరాదని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్టు తెలియజేసింది. ట్రేడింగ్‌ విండో మూసివేతను కూడా కొనసాగించి ఫలితాల ప్రకటన అనంతరం 48 గంటల తర్వాత తిరిగి తెరవనున్నట్టు తెలిపింది.
 
జెట్ ఎయిర్ వేస్ బోర్డు సమావేశం చర్చనీయాంశాల జాబితాలో ఆర్థిక ఫలితాల సమీక్ష కాక ఇతర అంశాలేవైనా ఉన్నాయా, లేనట్టయితే అవే ఫలితాలు ఎందుకు అందజేయడం లేదు? ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ రాజీనామా చేశారని మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం ఎంత వరకు ఉంది? షేరు కదలికలను ప్రభావితం చేయగల అంశం ఏదైనా ఎక్స్ఛేంజీలకు తెలియజేయకుండా తొక్కి పెట్టారా? వంటి అంశాలపై ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి.
 
కేంద్రం కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిణామాలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. కాని విమానయాన సంస్థపై ఫైనాన్షియల్‌ ఆడిట్‌ నిర్వహించే ఆలోచన మాత్రం తమకు లేదని, సమస్యలను విన్నవించేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యం తమను సంప్రదించలేదని, అలా చేయాల్సిన అవసరం వారికి లేదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే చెప్పారు. 
 
భారీగా పెరిగిపోయిన ఇంధనం ధరలు, మార్కెట్‌ పోటీని తట్టుకునేందుకు తక్కువ ధరలకే విమానయాన సౌకర్యం అందుబాటులో ఉంచడం దేశంలోని విమానయాన సంస్థలను కుంగదీస్తోంది. వ్యయం, ఖర్చుమధ్య పొంతన లేని కారణంగా మొత్తం విమానయాన రంగమే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నద ని, ప్రస్తుత ఆర్థిక స్థితి కారణంగా వేతనాల్లో కోతకు అంగీకరించాలని ఈ నెల ప్రారంభంలో తమ సిబ్బందిని కోరింది. వేతనాల్లో 25 శాతం కోతకు అంగీకరించకపోతే త్వరలోనే విమాన సర్వీసులన్నీ నిలిపి వేయాల్సి వస్తుందని కూడా తెలియజేసినట్టు వార్తలు వచ్చాయి.

వేతనాల కోతకు ససేమిరా అన్న పైలట్లు మాత్రం తమ వద్ద ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరులు 60 రోజుల నిర్వహణకు సరిపోతాయని జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం చెప్పిందని తెలిపారు. అలాగే ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు కంపెనీలో వాటాలను విక్రయించే ఆలోచన కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సర్వీసుల నిలిపివేత, వాటాల విక్రయం వార్తలు రెండింటినీ జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యం ఖండించింది.

Follow Us:
Download App:
  • android
  • ios