ముంబై: ఆర్థిక సమస్యలతో మూలన బడ్డ ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్వేస్‌ను కొనుగోలు చేసేందుకు అబుదాబీ ఎయిర్ లైన్స్ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ విధించిన షరతుల అమలు అసాధ్యం అని ఎస్బీఐ స్పష్టం చేసింది. అందువల్లే దివాలా స్మృతిని ఆశ్రయించాలని బ్యాంకర్లు నిర్ణయించినట్లు తెలిపింది.

ఎతిహాద్‌కు మినహాయింపులిచ్చే అధికారం లేదన్న రజనీశ్
తమకు ఓపెన్‌ ఆఫర్‌ నుంచి మినహాయింపు కల్పించాలని, వివిధ విమానాశ్రయాల్లో జెట్‌ ఎయిర్వేస్ సంస్థకు ఇచ్చిన సమయాలు (స్లాట్స్‌) తమకు కచ్చితంగా ఇవ్వాలని ఎతిహాద్‌ కోరిందని, ఆ షరతులను అమలు పరిచే వీలు ఆర్థిక సంస్థలుగా తమకు లేదని ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ చెప్పారు. 

జెట్ ఆస్తుల విక్రయానికి అవకాశం: ఎస్బీఐ
అందువల్లే జెట్‌ను దివాలా స్మృతి కింద పరిష్కరించాలని ఆ సంస్థకు రుణాలిచ్చిన 26 మంది బ్యాంకర్ల కన్సార్టియం అభ్యర్థించినట్లు తెలిపారు. 
పరిష్కారం కనుగొనేందుకే జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని జెట్‌కు రుణాలిచ్చిన సంస్థలు ఆశ్రయించాయని, ఆస్తుల విక్రయానికీ అవకాశం ఉందని ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

ఏడాది నుంచి బలహీనంగా జెట్ ఎయిర్వేస్
నిర్వహణ నష్టాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నందున, ఏడాది నుంచి సానుకూల పరిష్కారం కోసం బ్యాంకర్లు ప్రయత్నిస్తూనే వచ్చారని, శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఎస్‌బీఐ తెలిపింది.

నూతన ఇన్వెస్టర్ల కోసం ఇలా ప్రయత్నాలు
జెట్ ఎయిర్వేస్ సంస్థను బ్యాంకుల కన్సార్టియం స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఎస్బీఐ క్యాప్స్, మైకెన్సీ వంటి పేరొందిన కన్సల్టెన్సీ సంస్థల సాయంతో నూతన ఇన్వెస్టర్ల కోసం ప్రయత్నాలు చేశామని ఎస్బీఐ వివరించింది. 

జెట్‌ దివాళా పరిష్కారానికి 90 రోజుల గడువు
జెట్‌ ఎయిర్‌వేస్‌కు వ్యతిరేకంగా దివాలా పరిష్కారం కోసం ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం నమోదు చేసుకుంది. గ్రాంట్‌ థార్న్‌టన్‌ ప్రతినిధి ఆశిష్‌ చౌచారియాను పరిష్కార నిపుణుడిగా నియమించింది. 

ఎస్బీఐకి రూ.967 కోట్ల బకాయిలు
ఇది జాతీయ ప్రాధాన్యం గల అంశమైనందున చట్ట ప్రకారం 6 నెలల గడువు ఉన్నా, మూడు నెలల వ్యవధిలోపు పరిష్కార ప్రక్రియ కనుగొనేందుకు ప్రయత్నించాలని పరిష్కార నిపుణుడిని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ కోరింది. పిటిషన్‌లో ఎస్‌బీఐ జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి రూ.967 కోట్లు తన వంతుగా వసూలు కావాల్సి ఉందని తెలిపింది.

నెదర్లాండ్స్ లాజిస్టిక్ విక్రేతల పిటిషన్ తిరస్కరణ
ఇందులో మూలధన అవసరాలకు రూ.505 కోట్లు, ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం కింద రూ.462 కోట్లను జెట్‌ ఎయిర్‌వేస్‌కు అందించినట్టు పేర్కొంది. ఈ దరఖాస్తులో జోక్యం చేసుకునేందుకు తమను అనుమతించాలని నెదర్లాండ్‌కు చెందిన లాజిస్టిక్స్‌ విక్రయదారులు దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్‌ తిరస్కరించింది.  

15 రోజులకోసారి పురోగతిపై నివేదిక ఇవ్వాలి
ప్రతీ 15 రోజులకోసారి పరిష్కార పురోగతిపై నివేదికను సమర్పించాలని, తొలి నివేదిక జూలై 5న దాఖలు చేయాలని పరిష్కార నిపుణుడిని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. అదే రోజు ఈ పిటిషన్‌పై బెంచ్‌ తదుపరి విచారణ చేయనుంది. 

వేతన బకాయిలే రూ.3000 కోట్లు
మొత్తం 26 బ్యాంకులకు జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ.8,500 కోట్ల మేర బకాయి పడింది. వందల మంది విక్రయదారులు, ఉద్యోగులకు రూ.13వేలకు కోట్లకు పైగా చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇందులో సిబ్బంది వేతనాలే రూ.3,000 కోట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 17 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవడం తెలిసిందే.