న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి తీవ్ర మాంద్యంలోకి నెట్టింది. అగ్రరాజ్యాలు సైతం ఈ వైరస్‌ ఉద్ధృతిని ఆపలేక చేతులెత్తేస్తున్నాయి. ప్రాణనష్టంతోపాటు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుండటంతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలకు మున్ముందు ఎన్నో భయంకరమైన సవాళ్లు తప్పకపోవచ్చు. వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితితో కుంగిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా పిడుగు పడింది. ఆరోగ్య వ్యవస్థ అంతంతమాత్రంగా ఉన్న దేశాల మనుగడనే ఈ మహమ్మారి ప్రశ్నార్థకం చేస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయాన్ని తట్టుకుని నిలబడేందుకు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ఉద్దీపనల్ని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రకటించిన ఈ ఉద్దీపనల విలువ దాదాపు 14 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.1,071 లక్షల కోట్లు) అని ఐఎంఎఫ్‌ కమిటీ చైర్మన్‌ లెసెట్జా గాన్యాగో తెలిపారు. 

ఇందులో దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లు వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపనలని స్పష్టం చేశారు. మిగతా 6 లక్షల కోట్ల డాలర్లకుపైగా ఉద్దీపనలు ఆయా దేశాల రిజర్వ్‌ బ్యాంకులు ప్రకటించినవని విలేకరుల సమావేశంలో చెప్పారు. కాగా, తమ సభ్య దేశాల్లోని పేద దేశాలకు ఆర్థిక సాయం చేస్తున్నామని, 50 దేశాలకు ఈ నెలాఖర్లోగా సాయం అందుతుందని గాన్యాగో చెప్పారు.

also read:వాల్‌మార్ట్‌ గుడ్ న్యూస్: త్వరలో 50 వేల ఉద్యోగాల నియామకం

కరోనా వైరస్‌ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ చిట్కా ఇచ్చారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా సామూహికంగా జరగాలన్నారు. ప్రత్యేకంగా అన్ని పరిశ్రమల్లో నిత్యం జరగాలని అప్పుడే ప్రజలు, ఆర్థికవ్యవస్థ క్షేమంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. వైరస్‌ నిర్ధారణ కోసం ఇప్పుడున్న సామర్థ్యం చాలదని, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఎంతో ఉన్నదని ఉద్ఘాటించారు. 

తమ ఉద్యోగుల రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జెఫ్ బెజోస్ తెలియజేశారు. అందరికీ కరోనా పరీక్షలు చేస్తామని, ఈ వ్యాధి లక్షణాలు లేనివారికీ టెస్టులు తప్పవని వాటాదారులకు రాసిన వార్షిక లేఖలో బెజెస్‌ పేర్కొన్నారు. మరోవైపు న్యూయార్క్‌లో 16 మిలియన్‌ డాలర్లతో కొత్త అపార్టుమెంట్‌ను బెజోస్‌ కొన్నారు.