సోమవారం పదవీ విరమణ చేయనున్న చైనా రిటైల్ దిగ్గజ సంస్థ ‘అలీబాబా’ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ జాక్‌ మా సంస్థ భవిష్యత్ నాయకత్వం గురించి ప్రకటించనున్నారని భావిస్తున్నారు. సోమవారంతో 54 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ‘జాక్ మా’ మిగతా సమయం విద్యాభివ్రుద్ధికి కేటాయించనున్నారు. సాధారణంగా చైనాలో వ్యాపార దిగ్గజాలు 80 ఏళ్లు వచ్చే వరకు కూడా పదవీ విమరణ చేయరు. కాని జాక్‌మా తన సమయాన్ని ఇక దాతృత్వ కార్యక్రమాలకు, విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తారని తెలుస్తోంది. 

అయితే అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని కథనం. యువతరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ, మార్గదర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. గమ్మత్తేమిటంటే చైనాలో కమ్యూనిస్ట్‌ పార్టీ వ్యతిరేస్తున్న న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన 54వ పుట్టిన రోజు సందర్భంగా బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు జాక్‌మా పేర్కొన్నారు. ‘ఇది కొత్త ప్రారంభమే కానీ.. ముగింపు కాద’ని అన్నారు. 2013లో సీఈఓ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పుకున్నారు.

కానీ కంపెనీ నుంచి ఇప్పటి దాకా అధికారిక ప్రకటన కూడా లేదు. కానీ ‘ఆలీబాబా’ సంస్థ ‘జాక్ మా’ రిటైర్మెంట్‌పై స్పందించేందు నిరాకరించింది. బ్లూమ్‌బర్గ్‌ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో శుక్రవారమే దీని గురించి జాక్‌మా సంకేతాలు ఇవ్వడం గమనార్హం. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అడుగుల్లో నడవాలని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అలీబాబా గ్రూపునకు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా జాక్‌మా కొనసాగుతారని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది.

ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేసిన జాక్‌మా 1999లో అలీబాబా సంస్థను స్థాపించారు. కంపెనీ విలువతో పాటే ఆయన సంపద కూడా భారీగా పెరగడంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వారిలో ఒకరిగా అవతరించారు. దీంతో అంతర్జాతీయంగా రాజకీయంగా, వాణిజ్య వర్గాల్లో అంతర్జాతీయ ప్రముఖుడిగా జాక్ మా మారిపోయారు. అంతేకాదు 36.6 బిలియన్ల డాలర్లతో చైనాలోనే మూడో సంపన్నుడి అవతారం ఎత్తారు.

జాక్ మా వైదొలుగడంతో సంస్థ పనితీరులో, ప్రగతిలో మార్పులు సంభవిస్తాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఎమర్జింగ్ మార్కెట్స్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ వ్యవస్థాపకుడు కెవిన్ కార్టర్ స్పందిస్తూ నాలుగైదేళ్ల క్రితం సీఈఓగా వైదొలిగినప్పుడు ‘జాక్ మా’ యువ తరానికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకున్నప్పుడు జాక్ మా ఒక స్మార్ట్, ఓపెన్ మైండెడ్ బిజినెస్ మెన్ అని అభివర్ణించారు. 18 మందితో చైనాలో మొదలైన చైనా ఈ - కామర్స్ సంస్థ ‘ఆలీబాబా’ ప్రస్తుతం 66 వేల మందికి పైగా ఉద్యోగులకు జీవితం అందిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ 420 బిలియన్ల డాలర్లుగా ఉంటుంది. జాక్ మా ఆధ్వర్యంలోని ఆంట్ ఫైనాన్సియల్ అదనంగా 150 బిలియన్ డాలర్ల నిధులు సేకరించారు. 

ఆలీబాబా సంస్థ అధినేతగా జాక్ మా వైదొలగడం ఇతర సంస్థలకు పరిస్థితి గమ్మత్తుగా ఉంది. ఆలీబాబా ప్రత్యర్థి సంస్థ టెన్సెంట్ హోల్డింగ్స్‌కు మంచి రోజులు వస్తాయని అంటున్నారు. విదేశాల్లో శరవేగంగా విస్తరించిన ‘ఆలీబాబా’ వల్ల చైనా టెక్ సంస్థలు ఆందోళనకు గురవుతున్నాయి.