వాషింగ్టన్‌: ప్రపంచ బ్యాంకు చైర్మన్ జిమ్ యంగ్ కిమ్ వారసత్వం అందుకునే రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గారాల పట్టి.. ఆయన కూతురు.. సలహాదారు ఇవాంక ట్రంప్‌ పోటీ పడుతున్నారు. 
ప్రపంచ బ్యాంక్‌ప్రస్తుత అధిపతి జిమ్‌ యంగ్‌ కిమ్‌ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదవి నుంచి వైదొలగనున్నారు. ఆయన మరొక ప్రైవేట్ సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.

దీంతో ప్రపంచ బ్యాంక్‌ అధిపతికోసం అన్వేషణ మొదలైంది. ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంక్‌లో అత్యధిక వాటా ఉన్న అమెరికా మద్దతు గల వారికే అధ్యక్ష పదవి దక్కింది. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ డిపార్టుమెంట్‌కు పలు నామినేషన్లు అందుతున్నాయి. వీటిల్లో డేవిడ్‌ మల్ఫాస్‌తోపాటు‌ ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ వంటి హేమాహేమీల పేర్లు ఈ నామినేషన్లలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ పేరు కూడా వీటిలో ఉంది. 

విదేశాల నుంచి కూడా ఈ పదవికి పోటీ ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాయేతరులకు ఈ పదవి అప్పగించేందుకు అగ్రరాజ్యం ఆసక్తి చూపకపోవచ్చు.37ఏళ్ల ఇవాంక ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడికి సీనియర్‌ అడ్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జూలైలో ఆమె తన ఫ్యాషన్‌ బ్రాండ్‌ను మూసివేసి వైట్ హౌస్ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి సారించారు. ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యాక ఆమె బ్రాండ్ల విక్రయాలు పడిపోయాయి.

ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగే ప్రపంచబ్యాంక్ చైర్మన్ పదవి కోసం ముగ్గురి కంటే ఎక్కువగా పోటీ పడితే బోర్డు సభ్యుల మధ్య ఓటింగ్ ప్రకారం ఎన్నుకుంటారు. 2011లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించిన వ్యక్తి కిమ్.. 2016లో మళ్లీ నియమితులైనా మూడున్నరేళ్ల పదవీ కాలానికి ముందే అకస్మాత్తుగా వైదొలిగారు. అందుకు తొలుత ఒబామా నియమించడమే కారణం.

కానీ ప్రపంచ బ్యాంక్ చైర్మన్ ఎన్నిక విషయంలో చైనా తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. బహిరంగంగా, మెరిట్ ప్రాతిపదికన, పారదర్శకంగా ప్రపంచ బ్యాంక్ చైర్మన్ ఎన్నిక జరుగాలని చైనా వాదిస్తోంది. దాని వల్లే 2011లో తొలిసారి ఈ ప్రతిపాదన అమలులోకి వచ్చింది. ప్రపంచబ్యాంకులో 180కి పైగా దేశాలకు సభ్యత్వం కలిగి ఉన్నది. అయితే సంపన్న దేశాల సాయంతో ప్రపంచ బ్యాంక్ కార్యకలాపాలు సాగిస్తోంది. 2030 నాటికి దారిద్ర్య నిర్మూలన దిశగా ప్రపంచ బ్యాంక్ పని చేస్తోంది.