Asianet News TeluguAsianet News Telugu

ఈ శతాబ్దం భారత్‌దే.. 2047 నాటికి భారత్ నెంబర్ వన్..ఆర్థిక మాంద్యం భారత్‌ను తాకదు..తేల్చి చెప్పిన మెకిన్సే..

ఈ శతాబ్దం భారత్ దే అని, మెకిన్సే & కో CEO బాబ్ స్టెర్న్‌ఫెల్స్ ఘంటా పథంగా చెప్పారు. ప్రపంచ అవసరాలకు తగిన మానవ వనరుల్లో 20 శాతం భారత్ నుంచే ఉంటాయని ఆయన అంచనా వేశారు. 

it is India century says McKinsey's Bob Sternfels
Author
First Published Sep 2, 2022, 9:40 AM IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద శక్తిగా భారత్ అవతరించబోతోందని ఆర్థిక వేత్తలు చాలా కాలంగా అంచనా వేస్తున్నారు. అంతేకాదు. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు వెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక పర్యవేక్షణ సంస్థ మెకిన్సీ సీఈవో భారత ఆర్థిక వృద్ధిపై చేసిన వ్యాఖ్యలు భారత్ ఆర్థిక ప్రగతిపై మరోసారి ఆశల వెలుగులు నింపాయి. 

2047 నాటికి భారతదేశం ప్రపంచ భవిష్యత్ ప్రతిభా కర్మాగారం అవుతుందని మెకిన్సే & కో CEO బాబ్ స్టెర్న్‌ఫెల్స్ అన్నారు. ఇది భారతదేశపు దశాబ్దం మాత్రమే కాదు, భారతదేశం యొక్క శతాబ్దం అని సంస్థ  అధినేత తెలిపారు. , అన్ని కీలక అంశాలతో పాటుగా ప్రపంచంలోని శ్రామిక జనాభాలో 20 శాతం మంది భారత్ లోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు అతి పెద్ద శ్రామిక జనాభాతో పాటు, కార్పోరేట్ కంపెనీల పనితీరు,  ప్రపంచ సప్లై చెయిన్స్ పుంజుకోవడం, దేశం డిజిటల్ స్కేల్‌లో దూసుకుపోతుందని,  ఇది దేశం ఆర్థిక వ్యవస్థకే కాకుండా ప్రపంచానికి కూడా ఉపయోగపడనుందని మెకిన్సే అంచనా వేశారు. 

భారత్ లోని డిజిటల్ పేమెంట్స్ సాధించిన విజయం దేశానికి సరికొత్త దిశను చూపుతోందని బాబ్ స్టెర్న్‌ఫెల్స్ అంచనా వేశారు. భారతదేశం డిజిటల్ చెల్లింపులను తన సొంత దేశానికి మాత్రమే పరిమితం చేయలేదు,  ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు దానిని అనుసంధానించడంలో ప్రముఖ పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారేందుకు ఇది సహాయపడుతుందని కూడా బాబ్ భావించారు 

మెకిన్సీ సంస్థ అనేక దశాబ్దాలుగా భారత్ లో తన శాఖలను తెరుస్తోంది. మెకిన్సే సీఈఓ బాబ్ స్టెర్న్‌ఫెల్స్ ఈ ఏడాది డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించనున్నారు. మెకిన్సీకి ప్రస్తుతం భారతదేశంలో 5000 మంది ఉద్యోగులు ఉన్నారు. బాబ్ ఈ సంఖ్యను 10 వేలకు పెంచాలని అనుకుంటున్నారు. ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మెకిన్సీ సీఈఓ బాబ్ స్టెర్న్‌ఫెల్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ ఇంటర్వ్యూలో, కరోనా సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉందని బాబ్ స్టెర్న్‌ఫెల్స్ పేర్కొన్నారు, భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వృద్ధి ఎక్కడ ఉంటుందని  అనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు బాబ్ స్పందిస్తూ.. భారతదేశ ఆర్థిక వృద్ధికి అతిపెద్ద అసెట్ దాని తెలివైన, నైపుణ్యం కలిగిన మానవ వనరులే అని గుర్తు చేశారు.  భారతదేశం భవిష్యత్తులో ప్రతిభావంతులైన మానవ వనరులకు నిలయంగా మారబోతోందని, ప్రపంచం ముందు తన ప్రతిష్టను పెంచుకుంటుందని అంచనా వేశారు.

2047 నాటికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొత్తం సంపద ఉత్పత్తిలో 20 శాతం అభివృద్ధి చెందిన మానవ వనరుల చేతుల్లోకి వెళ్తుందని, అది భారత్ కు ఒక వనరుగా మారుస్తుందని ఆయన అంచనా వేశారు. డిజిటల్ ఇండియా కలను యూపీఐ తరహా లావాదేవీలు సులభతరం చేశాయని గుర్తు చేశారు. దీనితో పాటు ముడి పదార్థాల సరఫరా ఇప్పుడు భారత్ కు సులభంగా అందుబాటులో ఉందని బాబ్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. 

గత రెండేళ్లలో ఇతర అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కంటే భారతదేశం మెరుగైన స్థితిలో ఉన్నట్లు బాబ్ పేర్కొన్నారు. అమెరికా, జర్మనీ, రష్యా, బ్రిటన్ వంటి దేశాలు భారత్‌తో పోలిస్తే ఆర్థిక వృద్ధిలో భారీ క్షీణతను చవిచూశాయి. వాటితో పోలిస్తే భారత్, చైనా ఆర్థిక వృద్ధి రేటు మెరుగ్గా ఉంది. ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాల నివేదిక కూడా తాజాగా వెలువడింది. ఆర్థిక లోటు గణనీయంగా తగ్గిందని కూడా ఇది తెలియజేస్తోంది.

జీఎస్టీ వసూళ్లలో రికార్డు వృద్ధి కనిపిస్తోంది. నిరుద్యోగిత రేటు కూడా భారీగా తగ్గింది. ఈ సమయంలో, ప్రతి దేశం ప్రపంచ మాంద్యం గురించి ఆందోళన చెందుతోంది. కానీ, భారత ఆర్థికవేత్తలు, ప్రపంచ ఆర్థికవేత్తలు భారతదేశం విషయంలో ఈ భయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపు వ్యవస్థ, GST సృష్టి, MSMEలకు అదనపు ప్రయోజనాలు అందించడంతోపాటు మార్కెట్‌లో నగదు ప్రవాహాన్ని ముందుగానే కొనసాగించేందుకు అనేక చర్యలు తీసుకున్నందున ప్రపంచ మాంద్యం ఈ దేశాన్ని తాకదని. ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై బాబ్ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios