వచ్చే ఆరు నెలల్లో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న స్థానాల్లో నియామకాలూ పెరగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా), బీపీఓ విభాగాల్లో ఈ నియామకాల ధోరణి ఎక్కువగా కనిపించవచ్చని ‘నౌకరీ హైరింగ్‌ ఔట్‌లుక్‌ 2019’ పేర్కొంది. దేశ వ్యాప్తంగా 3310 కంపెనీలను సర్వే చేసి ఈ ద్వై వార్షిక నివేదికను రూపొందించారు.

‘గతేడాది కనిపించిన నియామకాల ధోరణి కొత్త ఏడాదిలోనూ కొనసాగనుంది. తొలి అర్థభాగంలో ఇది కనిపించనుంది’అని ఇన్ఫోఎడ్జ్‌ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సుమిత్‌ సింగ్‌ పేర్కొన్నారు. విక్రయాలు-మార్కెటింగ్‌, ఐటీ-సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో అధిక నియామకాలు జరగనున్నాయని సర్వేలో పాల్గొన్న సగం కంపెనీలు వివరించాయని నౌకరీ హైరింగ్ ఔట్ లుక్ పేర్కొంది. 

ఇక సంస్థ కార్యకలాపాలు, మానవ వనరులు, అకౌంట్స్‌ విభాగాల్లో ఎక్కువ నియామకాలు చేపడుతున్నట్లు నాలుగో వంతు కంపెనీలు వివరించాయి. 3-5 ఏళ్ల అనుభవం ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు కలగనున్నాయి. ఆ తర్వాత 1-3 సంవత్సరాల పాటు పనిచేసిన వారిపైనా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.  

ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగుల వలసలు 5-15% మేర ఉంటాయని నౌకరీ హైరింగ్ ఔట్ లుక్ అంచనా వేసింది. ముఖ్యంగా 1-3 ఏళ్ల అనుభవం ఉన్న వారే అందులో ఉంటారని 50 శాతం యాజమాన్యాలు అంచనా వేశాయి. మరోవైపు విక్రయాలు-మార్కెటింగ్‌, ఐటీ సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో అధిక వలసలు ఉంటాయని అంచనా కట్టాయి.  

ఉద్యోగ సృష్టిపై ఆశావహ దృక్పథమే ఉన్నా.. సరైన నైపుణ్యం గల వారు లభించడం లేదని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో నైపుణ్య కొరత పెరుగుతుందని 42% సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. గత ఆరు నెలల తరహాలోనే ఈ కొరత కొనసాగుతుందని 31 శాతం అంచనా వేశాయి. 

3-5 ఏళ్ల విభాగంలో ఈ నైపుణ్యం ఉన్న వ్యక్తుల కొరత ఎక్కువగా కనిపిస్తోందని నౌకరీ హైరింగ్ ఔట్ లుక్ తెలిపింది. 20 శాతం మేర నియామకాలు పెరుగుతాయని 16% కంపెనీలు.. 15-20 శాతం మేరకు మాత్రమే వృద్ధి కనిపించవచ్చని 15% సంస్థలు పేర్కొన్నాయి. అయితే కీలక పరిశ్రమల్లో వ్రుద్ధిరేటు మందగమనం నమోదవుతుందని ఆందోళన చెందుతున్నాయి. కొత్తగా నియమితులైన వారికి 20 శాతం ఇంక్రిమెంట్లు ఉంటాయని అంచనా వేసినా.. అది 15 నుంచి 20 శాతం మధ్య ఉండొచ్చునని నౌకరీ హైరింగ్ ఔట్ లుక్ పేర్కొన్నది.