ఇండియాలో Telegram బ్యాన్!.. ఎందుకంటే?
సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఒకటైన టెలిగ్రామ్(Telegram) గురించి తెలియని వారుండరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అందరికీ అందులో అకౌంట్ ఉంటుంది. ఇంత ప్రజాదరణ పొందిన టెలిగ్రామ్ యాప్ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు దర్యాప్తు ప్రారంభించారు. భారతదేశంలో టెలిగ్రామ్ ను బ్యాన్ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. రండి.
ప్రభుత్వ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(MHA), ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ(MeitY)లు సంయుక్తంగా టెలిగ్రామ్ కార్యకలాపాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నాయి. Telegram ద్వారా దోపిడీ, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో అధికారులు ప్రత్యేకంగా పరిశీలన ప్రారంభించారు.
మెసేజింగ్ అప్లికేషన్ Telegram ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. "దోపిడీ మరియు జూదం వంటి నేరపూరిత కార్యకలాపాల్లో దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలపై ప్రభుత్వం Telegramను దర్యాప్తు చేస్తోంది" అని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. దర్యాప్తు ఫలితాలను బట్టి ఈ మెసేజింగ్ యాప్‌ను నిషేధించే అవకాశం కూడా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ఆరోపణలపై భారత అధికారులు దృష్టి పెట్టారని Money control నివేదిక కూడా పేర్కొంది. వారు వెల్లడించే ఫలితాల ఆధారంగా నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది.
టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్..
Telegram CEO పావెల్ దురోవ్ ఫ్రాన్స్‌లో అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టయిన ఒక్కరోజు తర్వాత ఇది ఇండియాలో దర్యాప్తు ప్రారంభించడం గమనార్హం. నివేదికల్లో వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌కు చెందిన OFMIN అనే సంస్థ మైనర్లపై హింసను అరికట్టడానికి పోరాడుతోంది. ఈ క్రమంలో మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపు, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద ప్రచారం వంటి నేరాలను టెలిగ్రామ్ యాప్ ప్రోత్సహిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది. ఈ విషయానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఫ్రాన్స్ ప్రభుత్వం Telegram CEOపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయా..
టెలీగ్రామ్ సీఈవో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇండియాలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA), ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) కలిసి టెలీగ్రామ్ యాప్ నిర్వహణపై దర్యాప్తు ప్రారంభించాయి. Telegram ద్వారా జూదం, దోపిడీ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయా లేదా అని అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు.
నీట్ పరీక్ష పత్రం లీక్ కు టెలిగ్రామ్ కు లింక్..
ఇటీవల UGC-NEET ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీకైన విషయం మనందరికీ తెలుసు. టెలిగ్రామ్ సైట్ లోనే ఈ పరీక్ష పత్రం విస్తృతంగా షేర్ అయ్యిందని సమాచారం. ఈ సైట్‌లో రూ. 5,000 నుండి రూ.10,000 వరకు ఈ పత్రం అమ్మకానికి పెట్టారని తెలుస్తోంది.
టెలిగ్రామ్ ఏం చెబుతోంది..
కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ భారతీయ చట్టాలను పాటిస్తున్నామని Telegram నిర్వాహకులు చెబుతున్నారు. టెలిగ్రామ్ తో పాటు మరికొన్ని సోషల్ మీడియా కంపెనీలకు అక్టోబర్ 2023లోనే IT మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. వాటి సేవల నుండి చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్(CSAM)ని తొలగించాలని ఆదేశించాయి. ఏది ఏమైనా టెలిగ్రామ్ యాప్ త్వరలో భారత్ లో బ్యాన్ అవ్వబోతోందంటూ ప్రచారం బాగా జరుగుతోంది. అత్యంత ప్రజాదరణ కలిగిన టెలిగ్రామ్ యాప్ పై కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందో వేచి చూడాలి మరి..