అత్యాధునికంగా తక్కువ రేట్లతో హోటళ్లను నిర్మించడానికి భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జపాన్‌ తరహా చిన్నచిన్న గదులతో సౌకర్యవంతంగా ఉండేలా హోటళ్లను డిజైన్‌ చేస్తామని తెలిపింది. 

ప్రస్తుతానికి పైలెట్‌ ప్రాజెక్టుగా మరికొన్ని రోజుల్లో ముంబైలోని సెంట్రల్‌ స్టేషన్‌లో ప్రారంభిస్తామని ఐఆర్సీటీసీ పేర్కొంది. జపాన్‌లో ఎక్కువగా కన్పించే ఈ తరహా హోటళ్లను పాడ్‌ హోటల్స్‌ అంటారు. ఈ హోటళ్లలో చిన్న చిన్న గదులు ఉండి ఒక వ్యక్తికి మాత్రమే నిద్రించడానికి వీలుగా ఉంటాయి.

మొత్తం మూడు కేటగిరీలుగా హోటల్‌ గదులను నిర్మిస్తామని ఐఆర్సీటీసీ చెప్పింది. ప్రతి గదిలోనూ వైఫై, టీవీ, పర్సనల్‌ లాకర్‌ ఉంటాయి. క్లాసిక్‌, ప్రైవేట్, సూట్‌ అనే పేర్లతో మూడు రకాలుగా గదులను విభజించి ఒక్కో గదికి ఒక్కో రేటు విధిస్తామని తెలిపింది.

జపాన్ స్టయిల్‌లో నిర్మించే హోటళ్లలో క్లాసిక్‌ రూమ్‌, ప్రైవేట్ రూమ్‌ ఒక వ్యక్తికి మాత్రమే సరిపోతాయి. దీనిలో టీవీ, వైఫై, చార్జింగ్‌ సౌకర్యం మాత్రమే ఉంటాయి. సూట్‌ పాడ్‌లో మాత్రం ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు, అలాగే వాష్‌రూమ్‌ ఫెసిలిటీ కూడా ఉంటుంది.

ఈ హోటల్‌ నిర్మాణం పూర్తయితే ముంబైకి వచ్చే ప్రయాణికులకు బస చేయడానికి అనువుగా ఉంటుందని ఐఆర్సీటీసీ భావిస్తోంది. ‘ఎక్కువ మందికి తక్కువ స్థలంలో సౌఖర్యవంతమైన వసతి కల్పించడమే లక్ష్యమని’ ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ జనరల్‌ మేనేజర్‌ తెలిపారు.