జీ గ్రూప్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే కళ్ల ముందు కనిపిస్తున్న ఐఎల్‌‌&ఎఫ్‌ఎస్‌ తీవ్రత.. భవిష్యత్‌లో జీ గ్రూప్‌ అదే బాటలో సాగితే తమ పరిస్థితి ఏమిటని తలలు పట్టుకుంటున్నారు. ‘మంచి ఉద్దేశాలతో పని చేసినా అనుకున్న అంచనాలు అందుకోలేకపోయా.

ఇందుకు మాకు నిధులు సమకూర్చిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు క్షమాపణ చెబుతున్నా’అని సుభాష్‌ చంద్ర లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆయన లేఖతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో గ్రూప్‌ కంపెనీలైన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, డిష్‌ టీవీ షేర్లు కుప్పకూలాయి.

దీంతో కంపెనీ నెట్‌వర్త్‌ మూడొంతులు హరించుకుపోయింది. నెట్‌వర్త్‌ భారీగా పడిపోవటంతో ఇన్వెస్టర్లతో పాటు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు (ఎంఎఫ్‌), విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) గుండె గుభేలుమంది. 

దీంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్, డిష్ టీవీల్లో రెండు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎంఎఫ్‌ సంస్థలు, ఎఫ్‌పీఐల ప్రతినిధులు జీ గ్రూప్‌ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయినట్లు తెలిసింది. జీ గ్రూప్‌ కంపెనీలకు దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ భారీగా రుణాలు ఇచ్చాయి. రుణాలతో పాటు ఈక్విటీ వాటాలు కూడా తీసుకున్నాయి. 

శుక్రవారం నాడు జీ గ్రూప్‌ కంపెనీల విలువ దాదాపు మూడొంతులు కోల్పోవటంతో తమ పెట్టుబడుల పరిస్థితి ఏమిటని ఎంఎఫ్‌ సంస్థలు.. ఈ భేటీలో నిలదీసినట్లు సమాచారం. నిఫ్టీ ఇండెక్స్‌లో ఉన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల ఈక్విటీ వాటా రూ.1,850 కోట్ల వరకు ఉంది. ఎఫ్‌పీఐల వాటా రూ.12,700 కోట్ల వరకు ఉన్నట్లు షేర్‌హోల్డింగ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ఇక  జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఇచ్చిన రుణాలు దాదాపు రూ.7,300 కోట్ల వరకు ఉన్నాయి. కాగా జీ గ్రూప్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా రూ.50,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.
 
ఎన్‌ఎస్ఈ ఇండెక్స్ ‘నిఫ్టీ’లో జీ గ్రూప్‌ సంస్థ ఉండటంతో దాదాపు అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని ఫండ్‌ మేనేజర్‌ ఒకరు తెలిపారు. ప్రస్తుతం తామిచ్చిన రుణాలు, పెట్టుబడుల పట్ల ఎంతో ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం గ్రూప్‌ పరిస్థితిపై కంపెనీ ప్రతినిధులతో చర్చించినట్లు చెప్పారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల్లో ఆదిత్యబిర్లా ఎంఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌, ఫ్రాం క్లిన్‌ టెంపుల్టన్‌ ఎంఎఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌ ఉన్నాయి. ఇందులో ఆదిత్య బిర్లా ఎంఎఫ్‌ వాటా రూ.1,500 కోట్లని తెలిసింది.

షేర్ల తాకట్టు ద్వారా మ్యూచువల్ ఫండ్ సంస్థలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఒకవేళ గ్రూప్‌ రుణాలను చెల్లించలేని పరిస్థితిలో ఉంటే వీటిని విక్రయుంచుకోవటం ద్వారా బయటపడే అవకాశాలున్నాయని ఫండ్‌ మేనేజర్‌ తెలిపారు. రానున్న ట్రేడింగ్‌ రోజుల్లో షేరు మళ్లీ కుప్పకూలితే మాత్రం చేతులు కాల్చుకోవటం ఖాయమని అన్నారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ దాదాపు రూ.7,850 కోట్ల విలువైన షేర్లను తాకట్టు పెట్టినట్లు బీఎస్ఈ డేటా వెల్లడిస్తోంది. ఇది ప్రమోటర్‌ వాటాలో 60 శాతానికి సమానం. శుక్రవారం కంపెనీ షేరు 32 శాతం మేర పడిపోవటంతో మరిన్ని షేర్లను తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.

జీ గ్రూప్‌నకు చెందిన ఇతర సంస్థలైన డిష్‌ టీవీ, జీ మీడియా, జీ లెర్న్‌ షేర్లు కూడా 10 శాతం నుంచి 33 శాతం వరకు పడిపోయాయి. ఇక ఈక్విటీపరంగా చూస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌, ఆదిత్య బిర్లా ఎంఎఫ్‌, మిరే ఎంఎఫ్‌, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్)ను తీసుకువచ్చాయి.