ఇన్వెస్టర్లకు పీడకల: రూ.37.60 లక్షల కోట్లు హాంఫట్.. సూచీలన్నీ డమాల్

దేశీయ స్టాక్‌ మార్కెట్లకు 2019-20 ఆర్థిక సంవత్సరం మరిచిపోలేని ఓ పీడకలలా నిలిచిపోయింది. మంగళవారంతో ముగిసిన ఏడాదిలో మదుపర్లు ఏకంగా రూ.37.60 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఈ మొత్తంలో అత్యధిక శాతం నష్టాలు వాటిల్లింది ఒక్క మార్చిలోనే కావడం గమనార్హం. 

Investor wealth plunges Rs 37.59 lakh crore in 2019-20 fiscal

దేశీయ స్టాక్‌ మార్కెట్లకు 2019-20 ఆర్థిక సంవత్సరం మరిచిపోలేని ఓ పీడకలలా నిలిచిపోయింది. మంగళవారంతో ముగిసిన ఏడాదిలో మదుపర్లు ఏకంగా రూ.37.60 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఈ మొత్తంలో అత్యధిక శాతం నష్టాలు వాటిల్లింది ఒక్క మార్చిలోనే కావడం గమనార్హం. 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రభావం భారత్‌పై చూపడం.. మదుపరులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే మదుపర్లు భారీ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. ఫలితంగా స్టాక్‌ మార్కెట్లు మునుపెన్నడూలేని నష్టాలను చవిచూశాయి. 

బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 2019-20లో 9,204.42 పాయింట్లను లేదా 23.80 శాతం కోల్పోయింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ఇండెక్స్ నిఫ్టీ సైతం 3,026.15 పాయింట్లు/ 26.03 శాతం పడిపోయింది. కరోనా మహమ్మారి దెబ్బకు ఒక్క మార్చిలోనే సెన్సెక్స్‌ 8,828.8 పాయింట్లు లేదా 23 శాతం పతనం కావడం గమనార్హం.

దీంతో బీఎస్‌ఈ నమోదిత సంస్థల షేర్ల విలువ రూ.37,59,954.42 కోట్లు హరించుకుపోయి రూ. 1,13, 48, 756.59 కోట్లకు పరిమితమైంది. విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం.. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోవడం.. ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులు తలెత్తడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను భీకరంగా దెబ్బతీసింది. 
అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లన్నీ కుప్పకూలిపోగా.. భారతీయ స్టాక్‌ మార్కెట్లలోనూ నష్టపుటేరులు పారాయి. ఈ ఏడాది జనవరి 20వ తేదీన 42,273.87 పాయింట్లతో ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌.. మార్చి 24వ తేదీన 25,638.90 పాయింట్లకు క్షీణించింది. 

అంటే కేవలం రెండు నెలల్లో సెన్సెక్స్ 16,635 పాయింట్లు నష్ట పోయింది. నిఫ్టీ సైతం గతంలో ఎన్నడూలేని విధంగా 12 వేల పాయింట్లకుపైగా పెరిగి మళ్లీ చతికిలపడింది. దీన్నిబట్టి కరోనా వైరస్‌ స్టాక్‌ మార్కెట్లను ఏ రకంగా కుదిపేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.

కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ దాదాపు రూ.8.84 లక్షల కోట్లు పెరిగింది. కానీ 2019-20లో రూ.37.60 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రస్తుతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.7,05,211.81 కోట్ల మార్కెట్‌ విలువతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నది. రూ.6,84,078.49 కోట్లతో టీసీఎస్‌ రెండో స్థానంలో ఉన్నది. 

నిరుడు నవంబర్‌లో రూ.10 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను చేరుకుని రిలయన్స్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆర్థిక సంవత్సరం చివరి రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 

also read:‘ఆటో’ ప్లాంట్లలో వెంటిలేటర్ల తయారీ! భారీ ప్రణాళికలతో ముందడుగు

ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరి రోజైన మంగళవారం సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్‌ 1,028.17 పాయింట్లు లేదా 3.62 శాతం పుంజుకుని 29,468.49 వద్ద ముగియగా, నిఫ్టీ 316.65 పాయింట్లు లేదా 3.82 శాతం ఎగిసి 8,597.75 వద్ద స్థిరపడింది. 

ఐటీసీ షేర్‌ విలువ అత్యధికంగా 7.84 శాతం ఎగబాకింది. రిలయన్స్‌, ఓఎన్జీసీ, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా, ఎస్బీఐ షేర్లూ లాభాలతోనే ముగిశాయి. అయితే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 14.68 శాతం, మారుతి 1.23 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.17 శాతం, టైటాన్‌ 1.13 శాతం చొప్పున నష్టపోయాయి. 

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 2.98 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. చైనా, హాంకాంగ్‌, దక్షిణ కొరియా సూచీలు 2 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. జపాన్‌ మాత్రం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లూ లాభాల్లోనే కదలాడుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios