Asianet News TeluguAsianet News Telugu

‘ఎస్సెల్’ సుభాష్ చంద్రకు ఊరట:‘జీ’లో మరో 11% పెట్టుబడులకు ఇన్వెస్కో సై

భారతదేశ టెలివిజన్ చానెళ్ల సమాహారం ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్’ అధినేత సుభాష్ చంద్రకు భారీ ఊరట లభించింది. అమెరికాకు చెందిన సంస్థ ఇన్వెస్కో మరో 11 శాతం వాటాల కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీని విలువ రూ. 4,224 కోట్లు ఉంటుందని అంచనా.

Invesco Oppenheimer to pay Rs 4,224 crore for 11 persant stake in ZEE group
Author
Mumbai, First Published Aug 1, 2019, 10:49 AM IST

ముంబై: నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీ గ్రూప్‌ను ఆదుకునేందుకు అమెరికాలోని ‘ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌ ఫండ్‌’ ముందుకు వచ్చింది.  జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీ)లో ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ రూ. 4,224 కోట్లు కానున్నది. 

ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌లో భాగమైన డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌ ఈ వాటాలను కొనుగోలు చేయనున్నది. 2002 నుంచి జీ లో పెట్టుబడిదారు సంస్థగా కొనసాగుతున్న ఇన్వెస్కో ఫండ్‌కు ప్రస్తుతం ఇందులో 7.74 శాతం వాటాలు ఉన్నాయి.

‘ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌ డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌ .. జీ లో మరింతగా ఇన్వెస్ట్‌ చేసేందుకు అంగీకరించింది. ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం దాకా వాటాలను రూ. 4,224 కోట్లకు కొనుగోలు చేయడానికి అంగీకరించింది‘ అని జీ ఒక ప్రకటనలో తెలిపింది.

తమ సంస్థపై ఇన్వెస్కో ఫండ్‌కు ఉన్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు తెలియజేస్తున్నాయని జీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో పునీత్‌ గోయెంకా పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రమోటర్ల వాటా 23 శాతానికి తగ్గుతుంది. 2019 జూన్‌ నాటికి జీ లో ప్రమోటర్ల వాటా 35.79 శాతంగా ఉంది. 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 63.98 శాతం వాటాలు మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల దగ్గర తనఖాలో ఉన్నాయి. బుధవారం షేర్ ముగింపు ధరను బట్టి జీ మార్కెట్‌ విలువ రూ. 34,717 కోట్లు కాగా.. ఇందులో ప్రమోటర్ల వాటాల విలువ సుమారు రూ. 13,000 కోట్లు ఉంటుందని అంచనా.  

సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ ఎస్సెల్‌ గ్రూప్‌ ప్రమోటర్ సుభాష్‌ చంద్ర ఈ ఏడాది జనవరిలో రాసిన బహిరంగ లేఖతో కంపెనీ వాస్తవ స్థితిగతులు అధికారికంగా బయటపడ్డాయి. ఇన్‌ఫ్రా రంగంలో భారీగా పెట్టిన పెట్టుబడులు, వీడియోకాన్‌కు చెందిన డీ2హెచ్‌ వ్యాపారం కొనుగోలు లావాదేవీలు ప్రతికూలంగా మారాయని చంద్ర పేర్కొన్నారు. 

బ్యాంకర్లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి పొందిన రుణాలన్నీ పూర్తిగా తీర్చేస్తామని ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్ర స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ దాకా ఎటువంటి చర్యలూ తీసుకోకుండా రుణదాతలతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 

వాస్తవానికి భారీగా పేరుకుపోతున్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా గ్రూప్‌ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు గతేడాది నవంబర్‌ నుంచీ ఎస్సెల్‌ గ్రూప్‌ ప్రమోటర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రుణాల రీపేమెంట్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించుకున్నారు. 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తమకున్న వాటాల్లో దాదాపు 50 శాతం వాటాలు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించేందుకు ప్రమోటర్లు గతేడాది నవంబర్‌ నుంచి ప్రయత్నిస్తున్నారు. జీ లోనూ, ఇతరత్రా మీడియాయేతర ఆస్తుల్లో వాటాల కొనుగోలుకు వివిధ భాగస్వాముల నుంచి సానుకూల స్పందన కూడా వస్తున్నట్లు ఎస్సెల్‌ గ్రూప్‌ చెబుతూ వస్తోంది. తాజాగా ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌తో ఒప్పందం కుదరడం సంస్థకు కొంత ఊరటనివ్వనుంది.

బుధవారం నాటి జీ షేర్ ముగింపు ధరతో పోలిస్తే ఇన్వెస్కో 10 శాతం ప్రీమియం చెల్లించనుంది. ఈ డీల్‌తో గ్రూప్‌ రుణ భారం రూ. 11,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు తగ్గనుందని జీ సీఈవో, ఎండీ పునీత్‌ గోయెంకా తెలిపారు. జనవరిలో రూ. 13వేల కోట్లుగా ఉన్న రుణభారాన్ని అంతర్గత వనరుల సమీకరణతో ప్రస్తుతం రూ. 11,000 కోట్లకు తగ్గించుకున్నట్లు వివరించారు.   

రుణాల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రమోటర్లకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు ఈ డీల్‌తో లభించగలదని జీ మాతృసంస్థ ఎస్సెల్‌ గ్రూప్‌ పేర్కొంది. ఇతరత్రా ఆస్తుల విక్రయం దిశగా ఇది ముందడుగని తెలిపింది. మీడియాయేతర ఆస్తులనూ విక్రయించాలని ఎస్సెల్‌ గ్రూప్‌ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్దేశించుకున్న సెప్టెంబర్‌ గడువులోగా రుణాల రీపేమెంట్‌ ప్రక్రియను పూర్తి చేయగలం‘ అని ఎస్సెల్‌ గ్రూప్‌ ధీమా వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కీలక వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికా కంపెనీలు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాంకాస్ట్‌ కార్ప్‌, జేమ్స్‌ మర్దోక్‌కు చెందిన లూపా సిస్టమ్స్‌, బ్లాక్‌ స్టోన్‌ గ్రూప్‌ ఐఎన్‌సీలు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సంస్థలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ యాజమాన్యం ముందు ఆకర్షణీయ ఆఫర్‌ను అందుబాటులో ఉంచినట్లు సమాచారం. ఈ గ్రూప్‌ సంస్థలు దాదాపు రూ. 19వేల కోట్ల విలువైన 51శాతం వాటాను కొనేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం. 

ఈ ఒప్పందం ఇది నాన్‌ బైండింగ్‌ బిడ్‌ అని ఈ డీల్‌ గురించి తెలిసిన వారు చెబుతున్నారు.  అంశంపై మాట్లాడేందుకు కాంకాస్ట్‌, బ్లాక్‌స్టోన్‌ ప్రతినిధులు నిరాకరించారు. ప్రస్తుతం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నిర్వహిస్తున్న సుభాష్‌ చంద్ర రుణభారం తగ్గించుకోవడానికి వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. దీంతో పాటు అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, స్థానిక చానెల్స్‌ పోటీని తట్టుకొనేందుకు అమెరికా కంపెనీలకు వాటా విక్రయించేందుకు ఆయన వ్యూహాత్మకంగా సుముఖంగా ఉన్నట్టుగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios