అత్యధికంగా టెక్నాలజీని వినియోగించుకున్న బీమా రంగం 2018లో ఎన్నో కొత్త మార్పులు, చేర్పులను చూసింది. జీవిత, ఆరోగ్య, వాహన బీమాలో కాలానికి తగ్గట్టు పాలసీల రూపాలూ మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా రంగంపై దృష్టి పెట్టడం గమనించగ దగిన పరిణామం. బీమా విలువను, ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలు పథకాలు తోడ్పడ్డాయి. బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి (ఐఆర్‌డీఏఐ) నిబంధనలను కఠినతరం చేస్తూనే.. పాలసీదారుల రక్షణకు అనేక చర్యలు తీసుకున్నది. ఇవన్నీ ఈ ఏడాది బీమా రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తోడ్పడ్డాయి.

పలు మార్పులకు గురైన బీమా రంగంలో ప్రత్యేకించి జీవిత బీమా రంగానికి ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. వృద్ధి పరంగా చూస్తే సాధారణంగా 15 శాతం నమోదు కావాల్సి న జీవిత బీమా రంగం.. ఈసారి ఇప్పటివరకూ 9.5శాతమే నమోదు చేసుకున్నది. ప్రైవేట్ బీమా సంస్థలు కాస్త ఫర్వాలేదనిపించినా.. ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసీ ఈ ఏడాది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ముఖ్యంగా ఈ సంస్థ ఏక ప్రీమియం పాలసీల్లో క్షీణత కనిపించింది. 

ఇక బ్యాంకుల వెన్నుదన్నుతో పాలసీలు చేసే ప్రైవేట్ బీమా సంస్థలూ ఈ ఏడాది గతంతో పోలిస్తే వ్యక్తిగత ప్రీమియంల వసూళ్లలో వెనకబడ్డాయి. ఆన్‌లైన్‌ పాలసీలపై అవగాహన పెరిగింది. అధిక మొత్తంలో పాలసీలు తీసుకునే వారి సంఖ్య కూడా గతంతో పోలిస్తే 25శాతం వరకూ పెరిగింది. ప్రీమియం చెల్లించకుండా ఆగిపోయిన బీమా పాలసీల స్వాధీన విలువను పెంచడం, రద్దయిన పాలసీల పునరుద్ధరణ వ్యవధిని రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకూ పెంచడం తదితర కీలక నిర్ణయాలను తీసుకున్నది జీవిత బీమా రంగం.  

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’పథకం ఈ ఏడాది ఆరోగ్య బీమా రంగంలో ఉత్సాహాన్ని నింపడంతో అధిక మార్పులు తీసుకొచ్చింది. తొలి దశలో పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీ అవసరాలను ఇది తేల్చి చెప్పడంతోపాటు, గ్రామీణులు కూడా ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునేందుకు ముందుకు వచ్చేందుకు కారణమవుతోంది. దీని ద్వారా తొలి దశలో సుమారు 10 లక్షల కుటుంబాలు బీమా రక్షణ పరిధిలోకి రానున్నాయి. 

మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికీ ఇతర చికిత్సలకు సంబంధించి బీమా పాలసీలు ఇవ్వాలనీ, జీవన శైలి వ్యాధుల విషయంలో కొన్ని నిబంధనలు సడలించడంలాంటివి ఐఆర్‌డీఏ తీసుకున్న నిర్ణయాలు. మధుమేహం, అధిక రక్తపోటులాంటి జీవన శైలి వ్యాధులతో పాటు, క్యాన్సర్‌లాంటి తీవ్ర రోగాలకు సంబంధించి బీమా సంస్థలు అనేక పాలసీలను తీసుకురావడం ఈ ఏడాది  ఆసక్తికర పరిణామాలుగా చెప్పుకోవచ్చు.  

2018లో మోటార్‌ వాహన బీమా విషయంలో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. దేశంలో తిరిగే ప్రతి వాహనానికీ థర్డ్‌ పార్టీ బీమా ఉండాల్సిందే. అయినా అధికశాతం వాహనాలు ఎలాంటి బీమా లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయి. దీన్ని నివారించే క్రమంలో నియంత్రణ సంస్థ కఠిన చర్యలను తీసుకున్నది. కొత్తగా కొన్న కార్లకు తప్పనిసరిగా మూడేళ్ల బీమా, ద్విచక్రవాహనాలకు ఐదేళ్ల బీమా పాలసీని తప్పనిసరి చేసింది. దీంతోపాటు వాహనదారుడికి ఏడాదికి రూ.750 ప్రీమియంతో రూ.15లక్షల విలువైన తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవాలనే నిబంధన తీసుకొచ్చింది.