బెంగళూరు: ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ కష్టాల్లో ఉన్నదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా శాఖ సేల్స్ విభాగం ఉపాధ్యక్షుడు, ప్రాంతీయ అధ్యక్షుడు నరేశ్ రామమూర్తితోపాటు ముగ్గురు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేశారు. గ్లోబల్ రిటైల్ బిజినెస్ హెడ్ కార్మేశ్ వాస్వానీ మరో సీనియర్ వైదొలిగారు.  

రామమూర్తి ఇన్ఫోసిస్‌లో సుమారు 15 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదిక ‘లింక్డ్ ఇన్’ ద్వారా ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సమస్యల పరిష్కారంపై కేంద్రీకరించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ సీఈఓగా సలీల్ పరేఖ్ కంపెనీని బలోపేతం చేసేందుకు.. సేల్స్ టీంను పటిష్ఠ పరిచేందుకు చర్యలు తీసుకుంటున్న తరుణంలో రామమూర్తి వైదొలగడం ఐటీ దిగ్గజానికి కష్టంగా పరిణమించింది. కీలక ఉద్యోగులైతే తప్పా తమ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలు, నియామకాలపై స్పందించబోమని ఇన్ఫోసిస్ పేర్కొంది. 

గత ఏప్రిల్ నెలలో ఇన్ఫోసిస్ కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్, లాజిస్టిక్స్ విభాగాలను రిటైల్ బిజినెస్‌లోకి తరలించింది. ఇన్ఫోసిస్ లావాదేవీల్లో ఫైనాన్సియల్ సేవల తర్వాత స్థానం రిటైల్ బిజినెస్‌దే. రామమూర్తి నిష్క్రమణ వల్ల సంస్థ లావాదేవీలపై పెద్దగా ఉండకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 

శక్తిమంతమైన సంస్థగా ఇన్ఫోసిస్‌లో ఇటువంటి నిష్క్రమణలు ఎటువంటి ప్రభావం చూపబోవని ఐటీ అండ్ టెలికం గ్రేహౌండ్ రీసెర్చ్ సంస్థ సీఈఓ సంచిట్ వర్ గోగియా పేర్కొన్నారు. 

 
 బ్లాక్ చైన్ సొల్యూషన్స్‌తో పని చేసేందుకు ఐబీఎం

భారత టెలికం సంస్థలతో కలిసి పని చేసేందుకు ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ (ఐబీఎం) ఆసక్తిగా ఉన్నది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్పీ), ‘డూ నాట్ కాల్ (డీఎన్సీ) రిజిస్ట్రీస్‌లో బ్లాక్ చైన్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేందుకు సిద్ధమైంది. ఐబీఎం రీసెర్చ్ ఉపాధ్యక్షుడు శ్రీరాం రాఘవన్ మాట్లాడుతూ ట్రాయ్, టెలికం ప్రొవైడర్లతో కలిసి పని చేసేందుకు అవసరమైన కాన్సెప్ట్ పూర్తి చేసిందన్నారు. 

నూతన సంవత్సరంలో బ్లాక్ చైన్ సొల్యూషన్స్‌ను ప్రారంభించనున్నామని తెలిపారు. ఏయే టెలికం ప్రొవైడర్ల పేర్లు చెప్పడానికి మాత్రం ఐబీఎం రీసెర్చ్ ఉపాధ్యక్షుడు శ్రీరాం రాఘవన్ నిరాకరించారు. ఈ విషయమై టెలికం రెగ్యులేటర్‌గా ట్రాయ్ చాలా వాస్తవిక ద్రుక్పథంతో వ్యవహరిస్తున్నదని శ్రీ రాఘవన్ చెప్పారు. మొబైల్ నంబర్ పోర్టబిలిటీలో ప్రత్యేకించి రెండు టెలికం ప్రైవడర్ల మధ్య బ్లాక్ చైన్ కీలక పాత్రపోషిస్తుందన్నారు. టెలికం ప్రొవైడర్లకు బ్లాక్ చైన్ కాన్సప్ట్ వినియోగంపై ట్రాయ్ ఇప్పటికే సమీక్షలు పూర్తి చేసింది. ఈ దిశగా గత మే నెలలో పలు నిబంధనలను రూపొందించింది.